Monday, December 24, 2018

కంకంటి పాపరాజు

కంకంటి పాపరాజు:

కంకంటి పాపరాజు 18 వ శతాబ్దికి చెందిన ఉత్తమ కవి.. ఆయన నెల్లూరు మండలం వారు. మదన గోపాల స్వామీ భక్తులు. చతుర్విధ కవితా నిపుణులు.. గణిత శాస్త్ర రత్నాకరులు.

 చేమకూర వెంకటకవి తర్వాతః మంచికవిగా పెర్కొనవలసినవారు పాపరాజు మాత్రమె'' అని కొందరు పండితుల భావన. పాపరాజు 'విష్ణుమాయావిలాసం '' అనే యక్షగానం రచించారు. ''ఉత్తర రామాయణం '' అనే ఉత్తమ గ్రంధం ద్వారా పాపరాజు కవిగా ప్రసిద్దికేక్కారు. అంతే కాకుండా వీరు తన రెండు గ్రంధాలు తన ఇస్తా దైవమైన నందగోపాల స్వామికి అంకితం ఇచ్చారు. కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణాన్ని మరింకేవ్వరు రాయలేరన్న విధంగా రచించారు.

జీవిత విశేషాలు:

ఆయన ముత్తాత పేరు కంకంటి వల్లభ మంత్రి. తాత పేరు అయ్యన మంత్రి. తండ్రి పేరు అప్పయ మంత్రి. తల్లి పేరు నరసమాంబ. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

అన్ని జన్మలలో ఉత్తమమైనది మానవ జన్మ అని, విద్యాబుద్ధులు నేర్చుకున్న కవి శ్రీ రామచంద్రమూర్తి దివ్య చరిత్ర ను పాడి కీర్తించక పోతే అట్టి పురుషుని జన్మ నిరర్ధకమని ఆయన రాసిన ఉత్తర రామాయణం లో పాపరాజు గారు పేర్కొన్నారు.

తన కృతి కి తగ్గ కృతి భర్త ను వెతుకుతుండగా, కలలో మదన గోపాల స్వామి కనిపించి, " ఇంతకు ముందు నాకు అంకితమిచ్చిన యక్షగానం లాగా ఉత్తర రామాయణంను కూడా తనకే అంకితం ఇవ్వమని, తద్వారా నీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి " అని చెప్పి అంతర్థానం అయ్యారు.

వారు అలాగే ఉత్తర రామాయణం రాసి, మదన గోపాల స్వామికి అంకితం ఇచ్చారు.

తెలుగు సాహిత్యంలో చదవదగిన గ్రంధాలలో కంకంటి పాపరాజకృత ఉత్తర రామాయణ కావ్యం మరువరానిది. సరళమైన భాషతో ధారాళమైన శైలితో హృదయావర్జకమైన రీతితో వ్రాయబడిన యీకావ్యం కవితా ప్రియంభావులైన పాఠకులకు మరపురాని మహత్తర కావ్యం. కరుణ రసార్ద్రమైన సీతా పరిత్యాగ ఘట్టం పాఠకులకు కన్నీరు నించుచు రసానంద తుందిలమై
యొప్పారు చున్నదనుట యదార్ధము

ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్

ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించారు పాపరాజు.

లక్ష్మణుడు చెప్పిన వార్త విన్న సీత పరిస్థితిని యిలా వర్ణించాడా కవి:

ఊరక వెక్కివెక్కి యేడ్చుచు, నేడుపు విడిచి మౌనంబు పూనుచు, మౌనంబు మాని తనలో దా నగుచు, నగవుడిగి తల యూచుచు, దల యూచుట విడిచి ముక్కుపై వ్రేలు గీలుగొలుపుచు, జాలిగొని హాహాకారంబు సలుపుచు, దలపని తలపులివిగో! చూచితే? లక్ష్మణా! యని యతని దిక్కు చూడ్కులు నిగిడించి యిట్లనియె:

అడలకు మన్న! నీకు వసుధాధిపునానతి దాట వచ్చునే?
యిడుముల జెందుమంచు విధి యీ ధర నన్ను సృజించి యుండగా
గడవగ నెవ్వరోపుదురు? కానల కేగిననాడె యాపదల్
గడచితి నంచు నుంటి; నెఱుగన్ దుది నిట్లగు నంచు నా మదిన్

కళవళమంది తెల్పితివొ? కాక పరాకున దప్ప వింటివో?
కల నయినన్ రఘూద్వహుడు కానలలో నను ద్రోయ బంచునే?
తెలిసి గణింపు లక్ష్మణ! మతిభ్రమ యైనదొ? హా! సహింపు మి
ప్పలుకు; లెఱుంగ కంటి; వెత బాటిలె; నీకొక భ్రాంతి యున్నదే!

కవి చిత్రించిన యీ దృశ్యానికి వ్యాఖ్యానమక్కరలేదు. కనులముందర కదలాడి కనులలో నీరు చేరక మానదు. లక్ష్మణా నీకు మతికాని భ్రమించ లేదు కదా అని, మళ్ళీ అంతలోనే, నన్ను క్షమించు, బాధలో అలా అన్నాను కాని నీకు భ్రాంతి కలగడమేమిటని మరింత శోకమగ్న అయిన జానకీదేవి యిలా అంటుంది:

ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును; నన్నిక రామచంద్రుడున్
గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణ మేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు; నాదు మే
నున్నది; చెంత గంగమడు గున్నది; యైనటు లయ్యెడున్ దుదిన్

రామునికి "చెవులారాగ" తన స్థితిని చెప్పమంది సీత. ఆమె మనసులోని ఉద్వేగమంతా ఆ ఒక్కమాటలో వ్యక్తం చేసారు పాపరాజు! రాముడు తనని వదిలేసాడన్న బాధకన్నా, తనకి ఒక్కమాటకూడా చెప్పకుండా పంపించేసాడన్న బాధే సీత మనసుని ముక్కలుచేసింది.

ఎఱగని మూఢులాడుకొను నెగ్గులకున్ భయమంది, యప్పుడే
కఱకుమనంబుతో విభుడు కాననసీమకు బంచెగాక; య
త్తెఱ గొకసారి నన్ బిలచి, తెల్పి, మనోవ్యథ దీర్చి, నిన్ను నే
మఱనని బంపడయ్యె; నభిమానము గూర్మియు నెందుబోయెనో!

దీనికి రాముని దగ్గర సమాధానం లేదు!

ఈ నాతి కౌనుతో ఎనకాక కాబోలు సింగముల్ గుహలలో చిక్కుటెల్ల/ ఈ బాల నడలతో ఎనకాక కాబోలు ఏనుంగు లడవిలో ఈగుటెల్ల/ ఈ చెల్వ చూడ్కిడో ఎనకాక కాబోలు సారంగముల్ పొదల దూరుటెల్ల/ ఈ కన్య ఘనవేణి ఎనకాక కాబోలు నహులు పుట్టలు సొచ్చి అడగుటెల్ల/ ఈ నెలత చేరి కాబోలు ఇంచువింటిచెం చతనుడయ్యు జగము జయించుటెల్ల/ ఈ లలన సృష్టి సేసి కాబోలు పంకజాసనుడు విశ్వమున స్రష్ట అగుట ఎల్ల’ - మయుడి వెనక నడుస్తూ వస్తూన్న అతగాడి కూతురు ‘మందోదరి’ని చూసిన రావణుడి మనసులో తలెత్తిన భావాలను కంకంటి పాపరాజు వర్ణించిన తీరిది. ‘ఉత్తరరామాయణ’ కావ్యం ప్రౌఢిమను పట్టి చూడడానికి - ఎత్తుగీతితో కూడిన ఈ సీసం అనే - మెతుకు ఒక్కటి చాలదూ? అందగత్తెల్ని సింహమధ్యలుగా వర్ణించడం ప్రచురం. మందోదరి సన్నని నడుముతో పోటీపడలేక, మొహం చెల్లక, సింహాలు గుహల్లో దాక్కున్నాయట. గజగమనలుగా సుందరీమణులను వర్ణించడం మరో ప్రసిద్ధ ఉపమానం. మందోదరి హొయలుతో పోటీపడలేక, ఏనుగులు అడవులు పట్టి పోయాయంటన్నాడు కవి. సుందరీమణుల కన్నుల్ని లేడి కన్నులతో పోలుస్తారు. మందోదరి చూపులతో పోటీపడలేక, జింకలు అడవులు పట్టి పోయాయంటున్నాడు కవి. సుందరీమణుల జడలను పాములతో పోలుస్తారు. మందోదరి జడతో పోటీపడలేక, పాములు పుట్టల్లో దూరి పోయాయంటున్నాడు కవి. ఈమె సాయంతోటే కాబోలు చెరకువింటి వేటకాడు మన్మథుడు ప్రపంచాన్నంతటినీ జయిస్తున్నాడు - ఈమెని సృష్టించినందువల్లనే ఆ బ్రహ్మదేవుడికి విశ్వసృష్టికర్త అనే పేరు వచ్చింది కాబోలనుకున్నాడట రావణుడు. అహల్యా, సీతా, కుంతీ, ద్రౌపదులతోపాటు పంచకన్యల్లో ఒకామె మందోదరి. ఆమె అంత అందగత్తె అన్నమాట! ఈ మందోదరే, మండోదరి పేరిట తెలుగులో ప్రసిద్ధ.
తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసి ఆరున్నర శతాబ్దాలు గడిచిన తర్వాత, తిరిగి ఉత్తర రామాయణాన్ని రాయడానికి తలపెట్టిన కంకంటి పాపరాజు నిజంగానే సాహసి. శిల్ప సంవిధానంలో పారంగతుణ్ణయి నిర్వచనోత్తర రామాయణ రచనకు పూనుకుంటున్నానని చెప్పుకున్నాడు తిక్కన. ఒక్క వచనం ముక్కయినా రాయకుండా, ఉత్తర రామాయణాన్ని చెప్పిన దిట్టతనం ఆయనది. ఇక, సంస్కృతంలో ఉత్తర రామకథను భవభూతి కరుణ రసాత్మకమయిన నాటకంగా రాశాడు. అదే ఉత్తర రామచరితం. ‘ఏకో రసః కరుణ ఏవ’ అని తాను దర్శించి, మన చేత దర్శింప చేసేందుకే భవభూతి ఈ నాటకం రాశాడంటారు. ‘వరుసం తిక్కనయజ్వ నిర్వచన కావ్యంబై తగం చేసె నుత్తర రామాయణ మందున స్మరి ప్రబంధం పూని నిర్మించుటే సరసత్వంబని ప్రాజ్ఞులార నిరసించంబోకుడీ రాఘవేశ్వరు చారిత్రము లెంద రెన్నిగతుల న్వర్ణించినం క్రాలవే?’ అని తనను తాను సమర్థించుకున్నాడు పాపరాజు. ‘మరలనదేల రామాయణమని’ అడక్కుండానే దానికి సమాధానం చెప్పేశాడు పాపరాజు. కంకంటి తన ప్రయత్నంలో గొప్ప సఫలుడయ్యాడని వీరేశలింగం, నోరి నరసింహశాస్ర్తీ తదితర పండితులూ విమర్శకులూ ప్రశంసించారు. వాస్తవానికి - నోరి వారన్నట్లుగా - తెలుగు సంప్రదాయ కవితలో ఉత్తరామాయణమంటే, కంకంటి ప్రబంధమే గుర్తుకొస్తుంది తప్ప తిక్కన రచన తలపునకు రాదు!
‘అక్కడక్కడ గొన్ని వ్యాకరణ దోషములున్నను, మొత్తము మీద నీతని కవిత్వము మిక్కిలి రసవంతమయిన’దని ఉదారంగానే పాపరాజు రచనా రీతికి యోగ్యతాపత్రం ఇప్పించారు వీరేశలింగంగారు. కానీ, శబ్దరత్నాకర కర్త మాత్రం పాపరాజును నాలుగో తరగతి కవిగా పరిగణించడానికి వెనకాడలేదు. అయితే, కృష్ణదేవరాయలు, చేమకూర వెంకటకవి, కూచిమంచి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి, పొన్నిగంటి తెలగన్నలతోపాటు పాపరాజుకు ‘సహశ్రోత’ అయిన పుష్పగిరి తిమ్మన్నను కూడా ఇదే తరగతిలో వేసి అతగాడికి ఒకింత ఊరట కలిగించారు బహుజనపల్లివారు!

 పద్యాన్ని గజ్జెల గుర్రంలా నడిపించడంలోనే కాకుండా పంచచామరం లాంటి వృత్తాలను సార్థకంగా నిర్వహించడంలో సయితం పాపరాజు అందెవేసిన చెయ్యి. బహుశా, యక్షగానం రాసి వుండిన అనుభవం వల్ల కాబోలు జంపెలను కూడా ససందర్భంగా వినియోగించాడు. ఇక, ‘హరినీలముల కప్పు, అళిజాలముల ఒప్పు, కల కొప్పు రహి మెప్పు కులుకుదాని..’ లాంటి సీసాలను శ్రీనాథుడి మూసల్లో పోసి తీశాడు పాపరాజు. ‘శరశరాసన ముసల ముద్గర కృపాణ తోమర గదాది సాధన స్తోమ పూర్తి మిక్కుటంబైన తేరెక్కి వెడలె వింశతిభుజుండు త్రైలోక్య విజయకాంక్ష’ లాంటి సందర్భాల్లో ప్రయోగించిన శైలి పాపరాజు ఔచిత్య విచారానికి నిదర్శనం.

చిత్రమేమిటంటే, తెలుగులో వచ్చిన ఉత్తర రామాయణాలు రెండూ ‘నెల్లూరు మండలం’ నుంచే వెలువడ్డాయి. ఈ రెండు ఉత్తర రామాయణాలు రాసినవాళ్లూ పెద్దపెద్ద ఉద్యోగాలు చేసిన అధికారులే. తిక్కన సరేసరి! కంకంటి పాపరాజు ప్రళయ కావేరి రేవు పట్నానికి ‘అమీను’గా ఉండేవాడట. 1760 దశకంలో ఉత్తర రామాయణం రాయక ముందే పాపరాజు ‘విష్ణుమాయా విలాసం’ అనే యక్షగానం రాశాడట. దాన్ని తన ఇలవేలుపు మదన గోపాలుడికి అంకితమిచ్చాడట. ఉత్తర రామాయణం రాయాలనే ఆలోచన పాదుకుంటున్న తరుణంలో అదే మదనగోపాలుడు పాపరాజుకి కలలో కనిపించి, ప్రబంధ పాకంలో రాయతలపెట్టిన ఆ కావ్యాన్ని తనకే అంకితమివ్వమని అడిగాడట. అప్పటికే కవిగా నిలదొక్కుకున్న పుష్పగిరి తిమ్మన్నను పిలిపించి జరిగిందంతా చెప్పుకున్నాడట పాపన్న. అది విని ఆనందించిన తిమ్మన్న ‘అన్నా! రామకథకి కృష్ణుడు రాజవడం జరిగితే, మేలిమిబంగారానికి కృతవర్ణాంచిత రత్నం అబ్బినట్లవుతుంది’ అని నోరారా అభినందించాడని పాపన్న రాసుకున్నాడు. కానీ, ‘చరిత్రకారులు’ కొందర పుష్పగిరి తిమ్మన్న నుంచే, పాపరాజు ఈ కావ్యాన్ని కొనుక్కున్నట్లు పుకారు పుట్టించి, పుణ్యం కట్టుకున్నారు. తిమ్మన్న పద్యాలు చదివిన వాళ్లు ఎవరూ ఈ ప్రచారాన్ని నమ్మజాలరు.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు
పరిశోధకులు

Friday, November 23, 2018

పరవస్తు చిన్నయసూరి


పరవస్తు చిన్నయసూరి
పరవస్తు చిన్నయ సూరి (1809-1861) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే.

బాల్యం

చిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వేంకటరంగయ్య. జన్మనామం చిన్నయ. చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.

చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.

ఉద్యోగం, రచనా ప్రస్థానం

చిన్నయ మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు. సూరి అనగా పండితుడు అని అర్థం.

రచనలు

అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, ఆంధ్రకౌముది, ఆంధ్రధాతుమాల, ఆంధ్రశబ్ద శాసనము, అకారాది నిఘంటువు, ఆదిపర్వవచనము - 1847, ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము, చాటు పద్యములు, చింతామణివృత్తి - 1840, పచ్చయప్ప నృపయశోమండనము - 1845, పద్యాంధ్ర వ్యాకరణము - 1840, బాల వ్యాకరణము - 1855, బాలవ్యాకరణ శేషము, నీతిచంద్రిక - 1853, నీతిసంగ్రహము - 1855, యాదవాభ్యుదయము, విభక్తి బోధిని - 1859, విశ్వ నిఘంటువు, శబ్దలక్షణ సంగ్రహము - 1853, సుజనరంజనీ పత్రిక, సంస్కృత బాలబోధ, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము - 1844.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు 

దేవులపల్లి కృష్ణశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన.

మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…

ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…

కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…

తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..

పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…

పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…

గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…

అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…

ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .

“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…

మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వారమైన మనకే ఎంతో అవమానం…

ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..

అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..

“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”

అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…

కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…

అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…

“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…

సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..

చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…

తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..

మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…

చిత్ర పరిశ్రమకు సంభందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..

గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..

ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలో మారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..

“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..

ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..

అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..

కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..

మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..

“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”

తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్న అక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..

అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…
మీరే చదవండి .తెలుస్తుంది .

శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…

అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…

ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…

మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…

ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…

ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…

అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…

ఆ తరువాత అందులోని విషయాన్ని సంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…

ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…

“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ  ఉగాదులూ  వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…

ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…

అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..

“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..

ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…

చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…

దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…

“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…

నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…

నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”

తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపడి మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..

ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని

“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు  అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…

అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాడించారు శాస్త్రిగారు…

“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”

వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…

“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..

“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”

దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు..

దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..

“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”

“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…

ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..

వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…

కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…

“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…

గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..

“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “

“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…'” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..

వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…

అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…

వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…

“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..

“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”

“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…

ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….

ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా  వున్నారు…

అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..

ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..

మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు

“…అయ్యా  మీరిక్కడేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా  ” అని…

దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..

“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ  ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..

అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…

ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..

సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..

ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..

ఆ పాటే…
అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”

ఉపసంహారం

ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…

వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…

“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం)

“.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు)

“..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం)

“..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం)

మొదలైనవి…

ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..

“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు

తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను  మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ…  రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..

ముక్తాయింపు

“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” --కృష్ణపక్షం. జాతీయగీతం అనిపించే ‘జయ జయ ప్రియభారత జనయిత్రి’ రచయిత గానేకాక ఎన్నో సినీ లలితగీతాలను మనకందించిన శ్రీ దేవులపల్లి వారిగురించిన ఈ వ్యాసం చాల చాల బాగుంది. చదివి సంతోషిస్తారు అనుకుంటాను.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు 

Tuesday, November 6, 2018

సాహిత్య భగీరధుడు - దాశరధి

సాహిత్య భగీరథుడు - దాశరధి

అరిశిరస్సుల నుత్తరించిన / అలుగునేనే తెలుగు నేనే
అఖిలజగములు చుట్టివచ్చే / పులుగు నేనే, తెలుగునేనే

తెలుగు నేనే, వెలుగునేనే... అని విశ్వరూపాన్ని ప్రద ర్శించిన మహాకవి దాశరధి. ఆయన మహాంధ్రోదయం’’ తెలుగు ఊరులు, తెలుగు వారలు ప్రతిఫలించేకావ్యం. దాశరధికి కావలసింది మహాంధ్రోర్వర. అందుకే తూ రుపు దారికెదురుగా ఉన్న ద్వారబంధాన్ని, మనిషి మన స్సుదారుల రాగబంధంగా వీక్షించాడు. మూడు కోటుల నొక్కడే ముడి బిగించి, మహాంధ్ర సౌభాగ్యగీతాన్ని ముక్త కంఠంతో ఆలపించి అఖిలాంధ్ర ప్రజల హృదయ తంత్రులను మీటిన మేటికవి దాశరధి కృష్ణమా చా ర్యులు. దాశరధి 1927 సెప్టెంబరులో వరంగల్లులోని మానుకోట తాలూకాలోని గూడూరు గ్రామంలో జన్మిం చారు. దాశరధి పుట్టుకతోనే అగ్నిశిఖలాంటి ప్రతిభా మూర్తి. చిన్నతనంలోనే కవితా వ్యవసాయం చేపట్టాడు. ఆ రోజుల్లో కవిసమ్మేళనాల్లో ఈ కవి గొంతెత్తి కవితా గానం చేస్తుంటే ఎవరీ కుర్రకవి, అంటూ అందరూ ఆశ్చ ర్యపోయేవారట. ఆయన జీవితాన్ని ఒక మహా కవితా యజ్ఞంగా భావించారు. అందుకే దాశరధి ఒక మహా కవిగా, ప్రజాకవిగా, ఉద్యమోపజీవిగా జనం గుండెల్లో నిలచిపోయారు. చెట్టుకి ఆకులు వచ్చినట్లుగా కవికి కవి త్వం రావాలని. లేని కవితావేశాన్ని బలవంతాన తెచ్చి పెట్టుకోకూడదు. కవిత్వంగా సహజంగా రావాలి అన్నంత సహజమైనది దాశరధి కవిత్వం. అందుకు మచ్చుతునక ఈ పద్యం.
‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి / ఆకాశ మంత యెత్తార్చినాను / నేను రాక్షసి గుండె నీరుగా, పద్యాలు / పాడి మానవుని కాపాడినాను / నేను వేస్తంభాల నీడలో నొకతెల్గు / తోట నాటి సుమాలు దూసినాను / నేను పోతన కవీశాను గంటములోని / ఒడుపుల కొన్నింటి బడసినాను / కోటి తమ్ములకడ రెండుకోట్ల తెలుగు / టన్నలను గూర్చి వృత్తాంత మం దజేసి / మూడు కోటుల నొక్కటేముడి బిగించి / పాడి నాను మహాంధ్ర సౌభాగ్యగీతి’’ కొదమ సింహం గర్జిం చినట్లుగా ఉన్న ఈ పద్యాన్ని చూస్తే మహాకవి కలం ఏమిటో సాక్షాత్కరిస్తుంది. మాతృభూమిని, మా తృభాష లను మెన్నతంగా భావించి పులకించిన వైనం దాశర ధిలో కనిపిస్తుంది. మహాంధ్రోదయంలోని తెలంగాణ అనే మొదటి ఖండికలో మాతృభూమిని వేనోళ్ల ప్రశంసిస్తాడు.

కోటి తెలుగుల బంగారు కొండ క్రింద /  పరుచుకొ న్నట్టి సరసులోపల వసించి / ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు / నా తెలంగాణ తల్లి కంజాత తల్లి అని అనడంలో ‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’’
అనే ఆర్యోక్తి అభివ్యక్తీకరించబడింది. తనను కని, పెం చి, పెద్దచేసి మెజ్వల జీవితాన్ని ప్రసాదించిన తెలం గాణ తల్లిని కంజాత తల్లిగా కొనియాడి తన కృతజ్ఞతను చాటుకున్నాడు.

ఆధునిక ప్రపంచంలో ఏ దేశంలో నైనా వర్గసంఘర్షణ, ప్రచ్ఛన్న యుద్ధాలు కనబడుతూనే ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం చంద్రమండలానికి దారితీసినా, మారణె మాని కి కూడా వినియోగించబడుతుంది. విజ్ఞానం రాజకీయ స్వార్ధ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఆర్ధి క అసమానతలు పొడచూపుతూనే ఉన్నాయి. తత్ఫలి తంగా ప్రపంచశాంతికీ, మానవత్వానికీ స్థానం ప్రశ్నా ర్థకమవుతుంది. మనిషి కోసమే ఈ ప్రపంచం అనేవాళ్లు సైతం మానవతావాదాన్ని పెడదోవ పట్టిస్తున్నారు. భా రతీయులు ప్రజాస్వామ్యవాదులు, ప్రపంచ శాంతి కాముకులు.

‘‘ ఏనాడెవ్వడూ కత్తితో గెలువలేదీ విశ్వమున్, ప్రేమ పాశానన్ కట్టుము నాలుగుంబది ప్రపంచాలన్’’  అంటూ శాంతి లేకపోతే మానవజాతికి మనుగడే లేదు అనే సత్యాన్ని గుర్తించి, లోకమంతా శాంతిపథంలో నడవాలని ఆశించి క్రాంతి కలాన్ని, శాంతి ఖడ్గాన్ని చేతపట్టి కవన, కదన రంగాలలో స్వైరవిహారం చేసిన మానవతామూర్తి దాశరథి. శాంతి ప్రభోదాత్మకమైన కవితా ప్రపంచంలో దాశరథి ‘‘కపోతసందేశం’’ అగ్రశ్రే ణికి చెందిన కావ్యం. ఇందులో హింసను, దానవాంశను నిరసించి, శాంతిని, మానవత్వాన్ని నెలకొల్పే శాంతి సందేశాన్ని కపోతం ద్వారా లోకానికి అందిస్తాడు. శాంతి కోసం ఇతను చెందిన ఆవేదన అంతులేనిది. కనీసం కావ్యాల్లో నైనా శాంతిని బతికించాలని రచయితలకు సందేశాన్ని ఇచ్చిన దాశరధి శాంతి ప్రియత్వం ఎంతో మహత్తరమైనది. గౌతమ బుద్ధుడు, క్రీస్తు, గాంధీ మహాత్ముడు. ఈ ముగ్గురూ అహింసామూర్తులు, శాంతి దూతలు. వీరిజీవితాలు లోకకళ్యాణానికి, విశ్వసౌభాగ్యా నికి అంకితం చేయబడ్డాయి. ఈ ముగ్గురిని ఆదర్శంగా గ్రహించి దాశరధి తన వ్యక్తిత్వంతో పాటుగా, కవిత్వాన్ని కూడా పునీతం చేసాడు. బుద్ధుని వారసునిగా గాంధీజీని అభివర్ణిస్తాడు.
‘‘ అంటరానివారలమని అలమటించు / పంచముల హరిజనులని పాంచజన్య / మూది పలికిన హరిజనాభ్యుదయవాది / గాంధి మహనీయుడే లోకబాంధవుడు’’  అని గాంధీ సుగుణాన్ని వర్ణించాడు.

ముకిళిత పద్మాలను వికసింపచేసి లోకానికి వెలుగులు పంచే లోకబాంధవుడు సూర్యుడు. అలాగే గాంధీ మహా త్ముడు కూడా ముడుచుకుపోయిన మానవ హృదయ పద్మాలను వికసింపచేసి, విజ్ఞాన వెలుగులు పంచాడనే భావాన్ని వ్యక్త పరచాడు. ఈ గాంధేయవాది విప్లవాన్ని హింసతో కంటే ప్రేమతోను, త్యాగంతోను సాధించ వచ్చునని నమ్ముతాడు.
 నీగ్రోపై ‘‘నల్లనివాడ జ్ఞాన నయనమ్ములవాడ’’ అంటూ పోతన శైలిలో పద్యం చెప్పిన నవనీత హృద యుడు మన దాశరథి. ఇతనికి యుద్ధాలూ, మతోన్మా దాలు, మారణెమాలే గిట్టవు. అణ్వస్త్రపు గ్రీష్మానికి ప్రతీ పద్యం ఒక మబ్బుపింజ కావాలని ఇతని ఆకాంక్ష. అంత:కలహాలు పనికి రావు, అంతరంగ బంధాలు, అనురాగ రాగాలు కావాలి అని ఐక్యతా సంగీతాన్ని వినిపిస్తాడు.

పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, మహాబోధి, గాలిబ్ గీతాలు , మొదలైన రచనలు చేసి ఎన్నో సన్మానాలు, జాతీయ స్థాయి అవార్డులతో సత్కరింపబడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిపీఠాన్ని అలం కరించాడు. ‘‘నా జీవితమే నా పోరాటం, ఎన్నో ప్రతీప శక్తులతో పోరాడాను, పోరాడగలను, నేను ఆశావాదిని. దురాశావాదులు నిరాశపడతారు. ఆశావాదికి నిరాశ లేదు. నమ్రతతో నా దారిన నేను పయనిస్తాను. నా గమ్యం ప్రపంచ శాంతి, నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం. జనం మనం మనం జనం, జనం లేక మనం లేము’’ అని నుడివిన దాశరధి జనం తానుగా తాను జనంగా బతికిన మానవతావాది, శాంతి కాముకుడు. ఆయన తెలుగువారి గుండెల్లో  నిలిచిన ‘కళాప్రపూర్ణుడు’, సాహిత్య భగీరథుడు.

యమ తర్పణం నరక చతుర్దశి

యమ తర్పణం నరక చతుర్దశి

శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి 'నరక చతుర్దశి' అనే పేరు వచ్చింది. ఆశ్వియుజ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందుగానే నువ్వులు నూనెతో అభ్యంగన స్నానం చెయ్యాలి. స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి.

శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి 'నరక చతుర్దశి' అనే పేరు వచ్చింది. ఆశ్వియుజ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందుగానే నువ్వులు నూనెతో అభ్యంగన స్నానం చెయ్యాలి. స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి. ఇక్కడ చంద్రోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది. అప్పటికి ఒక గంట లోపు మాత్రమే, రాత్రి సమయం ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని " గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం).

దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మిదేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. “సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.

నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి. 1. యమాయ నమః 2. మృత్యువేనమః 3. వైవస్వతాయనమః 4. సర్వభూతక్షయాచ నమః 5. ధ్ధ్నాయనమః 6. పరమేష్టినే నమః 7. చిత్రాయ నమః 8. ధర్మరాజాయ నమః 9. అంతకాయ నమః 10. కాలాయ నమః  11. ఔదుంబరాయ నమః 12. నీలాయ నమః 13. వృకోదరాయ నమః 14. చిత్రగుప్తాయతే నమః -  అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.


ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

“చతుర్దశ్యాం తు యే దీపాన్‌,
నరకాయ దదాతి చ|
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్‌ స్వర్గ మాప్నుయుః|| అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

దీపావళి పండుగ ఎలా వచ్చింది ?

దీపావళి పండుగ ఎలా వచ్చింది ?

పిల్లలూ! దీపావళి పండుగ అంటే మీకు చాలా ఇష్టం కదూ! దీపావళి వచ్చిందంటే మీ కళ్ళలో వెలిగే సంతోషం ముందు కోటి మతాబుల వెలుగు కూడా దిగదుడుపే. స్కూల్ లేకపోయినా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపడం కొంచెం కష్టమే అయినా అలమరలో దాచుకున్న టపాసులు గుర్తుకు రాగానే నిద్రమత్తు ఇట్టే వదిలిపోతుంది.

తల స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కొత్త బట్టలు తొడుక్కుని, నాన్న కొని తెచ్చిన టపాసులను తీసుకుని మేడ మీదకు వెళ్ళి వాటిని కాలుస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరి మిమ్మల్ని ఇంత ఆనందపెడుతున్న దీపావళి ఎలా వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.

రామాయణం గురించి మీరు వినే ఉంటారు. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరధుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు.

ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.

మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరి చేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.

Monday, October 29, 2018

విప్లవ సాహిత్య సృష్టి - కలేకూరి ప్రసాద్

 విప్లవ సాహిత్య సృష్టి  - కలేకూరి ప్రసాద్

జ్యోతి రావు బాపూలే, పెరియార్‌, అంబేడ్కర్‌ భావజాలంతో పాటు, మార్క్సిజం ప్రభావం కూడా దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. "దేశీయ మార్స్కిజం' అనే భావన కూడా తెలుగు దళిత సాహిత్యంలో చర్చలోకొచ్చింది. అందువల్ల దళిత సాహిత్యాన్ని కాలం, స్వభావాలను అనుసరించి గుర్తించవలసి ఉంది. అయినా, దళిత సాహిత్యం ఆవిర్భవించటానికి శతాబ్దాల సామాజిక పీడనను ఎదుర్కొన్న చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుండే "దళిత సాహిత్యం' స్పష్టమైన అంబేడ్కర్‌ తాత్త్విక భావజాల భూమికతో ఆవిర్భవించింది

దళిత సాహిత్యం - చారిత్రక నేపథ్యo అపౌరుషేయాలని భావించే వేదాల్లో (ఋగ్వేదం-10వ మండలం పురుష సూక్తం) చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన కనిపిస్తుంది. దాని ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ సాంఘిక అసమానతలకు కారణమయ్యింది. కులం వల్ల కలిగిన జ్యోతి బాపూలే నిమ్నజాతుల ఉద్ధరణ కోసం "సత్య శోధక సమాజం' (1873) స్థాపించారు. పూలే హిందూమతంలోని లోపాలను వివరిస్తూ అనేక పుస్తకాలను రాశారు. 1910లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశం అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 1918లో అఖిలభారత దళితజాతుల సమావేశాలు బొంబాయిలో జరిగాయి. 1924లో డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ అస్పృశ్యత నివారణోద్యమాన్ని ప్రారంభించారు.ఈ ప్రభావం భారత దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో బలంగానే కనిపించి, దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి. తెలుగువారికీ ఈ ఉద్యమాలు మార్గదర్శకమయ్యాయి. 1967 నాటికి జ్యోతిబా పూలే, సాహూ మహారాజ్‌, [కారల్‌ మార్క్స్‌] సిద్ధాంతాలు నీగ్రో సాహిత్యంలోని తిరుగుబాటు కలగలిసి అంబేడ్కర్‌ భావజాలాన్ని ప్రధానంగా చేసుకొని "దళిత సాహిత్యం' ఆవిర్భవించింది.

1981లో భారతీయ దళిత సమాచార పత్రికా సంపాదకుల సదస్సు జరిగింది. 1984లో భారతీయ దళిత సాహిత్య అకాడమీనీ స్థాపించారు. కాన్షీరామ్‌ 1984 నాటికి అంబేడ్కర్‌ భావజాలంతో బహుజన సమాజ్‌ పార్టీని స్థాపించారు. దీనితో రాజకీయంగా కూడా దళితులలో చైతన్యం వెల్లువెత్తింది. ఈ ప్రభావం కూడా తెలుగు సాహిత్యంపై కనిపించింది.

1968లో కంచకచర్లలో కోటేశుని సజీవ దహనం చేయడం, 1985 జూలై 17న కారంచేడు ప్రాంతంలో దళితులపై మారణకాండ సాగించడం వంటి సంఘటనలు జరిగాయి. 1990 ఆగస్టు 6న చుండూరులో దళితులను ఊచకోత కోశారు. దీనితో అంతవరకు సంస్కరణోద్యమ, అభ్యుదయ, విప్లవ సాహిత్యం రాస్తున్న తెలుగు రచయితలు, కవులు దళిత సాహిత్యం పై దృష్టిని కేంద్రీకరించారు.అభ్యుదయ సాహిత్యం పీడిత శ్రామిక వర్గ సమస్యలలో భాగంగానే దళిత సమస్యలకు పరిష్కారాన్ని సూచించింది. అది ఎక్కువగా ఆర్థిక సంస్కరణలకే ప్రాధాన్యాన్నిచ్చింది. విప్లవ సాహిత్యం గిరిజన సమస్యలతో పాటు దళిత సమస్యలను వర్గ దృష్టితో ప్రత్యేక ప్రాధాన్యాన్నిచ్చింది. ఆర్థిక కోణానికి అధిక ప్రాధాన్యాన్నిచ్చే విప్లవ స్పృహతో సమాంతరంగా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా దళిత చైతన్యం విస్తరించింది. వర్గం కంటే దళిత సమస్య "కులం' తోనే ముడిపడి ఉందని గుర్తించి, ఆ అంశాలను ప్రధానంగా తీసుకొచ్చింది.

1909లో ఒక కుసుమ ధర్మన్నకవి రాసిన ""మాలవాండ్ర పాటను తొలి దళిత గేయంగా పరిశోధకులు భావించారు. ఇది ఆంధ్రభారతి (బాధ్రపద) మాసపత్రికలో అచ్చయ్యింది. ఆ తరువాత గురజాడ అప్పారావు 1911లో కుల సమస్యను స్పర్శిస్తూ ముత్యాలసరాల్లో రాశారు. 1915లో మంగిపూడి వేంకటశర్మ ""నిరుద్ధ భారతం అనే పద్య కావ్యాన్ని రాశారు. అస్పృశ్యతను నిరసిస్తూ దళితేతరులు రాసిన తొలి పద్యకావ్యంగా దీన్ని విమర్శకులు భావిస్తున్నారు. కొండపల్లి జగన్నాథరావు 1921లో రాసిన ""మేలుకొలుపు గీతం పురాణాల్లో దళితుల గొప్పతనాన్ని కీర్తించే విధంగా ఉంది. 1930లో జాలా రంగస్వామి రాసిన ""అంటరానివాడెవ్వడు పాట, 1933లో కుసుమ ధర్మన్న రాసిన ""హరిజన శతకం దళితుల మనోభావాలను బాగా పట్టుకోగలిగాయి. 1933లోనే కుసుమ ధర్మన్న రాసిన ""మాకొద్దీ నల్ల దొరతనము గేయం ఒక ఊపు ఊపింది.

గుర్రం జాషువా రాసిన ""గబ్బిలం(1941) కావ్యంలో దళితుల వేదనా భరిత జీవితాలను, అప్పుడే మొలకలెత్తుతున్న తిరుగుబాటు స్వభావాన్ని శక్తివంతంగా అభివ్యక్తీకరించారు. ఈయనే రాసిన ""నా కథ దళిత ఆత్మ కథకు ప్రేరణనిచ్చే రచన. బోయి భీమన్న పురాణేతిహాసాల సమగ్ర అవగాహనతో గాంధీ, అంబేడ్కర్‌ తాత్త్విక భావాల సమ్మేళనంతో గొప్ప రచనలు చేశారు. ""గుడిసెలు కాలిపోతున్నై, ""రాగవాశిష్టం ""పాలేరు వంటివి బోయి భీమన్న రచనలలో ప్రముఖమైనవి. ఈ రచనలు దళితులకు గొప్ప ప్రేరణనిచ్చాయి. ఇలా అస్పృశ్యతను నిరసిస్తూ దళిత, దళితేతరులు అనేక రచనలు చేశారు.

దాదాపుగా ఈ రచనలన్నీ ""జీవితానుభవాలనుంచి పొందిన స్పందన, నిరసన, సంస్కరణ, ఉద్ధరణ, విమర్శ, విజ్ఞాపన, సంఘటన, ప్రతిఘటన దశలుగా పరిణామం చెందాయని విమర్శకులు భావిస్తున్నారు. 1968లో కృష్ణా జిల్లా కంచికచెర్లలో కోటేశు అనే దళితునిపై అగ్రవర్ణాల వారు దొంగతనం కారణాన్ని మోపి అతడిని సజీవ దహనం చేశారు. ఆ తరువాత కారంచేడు ప్రాంతం(17-7-1985)లో దళితులపై జరిగిన మారణకాండతో దళితుల్లో చైతన్యం వెల్లువెత్తింది. అంతకుముందు పదిరికుప్పం ప్రాంతం(5-8-1983)లోనూ కొతమంది దళితులను కిరోషిన్ పోసి కాల్చేశారు. నీరుకొండ ప్రాంతం( 15-7-1987)లోకొంతమంది దళితులను చంపేశారు. చుండూరు ప్రాంతం( 6-8-1991)లోనూ కొంత మంది దళితులను ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలో జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ల సంపాదకత్వంలో ""చిక్కనవుతున్న పాట వెలువడింది.ఈ సంకలనంతో దళిత కవిత్వం ఒక సమగ్ర రూపం పొందింది. ఆ తర్వాత ఇంచుమించు ప్రతి సాహిత్య పేజీలోను దళిత సాహిత్యంపై చర్చోపచర్చలు జరిగాయి.
యుగాలు మారినా దళితుల వెతలు మారలేదని చెప్పడానికి, ‘త్రేతా యుగంలో నేను శంభూకున్ని / ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు' అని అంటున్నారు కలేకూరి ప్రసాద్ గారు.

విప్లవ సంఘంలో పెనుమార్పులు మధ్య ప్రేమ చిగురించి కొన్నాళ్ళ వరకు ప్రణయ ప్రయాణంలో ఆహ్లాదకరమైన జీవితానికి ఒక్కసారిగా పిడుగుపడి  హృదయానికి గాయం చేసిన కపట ప్రేమను మరువలేక తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దళిత సైన్యాన్ని ముందుకు నడిపిన విప్లవ యోధుడు కలేకూరి ప్రసాద్ గారు.

కులం మిగిల్చిన అవమానాల గాయాలని తడుముకుంటూ కవిత చెప్పే ఒక దళిత కవి ఈ దేశం నుండి కోరుకుంటున్నది ఏమిటి? తనని మనుస్మృతి సృష్టించిన అస్ప్రుశ్యునిగా కాకుండా, మానవత్వం సృష్టించిన మనిషిగా చూడమని. కవి ‘యువక’ (కలేకూరి ప్రసాద్) మాటల్లో చెప్పాలంటే – ‘పిడికెడు ఆత్మ గౌరవాన్ని’ యివ్వమని.

కలేకూరి ప్రసాద్ రాసిన ఈ ‘పిడికెడు ఆత్మ గౌరవం కోసం’ విస్తృత ఆదరణ పొందిన కవిత. ఈ దేశ చరిత్ర లోను, పురాణాల లోను ఉటంకించిన దళితుల, శూద్రుల ప్రస్తావనని స్పృశిస్తూ కూడా ఎక్కడా ఉపన్యాస చాయలు లేకుండా గొప్ప ఆర్తితో చివరి వరకూ సాగిపోవడం ఈ కవిత ప్రత్యేకత.

కవిత లోని దాదాపు ప్రతీ లైను మనల్ని ఈ దేశ పురాణాల చీకటి మూలల్లోకో, ఈ దేశ చరిత్ర మకిలి అధ్యాయాల్లోకో తీసుకు వెళ్తుంది. ఆ చీకటి మూలల్లోనో, ఆ మకిలి అధ్యాయాల్లోనో దుఃఖించే దళితుల్ని చూపిస్తుంది!

పిడికెడు ఆత్మ గౌరవం కోసం

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
‘పునరపి మరణం – పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను

‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ/వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను’ అని ప్రారంభించాడు కవితని. నిజమే! ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఎప్పుడు సృష్టించ బడిందన్న ప్రశ్నకు చారిత్రక ఆధారాలు లేవు గానీ, అది వెలుగులోకి వస్తూనే కొందరిని పంచముల పేరిట సమాజానికి అంటరాని వాళ్ళను చేసింది.
భారతీయ సమాజాన్ని కేవలం ఒక వర్గ వ్యవస్థగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి, భారతీయ సమాజాన్ని వర్ణ / కుల వ్యవస్థగానె అర్థం చేసుకోవలసి వుంటుందని చెప్పిన అంబేద్కర్ – పూలే ఆలోచనా ధోరణిని అక్కున చేర్చుకున్నానని చెప్పడం కోసమేనా ‘శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని / నిటారుగా నిలబెట్టేందుకు / సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని’ అని అంటున్నారు?

 దేశ మూలవాసులైన దళితులను వెలివాడల లోకి విసిరి వేసిన ఈ దేశ అమానవీయ వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ ఎగిరిన పతాక ఈ కవిత!
 "కర్మభూమిలో పూచిన ఓ పువ్వా..'' గీతంతో ప్రసిద్ధుడైన ప్రజా కవి, దళిత విప్లవ ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్  తొలినాళ్లలో యువక కలంపేరుతో కవిత్వం రాసేవారు.

 1964 అక్టోబర్ 25వ తేదీన జన్మించిన కలేకూరి ప్రసాద్ కారంచేడులో దళిత వర్గంపై దాడుల ఘటనతో 'యువక'గా గొంతెత్తారు. ఎనిమిదేళ్లపాటు జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో చురుగ్గా పనిచేశారు. పీపుల్స్‌వార్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి, దళిత ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. డర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నారు.
సుమారుగా ఐదు వందలు పాటలు పైగా ఆయన రాసిన పాటలను కొన్ని పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు. 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా'.. 'భూమికి పచ్చాని రంగేసినట్టూ' 'చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా' తదితర గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ రచించిన 'హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చారు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. అరుంధతీ రాయ్ స్మాల్ ఆఫ్ గాడ్ థింగ్స్‌ను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు.
 తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది. కొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశారు. చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇటీవలే ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
“వెలివాడల గుండెల నిండా నిప్పుల నినాదాల్ని వెలిగించి, అంటరాని బతుకుల్లో పిడికెడు ఆత్మగౌరవాన్ని ప్రసరించిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమర యోధుడు కలేకూరి ప్రసాద్‌”.

“భూమి కోసం..అత్యాచారాల నిరోధం కోసం.. గౌరవప్రద జీవితం కోసం..వనరులపైన, రాజ్యాధికార వాటా సాధన కోసం ఒక సమగ్ర దళిత ఉద్మమం రూపొందలేదని ఉద్యమ నాయకత్వాన్ని తన రచనల్లో నిలేసిన కలేకూరి ప్రసాద్”
 గుడి లోనికి ‘గబ్బిలం’ రావచ్చు కాని ఈ ‘నాలుగు పడగల హైందవ నాగరాజు ‘ ఒక అంటరాని వాడిని రానివ్వదు. తరతరాల బాధని గుర్రం జాషువా గారు వెలి బుచ్చారు. ఆ బాధ ఇంకా గాధలు గా కొనసాగుతోంది. ఫులే అంబేద్కర్ ల సమాజం లోని ఈ నికృష్ట బ్రాహ్మణా క్రౌర్యాన్ని విరిచినా ఇంకా వెళ్ళు భూమి లో పాతుకు పోయి వున్నాయి. మన చెరబందరాజు అడిగిన ‘ఏ కులం అబ్బి ! నీది ఏ మతం అబ్బి !’ అని ప్రశ్నిస్తూనే వుంది ఈ కరడు కట్టిన కుళ్ళిన బ్రాహ్మణ ఆధిపత్య సమాజం. కనీసం ఇప్పడికి ఐన శ్రీశ్రీ విప్లవ శంఖం లో రాసినట్టు “కులం కులం అని కుశ్చితాలు పెంచుకోకు ! మతం మతం అని మాత్సల్యం తెన్చుకోకు !…” అని సమతా మానవుడు నినదించాలి ..!
ఒకరిది అంటరాని ప్రేమ. మరొకరిది పిడికెడు ఆత్మగౌరవపు ధిక్కార జెండా. పులి చంపిన లేడి కోటేశు అయితే, పులిని వెంటపడి తరిమిన పోట్లగిత్త కలేకూరి.
ఆయనకు టీ కొట్టే మీటింగ్‌ హాలు. నాపరాయి కుర్చీనే వేదిక. ఇంటి ముందున్న మట్టి దిమ్మె బహిరంగ సభ. వాటిపై అట్లాగే కూర్చుంటాడు. అక్కడికక్కడే కవితలు రాసేస్తాడు. కాదు కాదు రాజేస్తాడు. చుట్టూ చేరిన జనం మధ్యనే వాటిని చదివి వినిపిస్తాడు. తన కవితలు ప్రజా కవితలు ఔనో, కాదో పరీక్షించుకుంటాడు. విప్లవోద్యమ రాతలన్నీ అలానే రాసాడు. దళిత ధిక్కార గానాన్నీ అలానే ఆలపించాడు. తీరా, అవి జనబాహువుల్లో వజ్రాయుధాలై దూసుకుపోతుంటే, శత్రుశిబిరాల్ని తునాతునకలు చేస్తుంటే, గుండె నిండుగా నవ్వుకుంటాడు. మరోమారు గట్టిగా కవితల్ని నెమరువేస్తూ పులకించిపోతాడు. చెరబండరాజు రాసిన ‘నన్నెక్కనివ్వండి బోను’లా, శ్రీశ్రీ రాసిన ‘అర్థనిమిలితానేత్రాల భయంకర బాధల పాటల పల్లవి’లా, గద్దర్‌ కాలిగజ్జెల ఘీంకారంలా, వంగపండు ‘జముకు చిరుతపులి చిందుల్లా’... కలేకూరి ‘పిడికెడు ఆత్మగౌరవపు’ మాట, ‘భూమికి పచ్చాని రంగేసిన’ పాట జనంలో సజీవ కావ్యాలయ్యాయి. ‘ఎద్దు కొమ్ముల నడుమ ఎర్ర పొద్దు’లయ్యాయి. కలేకూరి రాతల్లో ధిక్కారం తప్ప, లొంగుబాటు కనిపించదు.

కలేకూరి ప్రసాద్ గారు రచించిన కర్మభూమిలో పూచిన ఓ పువ్వా..పాట పూర్తిగా

కర్మ భూమిలో పూసిన ఓపువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా.
కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిధై పోయావా !!కర్మ !!
పారాణింక ఆరనే లేదు..... తోరణాల కళ వాదనే లేదు!! పారాణింక !!
పెళ్లి పందిరి తియనే లేదు బంధువులింటికి చేరనేలేదు !!పెళ్లి !!
మంగళనాదలాగనె లేదు ..అప్పగింతలు అవ్వనే లేదు!!మంగళ !!
కళ కళ లాడే ఓ సెలయేరా పెళ్లి కూతురుగ ముస్తాబైయ్యి
శ్మశానానికి కాపురామెళ్ళవా !!కర్మ !!
మానవత్వమే మంట కలిశేనా మమతల కర్ధం లేకపోయెనా !!మానవత్వ!!
వేద ఘోష ఎగతాళి చేసేనా ప్రమాణాలు పరిహాసమాడేనా !!వేద !!
ప్రేమ బంధముగా కట్టిన తాళి ఉరితాడైయ్యి కాటువేసేనా !!ప్రేమ !!
పున్నమి రువ్విన వెన్నెలనవ్వా కారు మేఘములు కమ్మేశాయా
చీకటి చితిలో శవానివయ్యవా !!కర్మ !!
ఆడది కన్నా అడవిలో మానుకు విలువిచ్చే ఈ దేశంలోన !!ఆడది !!
ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట్లో తప్పని స్ధితి ఇది !!ఆరడి !!
బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది !!బ్రతుకు !!
పిశాచ గణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది !!పిశాచ !!
లేళ్ళను చంపే పూలుల సీమలొ కోకిల వేదం సాగుతున్నది
జీవనరాగం ఆర్తనాదమాయె !!కర్మ !!
ఎవరోస్తారని ఎదురుచూపులు ఎం చేస్తారని ఈ పడికాపులు !!ఎవరో!!
విషం ఇచ్చిన తగుల బెట్టిన ఉరితాడుకు బిగవేసి చంపిన !!విషం !!
డాక్టరు నీకు సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు !! డాక్టరు!!
చట్టాలన్నీ కోర్టులు అన్ని
నేతి బీరలొ నెయ్యి చందమే
సామాన్యులకు అవి ఎండమావులేగా !!కర్మ !!
అక్కలార ఓ చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లరా !!అక్క !!
కాలే గుండెల కమురు వాసనకుకన్నులు ఏరులు పారుతున్నవా !!కాలే !!
దారి పొడుగునా శవాల గుట్టలు గుండెల గాయం కెలుకుతున్నవా !!దారి !!
రాక్షస పీడన ఎదిరించాలే స్త్రీలు పురుషులు మనుషులందరూ
సమానమన్న సమాజ ముండాలే
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా కన్నులు మంకెన పూవులు పూయగ
నెత్తుటి మంటలు కేతన మవ్వగ సమర హోరులో ముందుండాలమ్మా
నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా
నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా!!కర్మ !!


దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

గిడుగు రామమూర్తి పంతులు గారు

గిడుగు రామమూర్తి పంతులు గారు
గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  ‘తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు.
గిడుగు వెంకట రామమూర్తి (1863-1940)
తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.
గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.
గిడుగు రామమూర్తి గారి గురించి ఇంకా చెప్పాలంటే
గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.
శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు.
గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.
తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామమూర్తి గారు.
ఈ వాడుకభాషా వాదాన్ని చేపట్టినందుకు గిడుగువారు పండితులతో యుద్ధం చేయవలసివచ్చింది. దీన్ని గ్రామ్యవాదమనీ, గిడుగువారు గ్రామాచార్యులనీ గ్రాంధికవాదులు హేళన చేస్తూ పద్యాలూ, వ్యాసాలు రాశారు. జయంతి రామయ్యపంతులు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వేదం వెంకటరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైన వాళ్ళతో ఢీకొనవలసి వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తు గ్రాంధిక భాషావాదానికి అండగ నిలిచింది. గిడుగువారు ‘తెలుగు’ పత్రిక ద్వారా గ్రాంధిక వాదాన్ని ఖండిస్తూ వ్యావహారిక వాదాన్ని బలపరిచారు. పండితులే తప్పులు లేకుండా రాయలేని గ్రాంధికం బలవంతాన రుద్దడం ఎందుకంటూ “ఆంధ్రపండిత బిషక్కుల భాషాభేషజం” అనే పుస్తకం ప్రచురించారు.
ఆయన సాధించిన మహత్కార్యం ఏమిటి?
తెలుగు సాహిత్యంపై పండితుల గుత్తాదికారాన్ని పోగొట్టాడు.
 ప్రజలలో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు కాకూడదని, అందుకు వాడుక భాష సాధనం కాని గ్రాంధికమని తమకే రాని, తమకే తెలియని, భాషను పిల్లలు ఉపయోగించాలనీ అందులోనే పుస్తకాలు రాయాలనీ, దానిలోనే పాఠ్యపుస్తకాలుండాలని శాసించడం అవివేకమని ఉద్యమించారు.
చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ, తాతా సుబ్బరాయుడు శాస్ర్తీ వంటి ఉద్దండ పండితులే ఆయన వాదంలోని సబబు గుర్తించారు. బలపరచారు.
కుండలాల, శాలువాల పండితుల సాహిత్యాధికారం, అదన్నీ అసంబద్ధమైన వ్యాకరణ, ఛందశ్శాస్త్ర దండనాధికారం చెల్లదన్నాడు.
సాహిత్య ప్యూడల్ సంప్రదాయాన్ని ధిక్కరించి, నిరాకరించి నిర్మూలించి ప్రజాస్వామ్య పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠించాడు.
రచయిత ఏదైనా రాసినప్పుడు, లోకాన్ని ఉద్దేశించినప్పుడు అది అంటే ఆ పదం ఇదివరలోనే వినిమయంలో ఉన్నప్పుడుదా? తప్పు ఒప్పులు నిర్ణయించే అధికారం ఎవరికీ లేదన్నాడాయన.
భాషకైనా, మనిషికైనా మార్పు కూర్పు చేర్పు సహజమని బోధించాడు, నచ్చచెప్పాడు.
వ్యావహారిక భాషోద్యమం
తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు మరియు వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం.
పూర్వం తెలుగులో పాఠ్యాంశాలు అన్నీ గ్రాంధిక బాషలోనే ఉండేవి. 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు పాఠశాలాల ఇన్స్పెక్టర్‌గా  వచ్చిన జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే  బ్రిటీష్ అదికారి ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఉన్న  తేడాలు చూసి ఆవేధన చెందారు. ఆయన అదే విషయాన్ని గిడుగు వారితో చర్చించారు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.
1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు “గిడుగు”. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.
స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు.
1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు.
1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది.
1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో “Miscellany of Essays” (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు.

1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్యపత్రికను ప్రచురించారు.
1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.

గ్రాంథిక భాషావాదుల అభిప్రాయాలు
అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకి పనికిరాదు.
వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్యభాష.
వాడుక భాష ఒక లక్షణం గానీ, వ్యవస్థ గానీ లేనిది.
వ్యావహారిక భాషావ్యాప్తి వలన ప్రాచీనమైన కావ్యాలకు, వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది. మన సాహిత్య సంపద అనాథ అవుతుంది.
వాడుక భాషలో అనేక భేదాలున్నాయి. మాండలికాలు ఉన్నాయి. ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు. పాఠ్యగ్రంథాలు, సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి ? ఇవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాషా సమైక్యతకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాషే మంచిది.
నన్నయ నుండి నేటి వరకు గ్రాంథిక భాష మారలేదు. దానికి ఏకరూపత, ప్రామాణికత ఉన్నాయి.
వ్యాకరణ బద్ధం కాని ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్యరచన వీలుకాదు.
శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంథికంలో రచించవచ్చును.
వ్యావహారిక భాషావాదుల అభిప్రాయాలు
వాడుక భాష గ్రామ్యభాష కాదు. సజీవ భాష.
వ్యావహారిక భాషకు లక్షణాలు, వ్యాకరణం లేవన్నారు. గ్రాంథిక భాషకి కూడా పూర్తిగా వ్యాకరణాలు లేదు.
తెలుగు భాష మారుతోంది. కాబట్టి కొత్త వ్యాకరణాలు, సవరణలు వెలువడ్డాయి. నన్నయ భాషకి, తిక్కన భాషకి, ప్రబంధ బాషకి, దక్షిణాంధ్ర యుగం నాటి భాషకి చాలా భేదాలున్నాయి.
వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి.
వాడుక భాషలో కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించవచ్చును. ఉదాహరణ: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం.
గ్రాంథికభాష పండితులకే అర్థం కాదు. గొప్ప పండితులు కూడా తప్పులు లేకుండా రాయలేరు. మరి ఇతరులు ఎలా రాయగలరు.
వాడుక భాషలో భేదాలున్నాయి. అయితే అందరూ కలిసి కోస్తా మాండాలికాన్నే వాడుతున్నారు. కాబట్టి కోస్తా మాండలిక ఆంధ్రమే అనుసంధాన భాషగా ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విజ్ఞానం పెంపొందించుకోవాలంటే పాఠ్యగ్రంథాలు వాడుక భాషలోనే ఉండాలి.
వాడుక భాష ప్రజల భాష. గ్రాంథిక భాష పండితుల భాష.
సవర భాష పాండిత్యం
నాగరికతకు దూరంగా కొండల్లో జీవిస్తున్న ఆదిమ ప్రవర్తులైన సవరుల కోసం జీవితాన్ని త్యాగం చేశారు. తమ కాలాన్ని, ధనాన్ని వినియోగించారు.
ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.
మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది.
“సవర” దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు.
శాసనాల అధ్యయనం
హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.
తుదివిన్నపం
గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. *ఆ విన్నపంలోని చివరిమాటలు*
“దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు.
ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.



గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  ‘తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు. తెలుగుబాషకు  ఎనలేని సేవ చేసిన గిడుగు గారు 1940, జనవరి 22న  కన్ను మూశారు.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

అధికారం ఆప్యాయతల మధ్య నలిగిన స్త్రీ జీవితమే ఆమ్రపాలి కథ

అధికారం, ఆప్యాయతల మధ్య నలిగిన స్త్రీ జీవితమే ‘ఆమ్రపాలి’ కథ
ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? అనుకుంటూ చూశాను.తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు.

గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం ఎంతవరకూ అంగీకరిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న! ఆ ప్రశ్నకు సరైన సమాధానమే బుద్ధుడు ఆమ్రపాలిని బౌద్ధమతంలోకి ఆహ్వానించడం. బౌద్ధ హిందూమతంలో అనాచారులుగా కనిపించే చాలా వాటిని సంస్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. సమాజ నిరాదరణకు గురయిన వాళ్ళనెంతోమందిని దరి చేర్చుకొని, తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాపించ గలిగింది. సామాజిక నిర్బంధాల కారణంగా గణభోగ్యగా మారిన ఆమ్రపాలి కథ ఇంచుమించు అన్ని భారతీయ భాషలలోను ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగులో చాలామంది ఈ కథను రాశారు. ఈ వ్యాసంలో ఇద్దరు రాసిన కావ్యాలను, మరొకరు రాసిన నవలను తీసుకొని, ఆ కథను ఆయా రచయితలు ఎలా తీర్చిదిద్దారో పరిశీలించే ప్రయత్నం చేస్తాను.
‘ఆమ్రపాలి’ బౌద్ధ జాతక కథను యస్.టి.జ్ఞానానంద కవిగారు ఎనిమిది ఆశ్వాసాలుగాను, కరటూరి సత్యనారాయణగారు ఏడు సర్గలుగాను విభజించి ‘ఆమ్రపాలి’ అనే పేర్లతో కావ్యాలుగా రాశారు. జ్ఞానానందకవిగారు శాంతాన్నీ, కరటూరి వారు ‘కరుణ’ను ప్రధాన రసాలుగా పోషించారు.

ఇరువురు కవులూ ఆమ్రవనంలో ‘ఆమ్రపాలి’ అనాధగానే దొరికినట్లు పేర్కొన్నారు. లల్లాదేవి మాత్రం పూర్తి భిన్నంగా కథను సామాజిక అంశాలతో పరిశీలించి రచించారు. ఆమ్రపాలి అసలు పేరు ‘ఉదాయి’గా మార్పు చేసి, ఆమ్రవనంలో నివసించటం వల్ల ‘ఆమ్రపాలి’గా మారినట్లు, ఆ పిల్ల పుట్టిన తరువాత తల్లిదండ్రులు చనిపోయినట్లు లల్లాదేవి మార్పులు చేశారు.
యస్.టి. జ్ఞానానందకవిగారు తన కావ్యంలో పిల్లలు లేని మహానామునికి (శాక్య ధనికునికి) ‘ఆమ్రపాలి’ దొరకగా, కరటూరి వారి కావ్యంలో ఆనందుడనే కొడుకు కలిగిన శాక్యధనికునికి ఆ పసిపిల్ల దొరికినట్లు చిత్రించారు.

ఆడపిల్ల పెళ్ళీడుకొస్తుంటే, పెళ్ళి చేయాలనే తపన తండ్రికి ఎలా పెరుగుతుందో అది జ్ఞానానందకవిగారి కావ్యంలో బాగా కనిపిస్తుంది. కానీ, కరటూరివారు, ‘తండ్రి రాజ్య నిర్వహణా భారంలో పడి కూతురికి వివాహం చేయటం మరచిపోయినట్లు రాశారు. ఇటువంటి ప్రయత్నమేదీ లల్లాదేవి నవలలో కనిపించలేదు. ఆమ్రపాలి తండ్రి లిచ్ఛవుల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి వల్ల కూతురికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయంతో ఉండేవాడనీ, కనుక సరియైన సమయంలో తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని భావించి స్వయంవర సభను ఏర్పాటు చేసినట్లు జ్ఞానానందకవిగారు వివరించారు.

గణతంత్ర రాజ్యాలలో అందమైన యువతి కనిపిస్తే, ఆ దేశ పాలకులు గణభోగ్యగా చేసుకొనే ఆచారం ఉంది. శాక్యధనికుడు గణతంత్ర రాజ్యానికి చక్రవర్తి అయినా, పాలకులంతా ఏకమయి తీర్మానిస్తే తన కూతురినయినా గణభోగ్యగా చేయవలసిందే! కానీ, ‘స్వయంవరం’ అనేది ఒక సంప్రదాయం మాత్రం ఉంది. స్వయంవరంలో యువతికి నచ్చిన యువరాజుని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ ఉన్నా, అది గణనాయకుడైన చక్రవర్తి చేతిలో ఉండదు. గణరాజ్యాలలో ఒక గణ పరిషత్తు ఉంటుంది. విధి, విధానాలను అన్నింటినీ ఆ గణపరిషత్తే నిర్ణయిస్తుంది.

అందుకనే స్వయంవర సభలో గణపరిషత్తులో సభ్యులైన లిచ్ఛవ రాజులు అందగత్తె అయిన ఆమ్రపాలి తమకే చెందాలని, ఇతరులకు చెందకూడదనీ పట్టుపడతారు. గణనాయకుడైన శాక్యధనికుణ్ణి, లిచ్ఛవులు తమ అభిప్రాయం ప్రకారం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరిస్తారు. గణనాయకుడైనా తండ్రికి నామమాత్రమైన అధికారాలే ఉన్నాయని ఆ పరిస్థితిని గమనించి సభలోనే ఉన్న ఆమ్రపాలి ‘గణభోగ్య’గా ఉండటానికి అంగీకరిస్తుంది. అందుకుగాను కొన్ని నియమ నిబంధనలను విధిస్తుంది. తనతోపాటు మొదటినుండీ సభల్లోనూ, రాచకార్యాల్లోనూ పాల్గొన్నట్లు జాగ్రత్తపడ్డారు జ్ఞానానంద కవిగారు.
కరటూరివారు లిచ్ఛవుల్లో ‘అభయుడు’ అనే బలవంతుడైన మూర్ఖుడు ఆమ్రపాలి పట్ల వ్యామోహం పెంచుకుని, లిచ్ఛవులను రెచ్చగొట్టి, ఆమ్రపాలికి పెళ్ళి చేయకపోవటం వల్లనే రాకుమారులు రాజ్యంలో అశాంతిని సృష్టిస్తూ, ఒకరినొకరు చంపుకుంటున్నారని రాజైన శాక్యధనికునికి నివేదించినట్లు వర్ణించారు.

సభలో మహానాముడిని ‘గణభోగ్య’గా ఆమ్రపాలిని చేయమని పట్టుపట్టడం తనకో ధర్మం, పరులకో ధర్మం పని చేయదని లిచ్ఛవులు రాజుని వ్యతిరేకించటం వల్ల మహానాముడే ఆమ్రపాలిని, ఆమె అంగీకారాన్ని కూడా తెలుసుకోకుండా ‘గణభోగ్య’గా ప్రకటించాడు. ఆ విషయాన్ని, కూతురైన ఆమ్రపాలికి చెప్పటానికి బాధాతప్త హృదయుడై ఆమె భవనానికి వెళతాడు. వెళ్ళి కూడా అక్కడే మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. తండ్రిని చూసి, ఆమ్రపాలి బింబిసారుని వల్ల మోసగింపబడిన విషయం ఎక్కడ తెలిసిపోయిందోనని, అందుకే ఎంతో ప్రేమగా పిలిచి ఆదరించే తండ్రి తాను చేసిన పనికి బాధపడుతున్నాడనుకొంటుంది. ఈ సన్నివేశం చక్కని నాటకీయతతో సాగింది. జరిగిన విషయాన్ని అంతటినీ తండ్రికి చెప్పేసి, శత్రురాజైన బింబిసారుడని తెలియదనీ, దేశద్రోహం చేయననీ, క్షమించమనీ ప్రాధేయపడుతుంది.

తండ్రి ఆమ్రపాలిని సముదాయించి, అనివార్యమైన పరిస్థితుల్లో గణభోగ్యగా చేయవలసి వచ్చిందని, సభా విషయాలను ఆమెకు తెలుపుతాడు. ఆ సందర్భంలోనే ఆమ్రపాలి తనకు ఆమ్రవనంలో దొరికిందనీ, స్వంత కుమారుడైన ఆనందుడినీ నిన్నూ ఒకేలా పెంచాననీ చెపుతాడు.
తెలిసిన విషయాలు ఇరువురికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమ్రపాలి దేశభక్తి (దేశంలో అల్లకల్లోలాలను ఆపడం కూడా దేశభక్తిగానే భావిస్తుంది.) దేశం కోసం దేనికైనా సిద్ధమవుతాననీ, బింబిసారుని చేతిలో మోసపోయినందుకు క్షమించమని చెపుతుంది.
ఇది జరిగిన తర్వాత కూతురు గురించి బెంగ పెట్టుకొని తండ్రి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఆనందుడు బౌద్ధ సన్యాసిగా మారిపోతాడు. ఆమ్రపాలికి పుట్టిన కొడుకు ‘విమలకొండ’ను వేశ్య బిడ్డగా సమాజం గౌరవించదని ఆనందుడు చెప్పటం వల్ల బౌద్ధ సంఘంలో చేరటానికి తల్లి అంగీకరిస్తుంది. కానీ కొడుకు పట్ల పుత్ర వాత్సల్యం వీడలేకపోతుంది. ఏదో ఒక నెపంతో పుత్రుణ్ణి చూడాలనే బుద్ధుని దగ్గరకు వెళ్ళి, బుద్ధుణ్ణి, ‘కొడుకుని తల్లి నుండి విడదీయడం ధర్మమేనా?’ అని నిలదీస్తుంది. బుద్ధుడు జీవిత సత్యాన్ని, దుఃఖ నివారణను చెప్పటం వల్ల ఆమె బౌద్ధ సంఘంలో చేరగలుగుతుంది.

లల్లాదేవి రాసిన ‘ఆమ్రపాలి’ నవలలో కథను పరిశీలిస్తే ‘ఉదాయి’కి తల్లిదండ్రులు చనిపోవడంతో, వైశాలినీ రాజ్యంలో ఉన్న బంధువుల ఇంటికి మేనమామ ఆ పిల్లను తీసుకొని వెళుతుంటాడు. మార్గమధ్యంలో దొంగలబారిన పడటంతో మేనమామ చనిపోతాడు. భైరవుడనే మంచి దొంగ ఆ పసిపిల్లను చేరదీసి వైశాలినీ నగరానికి చేర్చి యశోదేవి దగ్గర విద్యాభ్యాసం కొనసాగేలా దోహదపడతాడు. గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అభ్యసిస్తూ రాజుగారి అనుగ్రహం పొంది, వారి ఆదరణకు పాత్రమవుతుంది. ఆమె చేసిన నాట్యానికి మెచ్చి, నర్తకి పదవినిచ్చి ఒక ఆమ్రవనాన్ని కేటాయించి, దానిలో చక్కని భవనాన్ని నిర్మించాలని రాజు చేతనుడు ఆదేశిస్తాడు. ఆమె ఆమ్రవనంలో ఉండటం వల్ల ‘ఆమ్రపాలిక’గా, తర్వాత ‘ఆమ్రపాలి’గా పిలువబడుతుంది.

భవన నిర్మాణానికి వినియోగించిన శిల్పులలో లౌకిక విషయాలను పట్టించుకోని ‘ఉదయుడు’ అనే శిల్పి ఏకాగ్రతతతో శిల్పాలను చెక్కుతుంటాడు. అతని శిల్ప నైపుణ్యాన్ని ఆమ్రపాలి అభిమానిస్తుంది. అతని దగ్గరే ఎక్కువసేపు గడుపుతుండేది. ఆమె కూర్చున్న భంగిమను ఒకసారి ‘ఉదయుడు’ చూసి చక్కని శిల్పాన్ని చెక్కుతాడు. ఆ శిల్పంతోపాటు, బుద్ధుని ప్రశాంతమైన విగ్రహాన్ని కూడా ఆమెకు బహూకరిస్తాడు. ఉదయునుడి పట్ల ఆసక్తిని పెంచుకోవడం గమనించిన రాజు ఆ శిల్పిని మరొక చోటికి పంపాలనుకొంటాడు. ఉదయునుడు ఒక స్వేచ్ఛాజీవి. ఎవరి నియమ నిబంధనలకు తలొగ్గనివాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మరోచోటికి శిల్పాలను చెక్కటానికి వెళ్ళమంటే ఇష్టపడక ఆ రాజ్యమే వదిలిపోతాడు.
బుద్ధుని ప్రశాంతమైన శిల్పాన్ని చూస్తూ బుద్ధుని గురించి, అతని ఆశయాలు, ధర్మాలను గురువుగారి సహాయంతో తెలుసుకొని, బుద్ధుణ్ణి దర్శించాలని తహతహలాడుతుంటుంది ఆమ్రపాలి. అదే సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఆ రాజ్యం వచ్చాడని తెలిసి తన భిక్షను స్వీకరించమని ప్రార్థిస్తుంది. ఆ బౌద్ధ భిక్షువు మొదట అంగీకరించి ఆమె ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరించాలనుకొంటాడు. అంతలో ఒక ధనస్వామి అనే ధనవంతుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బౌద్ధ భిక్షువుతో, ‘ఆమె ఒక వేశ్య’ అనీ, ఆ భిక్షను స్వీకరించవద్దనీ, మా ధనవంతుల దగ్గర స్వీకరించమనీ చెపుతాడు. ఆ బౌద్ధ సన్యాసి వెంటనే ఆమె పెట్టే భిక్షను తిరస్కరిస్తాడు. దానితో ఆమె ఎంతో బాధపడుతుంది. వేశ్య అంటే ఏమిటో, ఆ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ, తనకి తెలియకుండానే ఒక వేశ్యావాడలోని ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ‘ఆమ్రపాలి’ని కొంతమంది పట్టుకొని వేశ్యగా ముద్రవేసి, రాజు చేత ఆమెను నర్తకి పదవి నుండి తప్పించి, రాజ్య బహిష్కార శిక్ష వేస్తారు. బుద్ధుడు ఆ నగరం వచ్చేవరకూ ఏ తిండీ బట్టా పట్టించుకోకుండా నిరీక్షించి, బుద్ధుని కరుణ వల్ల బౌద్ధ సన్యాసినిగా మారటంతో కథ ముగుస్తుంది.

ముగ్గురు రచయితలూ మూడు విధాలుగా ‘ఆమ్రపాలి’ కథను తీర్చిదిద్దారు.
జ్ఞానానందకవిగారు తండ్రి పాత్రను పోషించటంలో ఔన్నత్యాన్ని, నైతిక విలువలను పాటిస్తూ సమయోచితంగా, సందర్భోచితంగా వర్ణించినట్లు అవగతమవుతుంది. దీనికి ముందు నుండే కథను చక్కని ప్రణాళిక వేసుకొన్నారనిపిస్తుంది. రాచకార్యాల్లో పాల్గొనడం, ఆమ్రపాలికి ఏర్పాటుచేసిన ‘స్వయంవర సభ’లోనే గణభోగ్య నిర్ణయం జరిగినట్లూ రాశారు.
కరటూరి వారి కావ్యంలో అప్పటికే తప్పు చేసి ఉండటం వల్ల, తండ్రి అప్పటికే ఆమెను గణభోగ్యగా అంగీకరించటం వల్ల ‘గణభోగ్య’గా ఆమె అంగీకరిస్తూ, పైకి దేశభక్తి పూత పూసినట్లు అనుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ, కావ్యాన్ని చదువుతున్న పాఠకునికి ఆ నాటకీయత అబ్బురపరుస్తుంది.

జ్ఞానానందకవీ, కరటూరి వారూ ఇద్దరూ కూడా ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత తండ్రి పాత్రను బాగా చిత్రించారు. జ్ఞానానందకవిగారు, ఆమ్రపాలి తండ్రి పాత్రను కావ్యంలో మరలా ప్రవేశపెట్టకుండానూ, కరటూరివారు, ఆమ్రపాలి తండ్రి బెంగ పెట్టుకొని మరణించినట్లు బాగా రాశారు. జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత కథను ఆమె నుండే చూశారు. పెంచిన తల్లిదండ్రుల కోణం నుంచి చూడలేదు. ఇది చక్కని కథన శిల్పం.

లల్లాదేవిగారి నవలలో ‘ఆమ్రపాలి’ వేశ్యగా ముద్ర వేయబడుతుంది. ఆమెకు తెలియకుండానే వేశ్యావాడకు పోతుంది. అక్కడకొంతమంది యువకులు ఆమెను నిర్బంధించి వేశ్యగా మార్చినట్లు రాశారు. అక్కడ వేశ్య జీవితచిత్రణను వర్ణించటంలో లల్లాదేవి పరిశీలన చక్కగా వ్యక్తమవుతుంది. దొంగల గుంపుకి దొరికిన ఉదాయి అడవిలో పాడుపడిన దేవాలయం మీద ఉన్న నాట్యభంగిమలను చూసి, ఆమె నాట్యాన్ని అభ్యసించాలనుకొన్నది. సాధన వలన నాట్యాన్ని సాధించింది. ఆ నాట్యమే ఆమ్రవనాన్ని, నర్తకి పదవిని వచ్చేలా చేసింది. అదే ఆమెను ‘వేశ్య’గా అనుమానించేలా చేసింది. ఆ అనుమానంలో నుండి వచ్చిన అవమానమే ఆమెను బౌద్ధభిక్షువుగా మార్చి, సన్మార్గంవైపు పోయేటట్లు చేసింది.

యస్.టి. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ బింబిసారుణ్ణి ప్రేమించింది. బింబిసారుడూ ఆమెను కోరుకున్నాడు. తర్వాత ఇరువురిలో ఎవరిని ఎవరూ ద్వేషించుకోలేదు. బింబిసారుడు మాత్రం ఆరురోజులు ఆమె భవనంలో ఉండి, దొంగచాటుగా వచ్చిన అతని రాకను లిచ్ఛవులు పసిట్టడం, అతడిని జాగ్రత్తగా దాచటం, ఆమెను విడిచి వెళ్ళిపోయేటపుడు ఒక ఉంగరాన్ని ఇవ్వటం, ఒకవేళ కొడుకు పుడితే, ఉంగరమిచ్చి పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. తన కోసం చిత్రించిన చిత్రపటంలో బింబిసారుణ్ణి ఆకర్షించి, ఆలోచిస్తుండగా చెలికత్తె ఆమె హృదయాన్ని పసిగట్టడం, రాయబారం నడపడం వంటివన్నీ చేస్తుంది. బింబిసారుని పాత్రను కావాలనే కావ్యనాయకునిగా, కవి తీర్చిదిద్దలేదేమో ననిపిస్తుంది. ఆమెను బింబిసారుడు అనుభవించటానికే ప్రయత్నించినట్లు తేలుతుంది. అయితే ఉంగరాన్ని ఇచ్చి, కొడుకు పుడితే, ఉంగరం చూపితే తన పుత్రునిగా స్వీకరిస్తానని చెప్పటం అతని స్వభావాన్ని తేటపరిచే విషయాలుగా గమనించే వీలుంది.
‘గణభోగ్య’గా జీవితాన్ని గడుపుతున్న ఆమ్రపాలి తనలో తాను తీవ్ర సంఘర్షణకు లోనై ఒకసారి తాను దొరికిన ఆమ్రవనానికి ప్రశాంతత కోసం రావటంతో, అక్కడ తొలిసారిగా బుద్ధుని దర్శనమవుతుంది. ఆనాటి నుండే ఆమెలో బుద్ధుని ప్రవచనాలు లౌకిక విషయాల పట్ల కోరికను తగ్గించి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. బుద్ధుని రాక కోసం నిరీక్షిస్తూ, తీరా బుద్ధునికి భిక్షను పెట్టాలని ప్రయత్నించినపుడు ఆ నగరంలోని ధనవంతులు వ్యతిరేకిస్తారు. బుద్ధుని దర్శనాన్నీ బుద్ధుని శిష్యుడు కూడా అడ్డుకుంటాడు. కానీ బుద్ధుని జోక్యం వల్ల ఆమెకు అతని దర్శనం కలగటం, ఆమె పూర్వజన్మలో నెమలి అనీ, ఇంద్రుని శాపం వల్ల ‘ఆమ్రపాలి’గా జన్మించిందని, ఆమె జన్మ వృత్తాంతాన్ని బుద్ధుడు వివరించటంతో ప్రజల్లో ఎక్కడలేని ఆదరణ కలుగుతుంది. బుద్ధునికి భిక్షను పెట్టి, తన సర్వవిద్యలనూ బౌద్ధ సంఘ వ్యాప్తికే వినియోగిస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొంటుంది.
జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని చారిత్రక తత్త్వకావ్య లక్షణాలతో చక్కగా అన్వయించే ప్రయత్నం చేశారు.
 జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో బుద్ధుని బోధనలు అడుగడుగునా కన్పిస్తుంటాయి. మరో విశేషమేమంటే, ఈ కావ్యంలో అన్ని పాత్రలూ ఆమ్రపాలి వైపు నడవగా, ఆమ్రపాలి బుద్ధుని ధర్మాలవైపు, బుద్ధుని వైపు పయనిస్తుంది. బౌద్ధమతంలోని ఆర్యసత్యాలనూ, త్రిరత్నాలనూ, అష్టాంగమార్గాన్ని కావ్యానికి అన్వయించి బౌద్ధ ధర్మేతిహాసంగా మలచగలిగారు.
జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి.

ఆమ్రపాలి గణభోగ్యగా జీవితాన్ని గడుపుతూ మానసిక ప్రశాంతత కోల్పోయి, సంఘర్షణ పడుతూ, తీవ్రవ్యధకు లోనై గుండెల్లో దుఃఖాన్ని పోగొట్టు కోవాలని తాను దొరికిన ఆమ్రవనంలోకి వస్తుంది. కరుణ హృదయుడైన బుద్ధుడు అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అతడిని ఆమె ఎవరో ముని అనుకొని ఆమెలో తీరని కోరికను నర్మగర్భితంగా వ్యక్తీకరించి అతనిని తన ఇంటికి రమ్మనమనీ, సర్వసౌఖ్యాలనూ సమకూరుస్తానంటుంది.
బుద్ధుడు ఆమె మనోవాంఛను గమనిస్తాడు.

చాలా మృదువుగా, ప్రశాంతంగా, జీవిత సత్యాలను వివరిస్తాడు. అంతేకాక ఆమె బౌద్ధ భిక్షువుగా మారిన తరువాత ఆమెతోపాటు బౌద్ధారామానికి వచ్చిన మిగిలిన ప్రజలకు నాలుగు ఆర్యసత్యాలను వివరిస్తాడు.
బౌద్ధధర్మ మూలసూత్రాలలో సర్వమూ క్షణికమనేది ఒక మూల సూత్రం.
ఇది ప్రపంచం దుఃఖమయమనే దాన్ని స్పష్టం చేస్తుంది. పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. అయినా ఆశలు పెంచుకుంటారు. ప్రపంచంలో దుఃఖం లేకపోవటంగాని, పుట్టిన జీవి మరణించకపోవటమనేది కనిపిస్తే ఎంతో సంతోషం కదా! అని బుద్ధుడు చెబుతాడు.

మానవుని శరీరం వయః పరిణామాన్ని అనుసరించి క్షణక్షణం మారుతూ మట్టిలో కలిసిపోతుందనే విషయాన్ని కవి ‘నాల్గు దశల మధ్య నవయుచు నున్నటి’ అని వర్ణించారు. దృశ్యమాన ప్రపంచంలోని సర్వమూ అనిత్యమేనని దానివల్ల తెలుస్తుంది.
దుఃఖానికి కారణం కోరికలు అనేది బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సత్యాల్లో రెండవది.
ఇంద్రియాలకు ప్రియమైన విషయ సంపర్కం, వాటి స్మృతి, కోరిక (తృష్ణ)లకు కారణమవుతుంది. ఆ కోరికలు పూర్తి కాగా త్యజించగలిగినపుడు దుఃఖం నివారింపబడుతుంది. ఇది మూడవ ఆర్యసత్యం.

ఆమ్రపాలి ఎన్నో కోర్కెలతో రగిలిపోతూనే బుద్ధుని ప్రథమ దర్శనం చేసుకొన్నది. బుద్ధుడు జీవితం క్షణికమైనదనే జీవిత సత్యాన్ని బోధించడం, తన తపస్సు పూర్తయిన తరువాత భిక్షను స్వీకరించటానికి వస్తానని చెప్పి పంపితే బుద్ధుని పునరాగమనం వరకూ భిక్షను సమర్పించటానికి ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికి ఆమెలో కోరికలు నశించిపోయాయి. తాత్కాలికమైన లౌకిక భోగాల నుండి శాశ్వతమైన విముక్తి మార్గానికి సిద్ధమై ఉంది. దీనికంతటికీ కారణం ఆమెలో వివాహం చేసుకోవాలనీ, సర్వసౌఖ్యాలను అనుభవించాలనీ ఉన్న కోర్కెలన్నీ నశించటమే. కొడుకుని, తండ్రిని, సర్వస్వాన్నీ వదిలి బుద్ధుని శిష్యగణంలో చేరిపోతుంది. ఆమె దుఃఖం నుండి విముక్తి పొందుతుంది. ఈ విధంగా చారిత్రక తత్త్వ కావ్యంగా జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని తీర్చిదిద్దారు.
బుద్ధుని బోధనలు సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపాయనేది తెలియజేసే కథలు ఎన్నో వస్తున్న నేపథ్యంలోనే ‘ఆమ్రపాలి’ కావ్యాలు, నాటకాలు, నవలలు కూడా వెలువడ్డాయి. మానవ విలువలను, మానవ సంబంధాలను పటిష్టపరచడంలో బౌద్ధేతివృత్త కావ్యాలు చాలావరకూ తోడ్పడ్డాయి. అలా నిరూపించే బౌద్ధజాతక కథలలో ఆమ్రపాలి కథ ఉత్తమమోత్తమ కథ. ఇంకా చాలామంది తెలుగు రచయితలు కూడా ఆమ్రపాలి కథను తీసుకొని వివిధ ప్రక్రియలలో రచనలు చేసినవారు ఉండవచ్చు.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ నెంబర్ : 9493033534

పిడికెడు ఆత్మగౌరవం కోసం

పిడికెడు ఆత్మగౌరవం కోసం

మీకు చ్యాతనైతే, మీకు చ్యాతనైతే నా శరీరాన్ని నగరం నడి బొడ్డున ఖననం చేయండి...!!
  ఒక జీవన రవళిని వినిపించే విదుర(వెదురు) వనాన్నై వికసిస్తాను....!!
                  అగ్రకుల అమ్మాయిని చూసాడని కారణంతో కంచికచర్లలో కోటేశు అనే యువకున్ని అగ్రకుల భూస్వామ్య వర్గం పట్టపగలు సజీవ దహనం చేసింది. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన కలేకూరి పీపుల్స్ వార్ వైపు ఆకర్షితులయ్యాడు. కొద్దికాలంలోనే పీపుల్స్వార్ భావజాలం నుంచి విభేదించి బయటకు వచ్చి, మార్క్సిస్టు ఆలోచనా ధోరణికి విరుద్ధం గాడాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాలను తన రచన ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చేరవేశాడు. అనేక దళిత బహుజన ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
ఇందిరా అనే నవ వధువు టంగుటూరులో హత్యకు గురికావడంతో ఆ సంఘటనను ఉద్దేశించి "" కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసీ విరియని ఓ చిరునవ్వా""అనే పాటను రాశాడు. ఇది మైహిలో ద్యమానికి నాంది పలికింది. శ్రీరాములయ్య సినిమా లో "'భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలో""అనే పాట కారంచేడులో దళితుల మారణకాండను ఉద్దేశించి రాసినది.
మేధావులు భూమిపై కొద్దికాలమే జీవిస్తారు అలాంటి వారిలో కలేకూరి ఒకరు. ఆయన జీవించిన అతి కొద్ది కాలం తన జీవితాన్నే మొత్తం అట్టడుగు వర్గాల కోసమే అంకితం చేశాడు. ఆయన నిస్వార్థ జీవి. ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో  నేను కొంత సమాచారాన్ని సేకరించాను, ఆయన చేతిలోని "యువక "కలం నుంచి జాలువారిన ఆత్మఘోషను ఒకసారి వినండి. కొన్ని కవితలు చదవడానికి, చదివి కవిత లోని ఆర్తిని అనుభవం లోనికి తెచ్చుకోవడానికి కేవలం సాహిత్య విద్యార్థులం అయితే సరిపోదు. మరీ ముఖ్యంగా, శక్తివంతమైన గొంతుక వున్న ఒక దళిత కవి రాసిన కవితనీ, అతడి గొంతు లోని బాధనీ, ఆగ్రహాన్నీ సహానుభూతితో అర్థం చేసుకోవడానికి వేల సంవత్సరాలుగా ఈ దేశం వర్ణ వ్యవస్థ కుంపటి పైన ఎట్లా తగలబడి పోతున్నదో, ఆ కుంపటిని రాజేస్తూ వున్న పురాణాలు ఏమిటో, స్మృతులేమితో విశ్లేషించుకుని అర్థం చేసుకునే హృదయం కావాలి.

 ప్రపంచం ఆధునిక కాలంలోకీ, అత్యాధునిక కాలంలోకీ వెళ్లిందని సంబరాలు జరుపుకునే కాలంలో కూడా గ్రామాలలోనూ, నగరాల లోనూ, చివరికి ఘనత వహించిన విశ్వవిద్యాలయాల లోనూ ఇంకా కొన్ని కులాల వాళ్ళు వెలివాడలకు ఎందుకు పరిమితం చేయబడుతున్నారో, వాళ్ళను అట్లా పరిమితం చేస్తోన్న శక్తుల రాజకీయాలేమిటో తెలిసి వుండాలి. ఇంతా చేసి, కులం మిగిల్చిన అవమానాల గాయాలని తడుముకుంటూ కవిత చెప్పే ఒక దళిత కవి ఈ దేశం నుండి కోరుకుంటున్నది ఏమిటి? తనని మనుస్మృతి సృష్టించిన అస్ప్రుశ్యునిగా కాకుండా, మానవత్వం సృష్టించిన మనిషిగా చూడమని. కవి ‘యువక’

(కలేకూరి ప్రసాద్) మాటల్లో చెప్పాలంటే – ‘పిడికెడు ఆత్మ గౌరవాన్ని’ యివ్వమని. కలేకూరి ప్రసాద్ రాసిన ఈ ‘పిడికెడు ఆత్మ గౌరవం కోసం’ విస్తృత ఆదరణ పొందిన కవిత. ఈ దేశ చరిత్ర లోను, పురాణాల లోను ఉటంకించిన దళితుల, శూద్రుల ప్రస్తావనని స్పృశిస్తూ కూడా ఎక్కడా ఉపన్యాస చాయలు లేకుండా గొప్ప ఆర్తితో చివరి వరకూ సాగిపోవడం ఈ కవిత ప్రత్యేకత. కవిత లోని దాదాపు ప్రతీ లైను మనల్ని ఈ దేశ పురాణాల చీకటి మూలల్లోకో, ఈ దేశ చరిత్ర మకిలి అధ్యాయాల్లోకో తీసుకు వెళ్తుంది. ఆ చీకటి మూలల్లోనో, ఆ మకిలి అధ్యాయాల్లోనో దుఃఖించే దళితుల్ని చూపిస్తుంది!

పిడికెడు ఆత్మ గౌరవం కోసం
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
‘పునరపి మరణం – పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేహం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు

ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు

సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను

‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ/
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను’ అని ప్రారంభించాడు కవితని. నిజమే!

ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఎప్పుడు సృష్టించ బడిందన్న ప్రశ్నకు చారిత్రక ఆధారాలు లేవు గానీ, అది వెలుగులోకి వస్తూనే కొందరిని పంచముల పేరిట సమాజానికి అంటరాని వాళ్ళను చేసింది.
‘పునరపి మరణం – పునరపి జననం’ అంటూ కవి ఆది శంకరాచార్యుని ‘భజగోవిందం’ ప్రస్తావన తీసుకొచ్చాడు కవి.
ఇంతకూ, శంకరాచార్య ఏమన్నాడు?  ‘ మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారాన్ని దాట జాలక నానా బాధలకు గురవుతూ వున్న నాకు ముక్తి ప్రసాదించు మురారీ!‘  భజగోవింద పారాయణం చేసిన సవర్ణులకు సంసారం నుండి ముక్తి లభించిందేమో గానీ, వేల ఏళ్ళు గడిచినా వర్ణ వ్యవస్థ చట్రం నుండి దళితులకు విముక్తి లభించలేదని కవి వాపోతున్నాడు.

‘నా దేశం ఈ దేశంలో కరిగిపోయి /  గంగా సింధూ మైదానమైంది’ అంటున్నపుడు,  భారత దేశం వెలుపలి నుండి వలస వచ్చిన ఆర్యులు ఈ దేశ మూలవాసుల నాగరికతను ధ్వంసం చేసి సింధూ నాగరికతను (Indus Valley Civilisation) నిర్మించిన చరిత్రను తవ్వుతున్నాడు కవి. అట్లా ఈ దేశంలోకి చొరబడిన వాళ్ళు ఇక్కడి మూలవాసుల శ్రమతో పంటలు పండించారు అని

చెప్పడానికి ‘నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే /  ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది’ అంటున్నాడు. యుగాలు మారినా దళితుల వెతలు మారలేదని చెప్పడానికి,

‘త్రేతా యుగంలో నేను శంభూకున్ని /  ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు’ అని అంటున్నాడు.
శంభూకుడు ఎవరు ?

రాముడు రాజ్యమేలే కాలంలో ఒక బ్రాహ్మణుడు, అకాల మృత్యు వాత పడిన తన కొడుకు శవాన్ని రాముడి ముందు పెట్టి, రాజ్యంలో ఎదో అరిష్టం జరుగుతున్నందువల్లనే తన కొడుకు ఇట్లా మరణించాడని వాపోతాడు. అప్పుడు ఆ అరిష్టానికి కారణం శూద్రుడైన శంభూకుడు బొందితో స్వర్గం వెళ్ళడానికి తపస్సు చేస్తూ వుండడమే అని తెలుసుకుని, హుటా హుటిన వెళ్లి, తపస్సులో వున్న శంభూకుని శిరస్సు ఖండిస్తాడు.

మరి, కంచికచెర్ల కోటేశు ఎవరు ??
భారత దేశం స్వతంత్ర దేశంగా మారిన తరువాత ఒక అగ్ర వర్ణ యువతిని ప్రేమించాడు కారణ నేరానికి ఆ అగ్ర వర్ణ భూస్వాముల చేతిలో హతమైన ఒక దళిత యువకుడు.
చుండూరు దళితుల ఊచకోత నేపథ్యంలో రాసిన కవిత కాబట్టి, ఈ సంఘటన కన్నా ముందు జరిగిన దళితుల ఊచకోత సంఘటనలను ఉటంకిస్తూ

 ‘నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ /  ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం /  నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు ‘ అంటున్నాడు కవి. వేతనాల పెంపు డిమాండ్ చేసినందుకు దాదాపు 44 మంది దళిత కూలీలను అగ్ర వర్ణ భూస్వాములు ఊచకోత కోసిన సంఘటన 1968 ప్రాంతంలో తమిళనాడు లోని కీలవేన్మనిలో జరిగింది. 1985 లో కారంచేడు, 1987 లో నీరుకొండ హత్యాకాండలు జరిగితే, చుండూరు ఘటన 1991 లో జరిగింది.

దేశానికి స్వాతంత్రం వొచ్చి, దళితులకు చదువులు, ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పించబడిన తరువాత కాలంలోనే దళితుల పైన దాడులు స్థలాలనే కవి తన జన్మ స్థలం అంటున్నాడు. బహుశా, డాక్టర్ అంబేద్కర్ వేసిన బాటలో చదువుకుని, ప్రశ్నించడం మొదలు పెట్టాకే దళితుల పైన దాడులు ఎక్కువ అయ్యాయనీ, అందుకే కవి ఆయా స్థలాలను తన జన్మ స్థలం అంటున్నాడని అనిపిస్తుంది !  చుండూరు ఘటనతో దళితుల పైన దాడులు పరాకాష్టకు చేరడంతో ‘చుండూరు / రాచ పుండూరు / నామవాచకం కాదు సర్వనామం అంటున్నాడు’.
‘బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని ‘ అనడంలో తరాలు మారినా మారని దళితుల స్థితి హిందూ వర్ణ వ్యవస్థ పట్ల ఒక తీవ్ర నిరసనగా నిలబడి వుందని చెప్పడమే!

తన మరణం, వర్ణ వ్యవస్థ పైన పోరాటం కొనసాగడానికి ఒక స్పూర్తిగా నిలవాలనే ఆశతో కవి –

‘నన్ను బాధితుడు అని పిలవకండి /
 నేను అమరున్ని ‘ అని పదే పదే చెప్పడం కనిపిస్తుంది.
ఇదంతా సరే – భారతీయ సమాజాన్ని కేవలం ఒక వర్గ వ్యవస్థగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి, భారతీయ సమాజాన్ని వర్ణ / కుల వ్యవస్థగానె అర్థం చేసుకోవలసి వుంటుందని చెప్పిన అంబేద్కర్ – పూలే ఆలోచనా ధోరణిని అక్కున చేర్చుకున్నానని చెప్పడం కోసమేనా ‘శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని / నిటారుగా నిలబెట్టేందుకు / సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని’ అని అంటున్నాడు?
ఇవాళ కొత్తగా దళితుల్ని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోన్న వాళ్ళను కవి కలేకూరి ప్రసాద్ అప్పుడే ఊహించి రాసాడా అన్నట్టు వున్న ఈ కవితా వాక్యాలు చదవండి -

‘మీకు చాతనైతే  / నగరం నడిబొడ్డున ఖననం చేయండి /
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి /
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను /

మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను’
దేశ మూలవాసులైన దళితులను వెలివాడల లోకి విసిరి వేసిన ఈ దేశ అమానవీయ వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ ఎగిరిన పతాక ఈ కవిత!
ముఖ్యంగా,
 ‘మీకు చాతనైతే
/ నగరం నడిబొడ్డున ఖననం చేయండి /
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి’
లాంటి చివరి పాదాలు చదువుతున్నపుడు మీకు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇటీవలి సంఘటనలు ఏవైనా జ్ఞప్తికి వొచ్చాయా ?
వొచ్చేవుంటాయి.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

Monday, October 22, 2018

ఆంధ్రుల సాంఘిక చరిత్ర

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు పుస్తకాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర
మనిషి బాగుపడటానికైన, చెడిపోవటానికైనా, స్నేహితులు, పుస్తకాలు అత్యంత ప్రయోజనకరమైన వుపకరణాలు. 


స్నేహం వొకవ్యక్తిజీవితంలోనె మార్పుతెస్తుంది. కాని శక్తివంతమైన పుస్తకం అనేక పాఠకుల వైఖరితో సహితం, ప్రవర్తనలోనూ మార్పుతెస్తుంది. మంచిపుస్తకాలు, విజ్ఞనాన్ని కల్గించవచ్చు, వినోదాన్ని పంచవచ్చు. కొన్ని సంధర్భాల లో రెండిటినీ సమకూర్చ వచ్చు. అటువంటి పుస్తకాలు ప్రసిద్ధ మౌతాయి.మంచి పుస్తకాలు చదవుటకు అందరూ ఆసక్తి చూపిస్తారు. అయితే, యేది మంచి పుస్తకమో నిర్ణయించటం సులభం ఐనపని కాదు. అయినప్పటికీ, ప్రతివిషయ నిర్ణయానికీ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పడి వున్నవి. అటువంటి ప్రమాణాలను అనుసరించి మంచి పుస్తక నిర్ణయం జరుగుతుంది. 


పుస్తక పఠనం మనిషి ఆలోచనలకు ఒక వుదాత్తతను కల్పించి, స్వార్ధపరత్వాన్ని, సంకుచిత తత్వాన్ని, తగ్గించుట యేగాక, అతనిలో విశ్వమానవతను పెంపొందించేదిగా వుండాలి. "మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు" అంటారు కొందరు! 



తెలుగు సాహిత్యము లో మంచి పుస్తకాలకు కొరత లేదు. మంచి రచయితలూ చాలమందే వున్నారు. ఇటీవలి కాలంలో (అంటే 1955వ సంవత్సరం నుండి) కేంద్ర సాహిత్య అకాడమీ ఈ విషయం లో చెప్పుకో దగిన కృషి చేస్తున్నది. భారతీయ భాష లన్నిటి లో ప్రచురింప బడుతున్న వుత్తమ రచనలను, విజ్ఞులైన పండితుల సహకారం తో పరిశీలింప జేసి, ఉత్తమ రచనలుగా నిర్ణయమైన గ్రంధాలకు జాతీయ బహుమతులను ప్రకటించి, ఆయా రచయితలను గౌరవిస్తున్న విషయం, విజ్ఞులందరికీ విదితమే! గత యేబది సంవత్సరాల కాలం లో తెలుగు లో దాదాపు 45మంది రచయితలకు సాహిత్య ఆకాడమి జాతీయ అవార్డ్ లభించింది. వీరిలో కవులూ, నవలా రచయితలూ, కధా రచయితలూ, సాహిత్య విమర్శకులు, జీవిత చరిత్రలు రచించినవారు,సాంఘిక చరిత్రలు రచించినవారు, వాగ్గేయకారులు వున్నారు. వారి రచనలు, వారివారి ప్రజ్ఞా పాటవాలను చక్కగా చిత్రించడమే కాక, అత్యంత శ్రమ కోర్చి వారు సంతరించిన జ్ఞానసుధను, అందరికి అర్ధమయ్యే భాషలో చదువరులకు అందజేయుట సంతోషకరమైన విషయము. పైన వుల్లేఖించిన రచనలు చదువ తగిన మంచి పుస్తకాలని భావించుట సమంజసము. 



సాహిత్య అకాడమి "జాతీయ బహుమతి" గెలుపొందిన పుస్తకాలలోని విశేషాలను సూక్ష్మరూపంలొ పాఠక లోకానికి అందజేయుటయే ఈ వ్యాసకర్త వుద్దేశం. ఈప్రయత్నం చదువరులలో పఠనాసక్తిని పెంపొంద చేస్తుందని ఆకాంక్ష! ప్రస్తుత వ్యాసంలో చర్చిత రచన కీ.శే. సురవరం ప్రతాప రెడ్డిగారు రచించిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర". 



కీర్తిశేషులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారు బహుభాషా కోవిదులు. వారికి తెలుగు సంస్క్ర్స్తతం, ఉర్దూ, హిందీ, పారసీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలదు. సాహిత్య రంగంలో అత్యంత ఖ్యాతిగడించినవారు. సురవరం ప్రతాప రెడ్డిగారు స్పౄసించని సాహిత్య ప్రక్రియ లేదు. పరిశోధనాత్మక రచనలలో వారిది అందె వేసినచేయి! ఆంధ్రుల చరిత్ర పట్లా, సంస్కృతి పట్ల వారి అభిమానానికి హద్దులంటులేవు! శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారి పరిశొధనాత్మక రచనలలో విషేషించి పేర్కొన దగినవి నాలుగు: 1] "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" 2] హిందువుల పండుగలు, 3]రామాయణ విశేషాలు, 4] హిందుస్థాన చరిత్ర. 



పై పేర్కొనిన రచనలలో "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" చాలామంది మేధావుల మెప్పునూ, విమర్శకుల అభిమానాన్ని, అశేష ప్రశంసలను అందుకొనిన ఉద్గ్గ్రంధము. ఈ రచనకు సెంట్రల్ (కేంద్ర) సాహిత్య అకాడమీ 1955వ సంవత్సరపు జాతీయ బహుమతిని యిచ్చి గౌరవించింది. 



సమాజంలోని సామాన్య ప్రజల సాంఘిక జీవనాన్ని [ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వినోదాలు, జీవనశైలి, ఇత్యాదులు] ప్రత్యేకంగా చిత్రిస్తే - ఆ రచనను సాంఘీక చరిత్ర అంటారు. సాంఘిక చరిత్రలు ఆయాకాలపు ప్రజల జీవిత విశేషాలను విపులంగా తెలుసు కొనుటకు హెచ్చుగా వుపయోగ పడతాయి. 



తెలుగు భాషలో సాంఘిక చరిత్రలు అరుదుగా కనిపిస్తాయి. చారిత్రక రచనలు వ్రాయుటకు చాలా మంది రచయితలు ప్రయత్నించారు. అట్టివారిలో చిలుకూరి వీరభద్ర రావు గారు, డా. నేలటూరు వెంకటరమణయ్య గారు ముఖ్యులు. ఈ విషయం లో అశేష పరిశోధన చేసిన వారిలో శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అగ్రగణ్యులు. వారు వ్రాసిన రెడ్డిరాజుల చరిత్ర - ప్రముఖ చరిత్రకారుల మన్నల నందుకొనినది. 



ఆ గ్రంధ రచన లో శ్రీ శర్మగారు వుపయోగించిన చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే - మల్లంపల్లివారి శోధనా పటిమ, రాగి శాసనాల లోను, తాళపత్రాల లోను, మరుగుపడి జీర్ణావస్థలో నున్న హస్తలేఖా ప్రతులు శోధించి చారిత్రక సత్యాలను వెలుగులోనికి తెచ్చి - ఆయా అంశాలను సమన్వయ పరచి అర్థవంతమైన నిష్కర్షలు రూపొందించుటలో శర్మగారి ప్రజ్ఞా పాటవాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. నిష్పక్ష చారిత్రక సత్యాలను వెలికి తెచ్చుట సోమశేఖర శర్మగారి వంటి నిస్వార్థ పరిశోధులకే సాధ్యం. 



సాంఘిక చరిత్రను గురించి వివరిస్తూ శ్రీ ప్రతాప రెడ్డిగారు అంటారు: - "రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘీక చరిత్రలు మనకు పూర్తిగా సంభందించినవి... సాంఘిక చరిత్ర మానవ చరిత్ర... ప్రజల చరిత్ర, అది మన సొంత కధ. అది మన జనుల జీవనమును ప్రతి శతాభ్ద మందెట్లుండెనో తెలుపు నట్టిది. అది మన తాతా ముత్తాల చరిత్ర. వారి యిండ్లు, కట్టు, తిండి, ఆటలు, పాటలు, పడిన పాట్లు, మన కిచ్చి పోయిన మంచి చెడ్డలు, ఇవ్వన్ని తెలిపి మనకు సహాయ పడును". పైన పేర్కొనిన వాక్యాలు శ్రధ్ధతో పరిశీలిస్తే ప్రతాప రెడ్డి గారి లక్ష్యమేమిటో అర్ధమౌతుంది. ఆలక్ష్య సాధన కోసమే "ఆంధ్రుల సాంఘీక చరిత్ర" రూపొందింది. 1929 నుండి 1949వరకు అంటేరెండు దశాబ్దాల పాటు నిర్విరామంగా వారు చేసిన కౄషి ఫలితమే "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" రచన రూపంలో ప్రచురణమైనది. శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఈ విశిష్ట రచనలో దాదాపు వెయ్యి సంవత్సరముల ఆంధ్రుల సాంఘీక చరిత్ర నిక్షిప్తమైనది. కొన్ని నిక్షిప్తాలను ఆవిష్కరించుకొందామా! 



సాహిత్యం ద్వారా సాంఘిక జీవనాన్ని నిరూపించడం ఈ గ్రంధం యొక్క ప్రత్యేకత. ఒక సంస్కృతి యొక్క పుట్టుక, వికాసాలను గురించి ఆధారలతో విశ్లేషిస్తే అది ఆ సంస్కృతీ, సభ్యతల చరిత్రగా పరిగణింప బడుతుంది. నిజమైన సాహిత్యం యేకాలనికి సంబంధించినదైనా ఆకాలపు ప్రజా జీవితానికి అద్దం పడుతుందని చాలామంది రచయితల నమ్మకము. "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లో మొత్తము ఎనిమిది ప్రకరణాలు ఉన్నవి. అందులో మొదటిది తూర్పు చాళుక్య యుగం. నన్నయ కాలము నుండి కాకతీయుల ప్రాబల్యం దాక దాదాపు క్రీ.శ.1000 నుండి 1200 వరకు తెలుగు దేశము లోని ఆచార వ్యవహాలను సురవరం వారు ఈ ప్రకరణంలో చర్చించారు. ఈ ప్రకరణంలో చర్చించిన విషయాలకు ముఖ్యంగా నన్నెచోడుని "కుమార సంభవము", తెలుగు భారతము (విరాట పర్వము), చాళుక్య సోమేస్వరుడు రచించిన "అభిలషితార్ధ చింతామణి" ఆధారాలగా పరిగణించారు శ్రీ ప్రతాప రెడ్డిగారు. 



వివాహానికి సంబంధించిన ఆచార పద్ధతులను వివరిస్తూ - ఆకాలం తెలుగువారి యిండ్లలో నాలుగు రోజుల పెళ్ళి సాధారణమని, వివాహ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నాలుగు రోజుల పాటు జరుగుతూ వుండేవని పెర్కొన్నారు. మహాభారత కాలాన్ని పురస్కరించుకొని, ఉత్తర వివాహం నాల్గు రోజులు జరిగినదనియు, వివాహానంతరం (దిన చతుష్టయానంతరం) బంధువులు యెవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయినట్లుగా చిత్రించారు. అలాగే మేన మరదలిని పెళ్ళాడే ఆచారం తెలుగు వారిదేనని సురవరం వారు అభిప్రాయ పడ్డారు. ఆకాలపు వేష భూషలను గురించి ముచ్చటిస్తూ స్త్రీలు మట్టెలు ధరించడం కూడా తెలుగు వాళ్ళ ఆచారమేనని, వైదిక పధ్ధతిలో యిటువంటి రివాజు లేదని వెల్లడిస్తూ "తాళిబొట్టు" ద్రావిడాచారముల లోనిదని పేర్కొన్నారు. 



చరిత్ర కారునికి విషయ సేకరణ యెంతముఖ్యమో విమర్శ చేయటం అంతేముఖ్యం. సురవరం ప్రతాప రెడ్డి గారు తూర్పు చాళుక్య యుగమును గురుంచిన చర్చలో ఆనాటి మత విషయమై ప్రస్థావించి, శైవ మతవ్యాప్తికి కారణాలు, రాజరాజనరేంద్రుని క్షత్రియ వంశ విశేషాలు బ్రాహ్మణ జాతి ప్రాముఖ్యత, ఆనాటి కవితారీతులు, యిత్యాది విషయాలను సహేతుకంగా విమర్శించారు. (ఆ.సా.చ.పుట 1o4). వారు పరిశీలించిన పుస్తకాలలో ప్రతిబింబించు జనజీవన స్రవంతిలోని వినోద విషయాలను వివరిస్తూ, అవి యే గ్రంధాలలో వున్నాయో సూచించారు. ఇది శ్రీ రెడ్డిగారి సత్య శోధనకు నిదర్శనం. "అంకమల్ల వినోదము", కోళ్ళ పందెము, లావక పిల్లల కొట్లాట, మేష మహిష యుధ్ధాలు, పావురాళ్ళ పోట్లాట, శ్వేనముల వేట, గీతావాద్య నృత్యములు, పహేళికా, చతురంగము, పాములాట మొదలైన వినోదాలు "అభిలషితార్థ చింతామణి" గ్రంధంలో వర్ణించినారని పేర్కొన్నారు. (ఆ.సా.చ. పుట 7). 



నాటి కవుల రచనల లోని సందిగ్ధమైన కొన్ని శభ్దాలను (పదాలను) నిఘంటువుల సహాయముతో వివరించారు. 



పరిపాలనా వివరాలను గూర్చి ముచ్చటిస్తూ, తూర్పు చాళుక్యుల కాలంలో పంచాయితీ సభలు వుండే వనియు, సభ్యులు, సభలకు వచ్చే అభియోగాలు, శిక్షా తీర్మానాలు మొదలగు విషయాలను విశ్లేషించుటయేగాక,ఎటువంటి వ్యక్తులు పంచాయితీ సభాసభ్యులగుటకు అర్హులో సూచించారు. (ఆ.సా.చ. పుట7). 



ఇదే సందర్భంలో విశ్లేషిస్తూ "చరిత్ర భవన నిర్మాణనికి - సద్విమర్శ, కాల నిర్ణయము, సత్య శోధన, ఆధార విషయాలు పునాది రాళ్ళ వంటివి. వీటిని పునహ్ పరిశీలించుకొని సవరించు కోవటం చరిత్ర కారునికి అత్యంత అవసరము" అని రెడ్డిగారి ధ్రుఢ నమ్మకం. ఆ నమ్మకం తోనే పూర్తి గ్రంధ రచన సాగించారు సురవరం వారు. 



ద్వితీయ ప్రకరణాన్ని కాకతీయుల యుగం (క్రీ.శ.1050 నుండి 1323 వరకు) గా పేర్కొన్నారు ప్రతాప రెడ్డి గారు. ఈ ప్రకరణం లో కాకతీయుల కాలమునాటి జీవన స్రవంతిని కనులకు కట్టినట్లుగా చిత్రించారు రచయిత. కాకతీయుల పరిపాలనా కాలము నాటికి అంధ్ర ప్రాంత మంతట బౌద్ధ మతం క్షీణించింది. జైన మత ప్రభావం యెక్కువగా వుండేది. జైన మత ప్రభావాన్ని వీర శైవులు అణచివేశారు.కాకతీయుల పరిపాలనా కాలంలో మత సామరశ్యం లేని కారణాన మత కలహాలు తరుచుగా జరుగు తుండేవి. జైన, శైవ, వైష్ణవ మతాలు పరస్పర ప్రభావం కోసం పోరాడు తుండేవని పేర్కొన్నారు. 



ఈ కాలంలో ప్రత్యేకించి పేర్కొన దగిన విషయం, కాకతీయులు అనుసరించిన వ్యాపార విధానము. ఆ కాలంలో యితర దేశాలతో వ్యాపార సంబంధాలు అభివృద్ధి చెందాయి. తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి రేవుల ద్వారా రాజ్యం లోనికి అనేక రకములైన వస్తువులు వస్తుండేవి. రేవుల దగ్గర సుంకములు వసువులు చేసేపధ్ధతి అమలులో వుండేది. 



సుంకములకు సంబంధించిన సమాచారం శాసనముల ద్వారా ప్రజలకు తెలియ పరచే వారు.ఓరుగల్లు కోటకు బయటి భాగంలో "మైల సంత" జరుగు తుండేదని, ఆసంతలో నువ్వులు, గోధుమలు, వడ్లు, జొన్నలు, మొదలైన ధాన్యంతో పాటు, బెల్లం, చింతపండు, నెయ్యి, మసాలా దినుసులు, రకరకములైన కూరగాయలు అమ్ముతుండే వారని పేర్కొన బడినది. కాకతీయుల కాలమునాటి సంస్కృతీ సాంప్రదాయలతో మిళితమైన జీవనవిధానాన్ని అద్దంపట్టినట్లు చూపించారు రచయిత ఈ ప్రకరణం ద్వారా. 



"ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లోని మూడవ ప్రకరణము - రెడ్డి రాజుల యుగానికి (క్రీ.శ.1324 - 1434వరకు) సంబంధించినది. రచయిత ఈ ప్రకరణంలో రెడ్డి రాజుల పరిపాలన కాలం నాటి ప్రజా జీవనానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. 



రెడ్డి రాజుల పరిపాలనలో సామాన్య జీవనం - అనగా సామన్య ప్రజలు అనుసరించిన మతమూ, వారి భక్తి విశ్వసాలు, ఆరాధించిన దేవతలు, వ్యవసాయ పద్ధతులు, శివపూజ సమయంలో కొంతమంది చేసే ఆత్మ బలిదానం, సామాన్యుల వేడుకలు, ఆటలు మొదలగు విశేషాలతో భరితమైన సాంఘిక జీవనం అతి రమ్యంగా వర్ణించారు ప్రతాప రెడ్డిగారు. శైవశక్తి పేరుతో గోగులమ్మ, శ్రీ మండల్లి, నూకాంబ, ఘట్టాంబిక, మాణికా దేవి, అనే శక్తులను, కామాక్షి, మహంకాళి తదితర దేవతలను ప్రజలు పూజించేవారని పేర్కొన్నారు. శివ పూజల్లో ఆత్మబలిదానమివ్వటం, అలా బలిదానమిచ్చేవారిని వీరులుగా పరిగణించడం, అప్పటి ఆచారంగా వివరించారు. 



ఆ కాలంలో వ్యవసాయ భూమిని మాగాని (తరి), మెట్ట అని వ్యవహరించేవారు. వరి పండించే భూమిని "మాగాని" అని, జొన్న, రాగి మొదలైన ధాన్యము సాగుచేసే భూమిని మెట్ట అని పిలిచేవారు. ఆ కాలంలో, సామాన్యులు చదరంగం, పులిజూదము, చర్ పర్, మొదలైన ఆటలను ఆడేవారని పేర్కొని, ఆయా ఆటలను విశేషించి వివరించారు,ఈ ప్రకరణంలో శ్రీ రెడ్డిగారు. 



రెడ్డి రాజులు అత్యంత వీరశైవాభిమానులు. అందుచేత శైవ మతమునకు వ్యాప్తినిచ్చిరి. రెడ్లు శైవులైనప్పటికి పరమతస్తులను యెలాంటి భాధలకు గురి చేయలేదు. శివక్షేత్రములను యెక్కువగా అభివృద్ధి చేసిరి. కాని రెడ్డి రాజ్యం చివరి కాలంలో, వైష్ణవ మతము దక్షిణ తమిళ ప్రాంతం నుండి తెలుగు దేశము లోని కెగుమతి కాజొచ్చెనని పేర్కొన్నారు రచయిత. 



రెడ్డి రాజుల పరిపాలనా సమయంలో సముద్ర వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా వర్ణితమైనది. ఈ కాలంలో, కళా పోషణం బాగా జరిగినట్లు చారిత్రక ఆధారలతో నిరూపించారు ప్రతాప రెడ్డీ గారు. ఈ ప్రకరణంలో కవి సౌర్వభౌముడు శ్రీనాధుడు రెడ్డి రాజుల కాలంలోని వాడని పేర్కొంటూ, విధ్యాధికారిగా శ్రీనాధ మహాకవి ప్రవేశ బెట్టిన కొన్ని పధ్ధతులను చర్చించారు. 



ఈ ప్రకరణంలో ముఖ్యముగా పేర్కొనిన విషయమేమంటే, రెడ్డ్లు, వెలమలు, తెలుగు వారు కారని, ఉత్తరాది నుండి వచ్చిన రాష్ట్ర కూటులు రెడ్డ్లుగా పరిగణించ పడినారని, అదే విధముగా తమిళ దేశము నుండి వచ్చిన వెల్లాలు అనువారు తెలుగు దేశములో వెలమలుగా ప్రసిధ్ధి పొందారని శ్రీ సురవరం వారు అభిప్రాయ పడినారు. మరియు, వెలమలు సంఘ సంస్కర ణాభిలాషులని, రెడ్లు పూర్వాచార పరాయణులనీ, యీ రెండు వర్గాల మధ్యెప్పుడూ స్పర్ధ వుండేదని వివరించి, శ్రీనాధుని కాలంలో మాత్రం యిద్దరూ సమానులుగా పరిగణించ పడ్డారని పేర్కొన్నారు. ఇది చారిత్రకంగా గమనింప దగిన విశేషం. 



ఈ రచన లోని 4,5 ప్రకరణాలు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి. ఈ ప్రకరణాలలో క్రీ.శ. 1339 నుండి 1630 వరకు గడచిన సాoఘిక చరిత్రను చక్కగా విశ్లేషించారు ప్రతాప రెడ్డిగారు. 



విజయనగర సామ్రాజ్యము 1336 లో స్థాపితమైనది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అది అత్యంత విస్తరించి,అన్ని రంగాలలోను గణనీయమైన అభివృద్ధిని సాధించి, స్వర్ణయుగంగా ప్రసిద్ధి నార్జించింది. “విజయనగర సామ్రాజ్య మందు ఆంధ్రులది పైచేయిగా నుండినది. ఆంధ్ర దేశము మహావైభవముతోను, ఐశ్వర్యముతోను నిండియుండెను. ఆంధ్రులుత్సాహవంతులై కళా పోషకులై దేశాంతరము లందును ప్రఖ్యాతి గాంచిరి. అది మంచి చెడ్డలతో నిండిన ప్రభంధ యుగము. సుందర నిర్మాణములు, చిత్రలేఖనములు, ఇతర శిల్పములు దేశమంతటను సువ్యక్తములయ్యెను. ధనికుల భోగలాలసత యిదే కాలమందు విజృంభించెను.”విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆంధ్రుల ప్రాబల్యం, పై వాక్యాల ద్వారా పేర్కొనుటయే కాకుండా, నాటి ప్రజా జీవనాన్ని అద్దం పట్టినట్లు చిత్రించారు రచయిత ప్రతాప రెడ్డిగారు, ఈరెండు ప్రకరణాలలో. 



ఆనాటి రాజుల వేష భూషలను గరించి ముచ్చటిస్తూ, నాటి రాజులు పన్నీటిలో కలిపిన కస్తూరిని పూసుకునే వారని, పొడగైన కుచ్చుల టోపీలను పెట్టుకొనే వారని, చెవులకు ముత్యాల పోగులు పెట్టుకొని, మెడలో ముత్యాల హారములు వేసుకొని, యెర్రని అంచులతో కూడిన తెల్లని వస్త్ర్రాలు ధరించే వారని, బంగారు పిడితో కూడిన కత్తిని చేపట్టే వారని వివరించారు. రాజులకు, రాజబంధువులకు వేటపై యెక్కువ ఆసక్తి వుండేదని, చిరుత పులులను జింకలను వేటాడెడు వారని వివరించారు. 



ఆటవికులు రాజదర్శనానికి వచ్చినప్పుడు, రిక్త హస్తాలతో కాకుండా, కానుకలుగా పక్షి పిల్లలు, దుప్పి కొమ్ములు, యేనుగు దంతములు, పులి గోర్లు, జింక చర్మం, తేనె, చారపప్పు మొదలగునవి యిచ్చుట అనే సదాచారం పాటించేవారని పేర్కొన్నారు సురవరంవారు. 



సాధారణ జన జీవనాన్ని గూర్చిన చర్చలో రెడ్లు సాధారణ జనులలో ముఖ్యు లనియు, వ్యవసాయమును తమ ప్రధాన కుల వృత్తిగా పాటించే వారని వివరించారు. ఆ కాలం లోని రెడ్లు తమ చేల వద్ద గుడిశలు వేసుకొని మంచెలు కట్టుకొని పిట్టల నుండి, దొంగల నుండి చేలకు కావలి గాసేవారలని, వారి స్త్రీలు ముసురు పట్టిన వర్షా కాలంలో అంబలి పాత్రను నెత్తిమీద పెట్టుకొని దానిపై జమ్ముతో అల్లిన గూడను వేసుకొని కావలిగావున్న తమ పురుషులకు యిచ్చెడివారట! రాయలవారు, చిన్న ప్రదేశములందు సహితము, చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించి, రైతులకు తక్కువ పన్నులపై భూములిచ్చి,వ్యవసయదారులను ప్రోత్సహించిన విధాన్ని ప్రతాప రెడ్డిగారు చారిత్రక ఆధారలతో సహితం వర్ణించారు. విజయనగర రాజుల కాలంలో దేశీ, విదేశీ వ్యాపారము అత్యంత అభివృధ్ధి చెందెను. "విజయనగర సామ్రాజ్యము తూర్పున కటకము నుండి రామేశ్వరము వరకును, పడమట గోవానుండి కన్యాకుమారి వరకును వ్యాపించి యుండెను. అందువలన తూర్పున బర్మా, మలయా, ఇండోనేషియా, చైనా దేశములతో వ్యాపారము జరిగెనని వివరింప బడినది. పడమట గోవాలో, కాలికట్టు రేవులో ఎక్కువ వ్యాపారము జరిగెను. కాలికట్టు వంటి మంచి రేవులు సామ్రాజ్యమందు 300 వరకు వుండెను". వ్యాపార విశేషాలను వివరిస్తూ - "విజయనగర సామ్రాజ్యము నుండి బట్టలు, బియ్యము, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు యెగుమతి యయ్యెను. తమిళ దేశపు రేవగు పులికాటు నుండి మలకా, పెగూ, సుమత్రా దేశాలకు రంగు అంచుల ముద్రలుకల [కలంకారి} వస్త్రములు నెగుమతి చేసిరి". 



ఆ కాలములో మిరియాలకు చాలా గిరాకి వుండెడిదనియు, మళయాళ దేశ మందు మిరియాలు సమృధ్ధిగా పండుట వలన వ్యాపారులు వాటి నక్కడి నుంచి తెప్పించి, తెలుగు దేశమంతట అమ్మినారని ప్రతాప రెడ్డిగారు అభిప్రాయ పడినారు. విజయనగర పరిపాలనా కాలంలో పరిశ్రమలను గూర్చి ముచ్చటిస్తూ - తెనుగు సీమ ప్రాచీనము నుండి వజ్రాల గనులకు ప్రసిధ్ధి చెందిన దని, "గుత్తి" కి 20 మైళ్ళ దూరములో నున్న "వజ్రకారూరు" వజ్రాలకు ప్రసిధ్ధి చెందిన దనియు, గుత్తి దుర్గా ధీశుడు అక్కడి వజ్రాలను చక్రవర్తులకు పంపెడివాడని, ఇటువంటి వజ్రపు గనులు రాయల సీమ ప్రాతంలో మరి నాల్గు వుండెడి వనియు, చారిత్రక ఆధారలతో నిరూపించారు శ్రీ ప్రతాప రెడ్డిగారు. 



రెడ్డి గారి దృష్టిలో విజయనగర కాలమునాటి ప్రజల వేష ధారణ ప్రత్యేకించి గమనింపదగిన విషయం. ముఖ్యముగా "పాలవేకరి కదరీ పతి" చూపించిన వేషాలను సురవరం వారు వర్ణించారు. వీనిలో ఎరుక పాలెగాడు, వేటవేషం, కోమటి శెట్టి వేషం, దాసరి సాని, కరణము, తురక జవాను, పురోహితుడు, ఎరుకలి, రాజు, భటుడు, బ్రాహ్మణ స్త్రీ , రెడ్డి స్త్రీ, మొదలైన పాత్రల వేష ధారణా విశేషాలను సవివరంగా చిత్రించారు. ఈ పాత్రలన్ని, విజయనగర కాలమునాటి సమాజ ప్రతిబింబాలని శ్రీ రెడ్డిగారి అభిప్రాయం. విజయనగర సామ్రాజ్య కాలములో పంచాయతి సభలు ప్రతి గ్రామమందు స్ధిరముగా నున్నట్లు తెలియు చున్నది. పంచాయితీ పధ్ధతి తమిళ దేశ మంతటా క్రీ.శ. 800 సంవత్సరము నుండియే ప్రసిధ్ధి చెందినది. కుల వివాదాలు, సంఘ సంస్కారపు కట్టుబాట్లు, నేరముల విచారణ, పన్నుల వసూళ్ళు గ్రామ ముఖ్యులే చేయు చుండిరట. అన్ని తీర్పులకు కూడా వారే భాద్యులు. ఆ పధ్ధతులే తెలుగు సీమలోను బలపడినట్లు తెలియు చున్నది. తెలుగు సీమలో పంచాయితీలకు యెన్నికలు మాత్రం జరిగిన నిదర్శనలు మాత్రం కనిపించవు. పంచాయితీ విధానము మాత్రము బాగానే అమలు జరిగినట్లు తెలియుచున్నది. 



క్రీ.శ. 1600 నుండి 1757 వరకు జరిగిన సాంఘిక చరిత్రను ఆరవ ప్రకరణంలో చర్చించారు సురవరం ప్రతాప రెడ్డి గారు.విజయనగర సామ్రాజ్య పతనము ఆంధ్రుల పతనానికి దారి తీసిందని రెడ్డి గారి అభిప్రాయము. క్రీ.శ. 1630 ముందే హిందువుల పతనం, ముసల్మానుల విజృంభణ జరిగినట్లు చారిత్రక ఆధారాలతో నిరూపితమైనది. 



తళ్ళికోట లేక రక్షస తగడి యుధ్ధం క్రీ.శ. 1565 లో జరిగింది. ఆయుధ్ధము తర్వాత ఆంధ్ర దేశములో రాజకీయ దౌర్బల్యం మొదలైంది. కొంత కాలం పెనుగొండలో ఆంధ్రరాజుల పాలన సాగింది. కాని, అక్కడి నుండి పీఠము చంద్రగిరికి మారగానే ఆంధ్రుల రాజకీయౌన్నత్యం పరిసమాప్తి అయిందనే చెప్పాలి. క్రీ.శ. 1600 వరకు ఆంధ్ర దేశము లో ఒక్క గోల్కొండ సుల్తానులు తప్ప తక్కిన తురక లెవ్వరునూ రాజ్యము చేయలేదు. అప్పటికి గోల్కొండ నవాబుల ఆధిక్యము తెలంగాణలో వున్నప్పటికి, ప్రక్కన విజయనగర చక్రవర్తుల ప్రభావ మున్నందు వలన నవాబులు ఆంధ్రులను దుష్టముగా పాలించిన వారు కారు. కాని, తళ్ళికోట అనంతరం తెలుగు దేశములో తురకల విజృంభణము యెక్కువయ్యెను. క్రీ.శ. 1600 తర్వాత 150 ఏండ్ల వరకు తురకల దాడు లెక్కువై కర్నూలు,కడప,గుంటూరు నవాబు లేర్పడి, ఉత్తర సర్కారులు వారి వశమై దుష్పరిపాలన వొకవైపు సాగుచుండగా, మరో ప్రక్క, పిండారీలు, దోపిడి గాండ్లు తురకల దండ్లు యెక్కువై జనుల హింసించి, చంపి, దోచి, చెరచి, గుడులను కూల ద్రోసి, నానా ఘోరాలు చేయగా ఆంధ్రులు భయ భీతులై వర్ణించజాలని బాధలకు లోనైరి. ఆనాటి ప్రజల దైన్యస్థితి, అప్పటి కావ్యాలలోను, ప్రభంధాలలోను, చాటువులలోను ప్రతి బింబితమైనది. ఈ ప్రకరణములో పేర్కొనిన సాంఘిక చరిత్రకు వేమన పద్యములు, వెంకటాధ్వరి విశ్వగుణ దర్శనము, గోగులపాటి కూర్మనాధుని - సింహాద్రి నారసింహ శతకము, భల్లా పేరకవి భద్రాద్రి శతకము మొదలగునవి ఆధార భూతములుగా పరిగణించ బడినవి. పైన పేర్కొన్న గ్రంధాలను నిశిత విమర్శకా దృష్టితో పరిశీలించి చారిత్రక విషయాల నిగ్గును తేల్చుట ప్రతాప రెడ్డి గారి వంటి పరిశోధకులకు తప్ప అన్యులకు అసాధ్యము. దక్షిణ దేశములో రఘునాధ రాయని కాలములో [1614-1633] ఆంధ్రుల గొప్పదనము నిలిచి యుండెనని తెలియు చున్నది. అతని కాలములో తెనుగు వారిపై మహమ్మదీయుల ఆక్రమణలు కాని, యుధ్ధాలు కాని సాగనేరక పోయెను.తెలుగు ప్రజల సంస్కృతీ సభ్యతలను పరిరక్షణ చేయుటయే కాక, వాని వికాసనికి రఘునాధ రాయల పాలన దోహదాన్నిచ్చింది. 



ఇతర ప్రాంతాలలో తెలుగు వారు తమ పూర్వులు నిర్మించిన శిల్పాలను కోలుపోయిరి కాని, తంజావూరులో పాతవి నిలుపుటయే కాక రఘునాధ రాయలు చక్కని శిల్ప సౌందర్యము కల దేవాలయాలను, రాజభవనాలను, కోటలను నిర్మింప జేసెను.రఘునాధ రాయల కాలంలో, సంగీత, సాహిత్య, నృత్యకళలు అభివృధ్ధి పొందెను. కాని అతని కుమారుని రాజ్య కాలంలో తంజావూరు స్వాతంత్ర్యం మట్టిలో కలసి పోయెను. క్రీ.శ. 1600 నుండి 1757 వరకు గల కాలములో ముసల్మానుల నీడలు తెలుగు వారిపై అధికముగా పారెను. 1700 తరువాత తెనుగు వారి పతనము పూర్తిదశకు చేరుకొనెను, అని ఆంధ్రదేశ సాంఘిక స్థితిని విశ్లేషించారు శ్రీప్రతాప రెడ్డి గారు. 



క్రీ.శ. 1757 నుండి 1857 వరకు జరిగిన సాంఘిక చరిత్రను సమీక్షించారు శ్రీప్రతాప రెడ్డిగారు ఈ ఏడవ ప్రకరణం లో. క్రీ.శ. 1197 లో మహ్మద్ ఖిల్జీ ప్రారంభించిన తురక రాజ్యం అనేక విజయ పరంపరల తో 550 సంవత్సరాల తరువాత 1757 లో ప్లాసీ యుధ్ధంతో పరాజయం పొందింది. ఇంగ్లీషువారు భారత రoగం మీద ప్రత్యక్ష మైనారు. ఈ కాలం లో ఆంధ్రుల ఆర్ధిక పరిస్ధితిని గూర్చి చర్చించారు రచయిత. ప్లాసీ యుధ్ధం తరువాత దేశం ఇంగ్లీషు వారి చేతుల లోనికి అతి వేగంగా పోయింది. 600 ఏండ్ల భీభత్స పాలనతో తురకలు భారత దేశమును పూర్తిగా గెలువ లేక పోయినారు. కాని 100 సంవత్సరముల లోనే యావద్భారత దేశాన్ని ఇంగ్లీషువారు గెలుచుకొనిరి. ఇంగ్లీషు వారికి ప్రజల సౌకర్య సమాలోచనం కించిత్తు కూడ లేకుండెను. వారిది ప్రత్యక్ష పరోక్షా పహరణమే. తమ దేశపు సరుకులను ఇచ్చట అమ్ముటకై మన దేశపు పరిశ్రమలు నాశనము చేశారు. వారి పాలనలో క్షామాలు యెక్కువగా నుండెను. ముస్ల్మానులు హిందువులను దోచిన దంతయు దేశమందే వుండి మరల క్రమముగా అది అంతయూ జనులకే చెందెను. కాని ఇంగ్లీషు వారు వ్యాపారం ద్వారా, పన్నుల ద్వారా, దోపిడీల ద్వారా గ్రహించిన దంతయు తిరిగి రాకుండా ఇంగ్లాండు చేరెను. ఇది మన ఆర్ధిక పతనానికి ముఖ్య కారణం. 



ఉత్తర సర్కారులను, రాయల సీమ అను కర్నూలు, కడప, బళ్ళారి, అనంత పురం జిల్లాలు, గుంటూరు జిల్లాయు, క్రీ.శ. 1800 లోపలనే ఇంగ్లీషువారి ఆధీనము లోనికి పోయెను. 1857 నాటికి తెలుగు దేశమంతా ఇంగ్లీషు వారి వశ మయ్యెను. ఉత్తర సర్కారు నాలుగు జిల్లాల లోని భూమి అంతా జమిందారుల పాలెగారు తెగకు చెందినది. ఈ జమిoదారులు మొగలు సుల్తానులకు కప్పము కట్టి, ఇంచుమించు రాజులై వ్యవహరించారు. ఈ పాత పధ్ధతిని మార్చి శాస్వత భూమి పన్ను పధ్ధతిని ప్రవేశ పెట్టారు.ఇంగ్లీషు ప్రభుత్వం దేశం లో ఆర్ధిక స్థితిని క్షీణ దశకు చేర్చింది. ఇంగ్లీషు ప్రభుత్వ ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థ పైననే కాక, దేశ జనుల ఆచారముల పై కూడ, యెక్కువైనది. 



1857 కు పూర్వముండిన ఇస్లాం మత వ్యాప్తి,తర్వాత ఆగిపోయెను. క్రైస్తవ మత వ్యాప్తి సంఘములు [మిషనరీలు] అనువైన స్థలములందు స్థాపిత మయ్యెను. నానా విధములైన సేవల ద్వారా మిషనరీలు జనులను క్రైస్తవ మతము లోనికి ఆకర్షించు చుండిరి. తమ మత గ్రంధమైన బైబిల్ ను భారతీయ భాష లన్నిటి లోనికి అనువదించి, ముద్రించి అందరికి వుచితముగా పంచి పెట్టిరి. విశేషముగా అంటరాని జాతుల వారు తమ తమ కులాలను విడచి క్రైస్తవ మతము లోనికి చేరి పోయిరి. కొన్ని జిల్లాలో రెడ్ల లాంటి యితర కులాల వారు కూడా క్రైస్తవ మతము లో చేరిరి. మిషనరీలు, ఫాదరీలు తమ మతము గొప్పదనాన్ని ప్రచారము చేసు కొనుటలో తృప్తి చెందక, హిందువుల ఆచారలను గురించి, ఆంధ విశ్వాసలను గూర్చి దుష్ప్ర్రచారము చేసి, హిందూ సంఘము లోని లోటు పాట్లు బయలు పరచి, జనులలో హిందూ మతముపై విశ్వాసమును, భక్తిని, ఆదరమునూ పోగొట్టు ప్రయత్నాలు విరివిగా సాగించిరి. ఈ పరిస్థితులలో ఆర్య సమాజం ఆధ్వర్యాన సనాతన హిందూ మత ప్రచారం, బ్రహ్మ సమాజం ద్వారా సంఘ సంస్కార ప్రయత్నాలు మొదలైనవి. 



రాజా రామమోహన్ రాయల బ్రహ్మ సమాజ శాఖలు కొన్ని కృష్ణా, గోదావరి జిల్లాలో స్థాపిత మాయెను. ఆర్య, బ్రహ్మ సమాజ భావములు జనులలో బాగా వ్యాపించెను. కందుకూరి వీరేశలింగం ఫంతులు కులముల తార తమ్యముల మీద, మూఢ విశ్వాసాల మీద, అవైదికమగు మూర్తి పూజల మీద దెబ్బ తీసెను. స్త్రీలపై జరుగు అత్యాచారములను, ముఖ్యముగా వితంతువుల పునర్వివాహము చేయక నిరోధించుటను ప్రతిఘటించి, వితంతు వివాహములను చేయించి, అనేక వితంతు శరణా లయాలను స్థాపించారు. ఆయన సంఘ సంస్కరణ ప్రయత్నాల మూలముగాను, ప్రచార పధ్ధతుల మూలముగాను, తెలుగు దేశములో అపూర్వ సంచలనము కలిగెను.అనేక దురాచారములు, స్త్రీ సహగమనం లాంటివి సమాప్త మయ్యెను. పారతంత్ర్య విముక్తికి ముఖ్య సాధనము సంఘ లోపముల సంస్కారమని, ప్రజలలో చైతన్యాన్ని మేల్కొల్పి, అనేక సంఘ సంస్కరణలకు మార్గ దర్శకు లైరి. 





ఈ సందర్భము లోనే క్రీ.శ. 1885 అఖిల భారత జాతీయ మహా సభ [నేషనల్ కాంగ్రేసు] స్థాపిత మయ్యెను. కాంగ్రేసు అవతరణ జాతీయతకు పునాదిగా భావించ వచ్చును. 



ఇంగ్లీషు పరిపాలన ఆర్ధికముగా దేశానికి గొప్ప నష్టం కలుగ జేసింది. దేశములోని పరిశ్రమలు నసించాయి. కొత్త పరిశ్రమలను ఇంగ్లీషు వారు అణగ ద్రొక్కిరి! ఆకారణంగా, జనసామాన్యం వ్యవసాయముపై ఆధార పడవలసి వచ్చెను. తరచుగా క్షామములు వచ్చుట చే అపార జన నష్టము జరిగెను. 1876 - 78 సంవత్సరాలలో దక్కను లో మహా క్షామము సంభ వించెను. ఆ క్షామము [ధాత కరువు] దెబ్బ తెలుగు సీమపై విశేషముగా పడెను. ధాత కరువులో లక్షల కొలది జనం తెలుగు సీమలో మరణించిరి. ధాత కరువును గూర్చిన కథలు, పాటలు నేటికిని ప్రచారము లో వున్నవి. 



ఈ సమీక్షా కాలము [1857 నుండి 1907 వఱకు] లో సామాన్య జనుల ఆచార వ్యవహారాల ల్లోను, మత విశ్వాసల లోను అనేక మార్పులు చోటు చేసుకొన్నట్లుగా చిత్రించారు, ప్రతాప రెడ్డి గారు. ఇంగ్లీషు వారు తమ నూతన భావాలతో హిందువుల లోనే కాకుండా, ముస్లీముల లోను మార్పులు తెచ్చిరి. ఇంగ్లీషు విద్యా వంతుల లో కొందరు ఇంగ్లీషు వేషములను [సూటు, బూటు] ధరించుట గౌరవ సూచకంగా భావించ మొదలిడిరి. కాలముతో పాటు ప్రజలు ఆధునిక యుగము లోకి అడుగు పెట్టారు. టపా, రైలు, తంతీ సౌకర్యాలు వృధ్ధి కాజొచ్చెను. ముద్రణా యoత్రములు విడివిగా వాడి దిన, వార పత్రికల ప్రకటనా, ప్రచారము లెక్కువ గా జొచ్చెను. 



ఇంగ్లీషు వారి ప్రభావము తెలుగు భాషపై చాల పడెను. ఇంగ్లీషు చదివిన విద్వాంసులు కందుకూరి వీరేశ లింగంగారు, కొమర్రాజు లక్ష్మణ రావు, గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, కట్టమంచి రామ లింగా రెడ్డి గారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, ఆంధ్ర వాఙ్మయ పంధానే మార్చినారు. కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారము సనాతనపు కోటలో గుండు ముట్టడి చేసి పెద్ద సంచలనము కలిగించెను. వీరేశ లింగం గారి ప్రతిభ సర్వతో ముఖాభి వృద్ధి జెంది, పలు రకాల సాహిత్య ప్రక్రియలకు నాందీ వచనము పల్కెను. కొమర్రాజు వారు, గాడిచర్ల వారు, రావిచెట్టు రంగా రావు గారు, [అంటే ఉత్తర సర్కారు, రాయల సీమ, తెలంగాణ ప్రతినిధులు] కలిసి 1907 వ సంవత్సరములో హైదరాబాదు లో "విఙ్ఞాన చంద్రికా" గ్రంధ మాలను స్థాపించారు. ఇది చారిత్రాత్మక సంఘటన. ఆ గ్రంధ మాల తొలి ప్రచురణ గాడిచర్ల వారి అబ్రహం లింకన్ చరిత్ర,, కొమర్రాజు వారి పీఠికతో ప్రచురితమైనది. భాషా వికాసానికి గద్య రచనల ఆవశ్యకతను గుర్తించిన పరవస్తు చిన్నయ సూరి, కందుకూరి వీరేశ లింగం గారు గద్య రచనలు వ్రాసి ప్రచురించిరి. ఆ కాలం లో అనేక వార, మాస పత్రికలు స్థాపితమై, వుపయోగము కొరకు వాఙ్మయం పుట్టించి, తెనుగు భాషను యొక నాగరిక భాషగా పెంపొందించుటకు వారు చేసిన కృషి అత్యంత ప్రశంస నీయం. ఆ ప్రయత్నములో యొక సహస్ర భాగ మైనా యిప్పుడు [ఈ కాలంలో] జరిగితే సంతోష కారణ మగును. చంద్రికా గ్రంధ మాల తెలుగు భాషా వాఙ్మయ వికాసమునకు చేసిన సేవ యెంతయో మెచ్చు కొన దగినది. 1900 ల తర్వాతి కాలం లో తెనుగు లో ఇంగ్లీషు, సంస్కృత పధ్ధతులపై నాటకాలు, నవలలు, వచన రచనలు, విమర్శలు, చరిత్రలు, జీవిత చరిత్రలు, ఖండ కావ్యాలు, విరివిగా ప్రచురించ బడసాగెను.



బెంగాలు విభజన వ్యతిరేకతతో బెంగాలులో మొదలైన జాతీయోద్యమం గాలి తూర్పు తీర మందలి యుత్తర సర్కారు తెలుగు జిల్లాల పై వీచెను. దానితో మన పూర్వ సంస్కృతి గర్వింప దగినది కాదనిన అపోహ మారి భాషాభిమానం యుప్పొంగి, రక రకాల సాహిత్య, సంగీత, నాట్య కళల పునర్వికాసానికి మార్గ మైంది. 1857 విప్లవానంతరం తెలుగు సీమలో యెక్కువ పురోభి వృధ్ధి సర్కారు జిల్లాలో జరిగింది. అనేక కారణాల వలన, రాయల సీమ, తెలంగాణ ప్రాంతాలలో అభివృధ్ధి మందకొడిగా సాగింది. ఈ అసామనత అనేక కష్టాలకు దారి తీసింది. ప్రాంతీయత తెలుగు జాతి దౌర్బల్యానికి హేతువై, తెలుగు జాతి సమైక్యతకు గొడ్డలి పెట్టుగా పరిగణించింది. 



"ఆంద్ర్హుల సాంఘిక చరిత్ర" అనే ఈ గ్రంధములో దాదాపు వెయ్యి సంవత్సరములు తెలుగు జాతి యేవిధముగా బ్రతికిందో కళ్ళకు కట్టినట్లు చిత్రించ బడినది. ఈ చరిత్ర ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తా ఫలము. 



కీర్తి శేషులు నార్ల వెంకటేశ్వర రావుగారు అన్నట్లు గా "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ఆంధ్ర జాతి గత చరిత్రను తెలుసు కొనడానికి యుపక రించుటయే కాక, యేయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరి యేయే కారణాలు దాని పతనానికి దోహద మిచ్చినవో సందర్భాను సారంగా వివరిస్తున్న యీ మహా గ్రంధం, ఆంధ్రులకు భావి కర్తవ్య పధాన్ని నిర్దేశిస్తున్నది కూడ". ఆంధ్ర జాతి చరిత్రను ప్రతిభా పూర్వకముగా చిత్రించిన శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు సంస్తవ నీయులు. తెలుగు వారంతా యీ పుస్తకాన్ని చదివి ఆనందించాలని కోరుకొంటూ - యావత్తెలుగు జాతి శ్రీ రెడ్డి గార్కి సదా ఋణ పడి వుంటుందని నమ్ముతూ వారికి కృతజ్ఞతలు తెలియజేసు కొంటున్నాను. 



ఈ వ్యాస రచనలో ఈ దిగువ పేర్కొనిన రచనలు వుపకరించినవి. ఆయా రచయితలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. 



1.] ప్రతాపరెడ్డి, సురవరం, 1896 - 1953. 

ఆంధ్రుల సాంఘిక చరిత్ర., హైదరాబాదు, ఓరియంటల్ లాజ్మన్, 1996. xv, 364 పుటలు. 

2.] శాస్త్రి. ద్వా. నా. 

శత జయంతి సాహితీ మూర్తులు. హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1997. 135 పుటలు. 

3.] రమణ, కె. యస్. 

సురవరం ప్రతాప రెడ్డి : సంక్షిప్త జీవిత పరిచయం. హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2009. 46 పుటలు. 

4.] వల్లభ రాయుడు, వినుకొండ. 

క్రీడాభి రామము. బి. వి. శింగరాచార్య సంపాదితం. హైదరాబాదు, ఎమెస్కో, 2009. 189 పుటలు. 



ఈ వ్యాసం కీ.శే. సురవరం ప్రతాప రెడ్డి గారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ను గురించిన విశిష్టతా వివరణ మాత్రమే కాని, విమర్శ కాదు. చదువరుల దృష్టిని మంచి రచనల వైపు ఆకర్షించి, పఠనా సక్తిని పెంపొంద జేసే, సాహిత్య వ్యాసంగ ప్రసారణా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలిస్తుందని రచయిత నమ్మకం. 


ఈ వ్యాసం స్వీయ రచన. ఎవరి రచనకూ - అనువాదం కాని, కాపీ కాని కాదు.
దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు