Wednesday, July 24, 2019

అమ్మ కోసం

అమ్మ కోసం
ప్రపంచంలో ఎవరంటే ఇష్టం అంటే మొదటగా చెప్పేది అమ్మ పేరు మాత్రమే. ఎందుకంటే సర్వం అమ్మ ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదా అంటే కనిపిస్తుంది కానీ అమ్మ ప్రేమలా బయటకు వ్యక్తమవ్వదు. ఇలాంటి ప్రేమలు రానున్న రోజుల్లో చూడడానికి కనుమరుగైపోతాయెమో? ఈ సృష్టిలో తల్లిదండ్రులను మించిన ప్రేమ మరొకటి ఉండదేమో! ఈ వ్యక్తి చాలా మంచివాడు చాలా వినయంగా నడుచుకుంటాడు అంటే వాళ్ల తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం అలాంటిదని సహజంగా ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. మా తల్లిదండ్రుల పెంపకంలో కూడా నేను అలాగే పెరిగాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు. మాకు ఇరవై ఎకరాల పొలం ఉంది. ఈ ఇరవై ఎకరాల పొలాన్ని మా నాన్న ( గోపాలరావు ) గారు ఒక్కరే సాగు చేసేవారు. నేను చిన్నప్పుడు పొలంలో ఉన్న మా నాన్నగారికి అన్నం పట్టుకెళ్లేవాడిని. మా నాన్నగారు పొలం పనులు చేస్తుంటే నేను కూడా చేయాలని పొలంలో దిగి పని చేస్తుంటే నీకు ఎందుకు నాన్న ఈ పొలం పనులు, చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకో అని ప్రతిరోజు చెబుతుండేవారు. నేను పదవ తరగతిలో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు అప్పుడు నేను పొలం పని చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా అమ్మ ( అన్న పూర్ణమ్మ ) నాన్న మాట ప్రకారం పైచదువులు చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోమని చెప్పారు కదా! చక్కగా చదువుకో నాన్న అని బ్రతిమలాడి చెప్పింది. అప్పటి నుండి నాకు అమ్మ మాటలే నాకు మా ఊరిలో మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టింది. అంతేకాదు అందరికంటే ఎక్కువగా చదువుకున్నది నేనే. మా ఊరిలో చాలామంది పది పాసైన వారు ఉన్నారు కానీ ఎక్కువగా పొలం పనులకు వెళ్ళి పోతూ ఉండేవారు. కానీ మా అమ్మ నా  పై చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చదివించింది.
నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండగా నాకు పెళ్లి సంబంధాలు చూడమని పక్క ఊర్లో ఉన్న దూరపు బంధువులకు చెప్పింది అమ్మ. అమ్మాయి ( పెళ్లి కూతురు )ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మా అబ్బాయిని జీవితాంతం చక్కగా చూసుకోవాలి. ఇలా మా ఊళ్లో ఎవరు కనబడిన ఇలాగే చెప్పేది అమ్మ. ఏదైతేనేం నా పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా చేసింది. నా భార్య పేరు సాహితి. సాహితీ అనే పేరులోనే మంచి సాహిత్య విలువలు ఉంటాయని మా అమ్మ పెళ్లి కార్డు చూసినప్పుడు చెప్పింది. నాకు పెళ్ళైన మూడు నెలలకి నాకు ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు రమ్మని బాగా ఒత్తిడి చేశారు. మీకు ప్రభుత్వ ఉద్యోగం పై వచ్చే జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్లు కాల్ లెటరు చేతిలో పెట్టి  వారంలో మీరు ఉద్యోగానికి వచ్చేది , రానిది  విషయాన్ని తెలియజేస్తారని చెప్పి వెళ్లిపోయారు.  అప్పుడు మా అమ్మగారు ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం ఉంది హైదరాబాదు ఎందుకు వద్దులే అంది అమ్మ. నా మనసులో ఉన్న మాట కూడా అదే. ఇంతలో మా అత్తగారు , నా భార్య సాహితి అమ్మగారు ఇంతకంటే మంచి జీతం మరెక్కడా సంపాదించుకోలేరు. ప్రస్తుతం ఉన్న జీతం కంటే మూడు రేట్లు ఎక్కువగా ఇస్తున్నారంటే ఇంతకంటే ఏముంది అని ఆ టీవీ ఛానల్ గురించి గొప్పగా చెప్పింది. అసలు నేను టీవీ ఛానల్ కి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రస్తావన టీవీ ఛానల్ వరకు ఎందుకు వెళ్ళింది అని ఆరా తీయగా మా అత్తగారు బంధువులు ఆ టీవీ ఛానల్ వాళ్ళకి గొప్పగా చదువుకున్న వ్యక్తి, సామాజిక అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి అని  నా పేరు వాళ్ళకి తెలియజేశారని తెలిసింది. ఇంతలో నా భార్య కూడా హైదరాబాద్ వెళ్దాం అండి హైదరాబాదు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. దయచేసి ఒప్పుకోండి అని ఒత్తిడి చేసింది. ఊళ్లో చాలామంది ఇంత పెద్ద జీతం వస్తుంటే వెళ్ళండి అని చెప్పారు. కానీ నా మనసు అంగీకరించలేదు. చివరకి మా అమ్మగారిని కూడా నా భార్య ఒప్పించింది. హైదరాబాద్ వెళ్దామని అన్ని సర్దుకున్నాం . ఇంతలో మా అమ్మగారు నేను రావడం లేదు నాన్న ఇక్కడ పొలం ఇల్లు చూసుకోవాలి మీరు సంతోషంగా వెళ్ళండి అని చెప్పింది. మీరు రాకపోతే నేను రాను అమ్మా! మేము ఇక్కడే ఉంటాం. అని చెప్పగా ఇంతలో అమ్మ ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చి మన ఇంట్లో ఎవరైనా ఉండడానికి వస్తే నేను వస్తాను బాబు అని చెప్పింది. అయినా నేను వెళ్లకుండా ఉండిపోయాను కానీ నా భార్య వారం రోజులుగా బిక్కమొహం వేసుకుంటూ సరిగ్గా అన్నం తినకుండా ఉంది. మా అమ్మ మమ్మల్ని బలవంతంగా హైదరాబాదుకు పంపింది.
హైదరాబాద్ లో ప్రముఖ టీవీ ఛానల్ లో నా ఉద్యోగం అయినప్పటికీ మనసంతా అమ్మ మీద ఉంది ఎందుకంటే అమ్మను వదిలి ఇంత దూరం రాలేదు. వీళ్లు ఇచ్చే జీతం కంటే అమ్మ మాటలే చాలా విలువైనదని తెలుసుకున్నాను. సంవత్సరానికి పాప పుట్టింది. అంతులేని సంతోషం అచ్చం అమ్మ లా ఉందని. పాపను తీసుకునే మా ఊరు వెళ్ళాం. మా అమ్మ కూడా  సంతోషపడుతూ మా మనవరాలు చూడు ఎంత చక్కగా ఉందో అంటూ వచ్చే పోయే వాళ్లకు చూపెడుతుంది. ఇంతలో నా భార్య సాహితి  పాపను అలా అందరికీ చూపించకూడదు అని మా అమ్మతో చెప్పింది. అందుకు అమ్మ అందరికీ అంటే ఊళ్లో వాళ్లు పరాయి వాళ్ళు కాదు అందరూ మనవాళ్ళే అని చెప్పింది అమ్మ. మా ఊరిలో ఒక వారం రోజులు ఉండి తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. నేను మా ఊరికి వెళ్లడం తగ్గించేశాను. అప్పుడప్పుడు అమ్మ వస్తూ ఉంటుంది. నేను ఉదయం వెళితే మళ్లీ రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చే వాడిని. ఇలా ప్రతి రోజు నేను చేసే పని ఏమీ లేకపోయినా నా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్టుగా ఉండిపోయేవాణ్ణి.
హైదరాబాదులో సొంత ఇల్లు,  కార్లు ఉన్నాయి. మా ఊర్లో ఉన్న ఇల్లు పాతబడి పోయింది. పొలాన్ని కౌలుకిచ్చి మా అమ్మగారిని హైదరాబాద్ తీసుకు వచ్చాను. మా అమ్మ  ఒక నెలరోజులు ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా బాధపడింది. ఎందుకంటే సొంత ఊరు వదిలి ఇంతవరకు ఇన్ని రోజులు లేదు. మేము సినిమాలకి,  షికార్లకి వెళ్ళేటప్పుడు మా ఆమ్మ బయటకు వచ్చేది కాదు. ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. మేము బయటి నుంచి వచ్చేసరికి వంటపని, ఇంటిపని చక్కగా చేసేది. అమ్మ చేతి వంట అంటే చెప్పేదేముంది. బయట తిన్న తృప్తి ఉండదు. ఏదైనా అమ్మ వంట అమృతమే! అమ్మ రాకముందు మా ఇంట్లో ఇద్దరు పని వాళ్ళు ఉండేవారు. పల్లెల్లో పొలం పనులు చేసే వాళ్ళు ఇంట్లో చాలా చక్యంగా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో ఐదు మంది చేసే పని, పల్లెల్లో పొలం పనిచేసేవాళ్ళు ఒక్కరితో సమానం. మా అమ్మ ఇంటికి వచ్చిన ( హైదరాబాద్ ) తర్వాత నా భార్య సాహితీ, నా కూతురు ఆమని ఇంతవరకూ ఇంట్లో ఎలాంటి పనులు చేయలేదు. నా భార్య సాహితి పల్లెటూర్లో ఎలా ఉందో దానికి భిన్నంగా ఉంది. ఆమెతో పాటు నా కూతురు ఆమని కూడా ఇలానే ఉంది అంటే సిటీ లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి ఆటలోనే చూసి వస్తారు. పైగా విపరీతమైన షాపింగ్ చేసి వస్తారు. నా కూతురికి పాతికేళ్లు దాటిన బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది.
ఒకసారి అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాము. అక్కడికి మా ఊరి వాళ్ళు వచ్చారు . మా అమ్మను కూడా తీసుకు వస్తే చాలా సంతోష పడేదేమో అని మనసులో అనిపించింది. మేము బయటకి వెళ్ళిన ప్రతిసారీ అమ్మ వచ్చేది కాదు అలా అని ప్రతిసారి మేము అడిగే వాళ్ళం  కాదు. ఈసారి ఎందుకనో అడగకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాను. మేము ఇంట్లోకి వెళ్లేసరికి అమ్మ కిందపడి అటు ఇటు కొట్టు కుంటూ ఉంది. గబగబ హాస్పిటల్కి తీసుకు వెళ్లాను. అమ్మకు పక్షవాతం వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఒక కాలు ఒక చేయి పనిచేయడం లేదు. ఒక వారం రోజుల తర్వాత డాక్టర్ ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పారు. అమ్మను ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత నా భార్య కూతురు ఇద్దరు బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు. పాపం చాలా బాధ పడుతున్నారని అనుకున్నాను. కానీ వాళ్లకు వంట చేసే వాళ్ళు లేరని అందుకు బాధ పడుతున్నారని చెప్పారు. ఆ రెండో రోజు నుంచి నేను పని మనిషి పెట్టాను. కానీ పనిమనిషి అన్ని పనులు చేయలేదని గ్రహించాను. నా భార్య , కూతురు ఇద్దరు బయటకు వెళ్లేముందు అందంగా తయారు అవ్వడానికి మా అమ్మ కొన్ని కొన్ని వస్తువులు అందిస్తూ ఉండేది. ఇప్పుడు వారిద్దరికి అందించేవాళ్ళు కూడా మనుషులను పెట్టమని ప్రతిరోజు నస పెట్టేవారు. అమ్మను చూసుకోవలసిన వీళ్లిద్దరు, వీళ్లిద్దరు చూసుకోవడానికి మరో ఇద్దరు పని మనుషులు కావలసి వచ్చింది. ప్రతి రోజు నేను ఆఫీస్ కి వెళుతున్నానే తప్ప ఆలోచనలన్నీ అమ్మ కోసమే. అమ్మకు వచ్చిన వ్యాధిని మందులతో కొంతకాలం వరకు తగ్గించినా, ఆప్యాయంగా పలకరించి మనస్ఫూర్తిగా సేవ చేస్తేనే అమ్మ త్వరగా కోలుకుంటుందని నా మనసులో నేను అనుకున్నా కొంతమంది మిత్రులు చెప్పిన ఆలోచనలు కూడా ఇదే.
నేను ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట్లాడలేని పరిస్థితి.  అమ్మకి అన్నం తినిపించి మందులు వేసి మళ్లీ పడుకోబెట్టాను. ఇంతకీ మా అమ్మ రోజూ అన్నం తిని మందులు వేసుకుంటుందా లేదా అని ఒక ఆలోచనలో ఉండిపోయాను. ప్రతిరోజు అమ్మకు అన్నం ఎవరు తినిపిస్తున్నారు? మందులు ఎవరు వేస్తారు అని చిన్న సందేహం వేసింది. ఇంతలో నా భార్య, కూతురు వీరిద్దరితో పాటు పని మనిషి కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్లారని అడిగాను. సినిమాకి వెళ్ళామని నా కూతురు సమాధానం చెప్పింది. మా అమ్మకు అన్నం తినిపించి మందులు వేస్తున్నారా అని అడిగాను. నేను మీ అమ్మగారికి ఈ సేవ చేయలేను సార్ ఇంట్లో పని మొత్తం చేస్తున్నాను అని సమాధానం చెప్పింది పనిమనిషి. నేను జీతం ఇచ్చి వేరే పని మనిషిని కూడా పనికి రావద్దని చెప్పి పంపించాను. నా భార్య సాహితీ, కూతురు ఆమని పని మనుషులు లేకపోతే మేము ఎలా బతకాలి? కనీసం మీ అమ్మకు సేవ చేసేవారైనా కావాలి కదా! దయచేసి పనిమనిషిని పెట్టించండి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చెబుతూ వచ్చారు. ఇంట్లో మీ ఇద్దరే పని చేయాలి మా అమ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని గట్టిగా చెప్పాను. నా భార్య సాహితి నేను మా ఇంట్లోనే ఇంతవరకు పనిచేయలేదు. అలాంటప్పుడు మీ అమ్మగారికి సేవ చేయడానికి ఎలా ఒప్పుకుంటానని  అనుకున్నారు. ఇంతలో నా కూతురు ఆమని కూడా చూస్తూ చూస్తూ ముసలివావళ్ళను ఎలాపట్టుకుంటారు డాడీ ! అయినా  ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తే నెలకు ఒక సారి, రెండు నెలలకోసారి పోయి చూసి రావచ్చు డాడీ దయచేసి ఇంట్లో వద్దు డాడీ ! అని చెప్పేలోపే మా ఆవిడ సాహితీ కూడా నాకు తెలిసిన వాళ్ళు , వాళ్ల పేరెంట్స్ ను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వేశారు. మనం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వేద్దాం అని చెప్పగానే నాకు ఎప్పుడూ రాని కోపం వచ్చింది. వీళ్లు ఇలా తయారవడానికి కారణం కూడా నేనే ప్రధాన వ్యక్తిని. వీరిద్దరు సినిమాలకు షికార్లకు వెళుతుంటే ఎందుకు రోజు అని ఆరోజు ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదేమో? అని మనసులోనే అనుకున్నాను. పని మనుషులు లేకపోవడం వల్ల ప్రతిరోజు వీరిద్దరు బయటకు వెళ్ళి టిఫిను, భోజనం చేసి వస్తారు. నేను మా అమ్మ గారిని వదిలిపెట్టి  ఆఫీసు కూడా వెళ్ళలేక పోతున్నాను. ఒక వారం రోజులు వరకు నేనే వంట చేసి అమ్మకు అన్నం పెట్టి, మందులు వేసేవాడిని. ఈ వారం రోజులు గమనించిన నా భార్య,  నా కూతురు మీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. ఆఫీస్ కి వెళ్ళకుండా ఇలా రోజు సేవలు చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది చిప్పకూడే (అడుక్కు తినాలి ) అని నా భార్య చెప్పగానే కోపం వచ్చింది. అందుకు నా కూతురు ఆమని కూడా ఎందుకు అలా మా వైపు కోపంగా చూస్తారు. అప్పుడు నాకు మనసులో అనిపించింది అమ్మకు పక్షవాతం వస్తే పని చేయాల్సిందల్లా పోయి ఇలా మాటలతో చంపుతారా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా అనుకోని సందర్భాలు వస్తే లోపలున్న కపట ఆలోచనలు బయటకు వస్తాయని ఊహించలేదు. ఇలా మాకే జరుగుతుందా? ఎవరికైనా జరుగుతుందా అని లోలోపల అనుకున్నాను. కానీ బయట ప్రపంచం కూడా ఇలానే ఉందని కొంతమంది మిత్రులను అడిగి తెలుసుకున్నాను. ఏదేమైనా నా భార్యకు, నా కూతురుకు మా అమ్మ గారు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. కానీ నేను ఆఫీసుకి ఎక్కువగా సెలవులు పెట్టి అమ్మగారిని డాక్టర్కు చూపించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని. కొన్ని రోజులకు మా అమ్మగారికి ఆరోగ్యం కుదుటపడింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే మా అమ్మగారు నడుస్తున్నారు,  మాట్లాడుతున్నారు. కానీ ఇది వరకు ఉన్న చలాకితనం ఇప్పుడు లేదు కొద్దిగా నీరసంగా ఉంటుంది. నేను ఆఫీసుకు వెళ్ళగానే మా అమ్మగారిని నా భార్య, నా కూతురు తిడుతూ ఉండేవారని నేను గ్రహించాను. నేను ఆఫీస్ కి వెళ్లి రాగానే ప్రతి రోజు మా అమ్మగారు నేను మన ఊరు వెళ్ళిపోతాను అని ప్రతిరోజూ చెబుతూ ఉండేది. నా భార్య మాత్రం మన ఇంట్లో మీ అమ్మ ఒంటరిగా, బాధగా ఆలోచించే కంటే మీ ఊరికి పంపించడం చాలా మంచిదని చెప్పింది. అయినా నేనేమీ పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఏడుస్తూ నేను మన ఊరికి వెళ్లి పోతాను నాన్న ! నన్ను పంపించు చెప్పగానే కనిపించే వ్యాధి కన్నా కనిపించని మనోవ్యాధి మనిషిని మరింతగా బాధింప చేస్తుందని అనుకున్నాను. ఈ లోపు నా భార్య నా కూతురు వచ్చి మీ అమ్మగారిని ఊరికి పంపిస్తారా? మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్లిపోమంటారా? అని చెప్పగానే ఇప్పుడు ఏమైంది అందరూ కలిసే కదా ఉండేది? అని నేను చెబుతుండగా మీ అమ్మగారు ఇంట్లో ఉంటే మేము క్షణం కూడా ఈ ఇంట్లో ఉండమని నా భార్య కూతురు ఇద్దరు చెప్పి వరండాలో కూర్చున్నారు. మా అమ్మగారు నాన్న నావల్ల ఇబ్బందులు వచ్చినా , రాకపోయినా తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు కష్టంగా భావించడు.  కుటుంబం అంటే మొదట భార్య, పిల్లలు తర్వాతే ఎవరైనా!  నీవు కోడలు సాహితీని, మనవరాలు ఆమని వాళ్ళు మనసులను కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో నన్ను మాత్రం మన ఊరికి పంపించు ఇప్పుడే అని బట్టలు సర్దుకుని వచ్చింది మా అమ్మగారు.
నేను మా అమ్మగారిని తీసుకుని మా ఊరికి వెళ్ళాను. మా ఇల్లు పాతబడి కూలిపోయింది. తెలిసిన వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంచి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. కానీ నా భార్య సాహితీ, నా కూతురు ఆమని ముఖాల్లో ఏదో చెప్పలేని ఆనందం హావా భావాలు కనిపించాయి. కానీ ఇంట్లో వంట చేసి చాలారోజులైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరు బయట తిని ఇంటికి పడుకోవడానికి మాత్రమే వస్తారు. నేను కూడా ఆఫీస్ క్యాంటీన్ అలవాటు చేసుకున్నాను. మాఇంట్లోనే వీరిద్దరికి భారంగా ఉన్న మాఅమ్మ అక్కడ వాళ్లకు మాత్రం భారంగా ఉంటుందేమోనని రోజు భయపడుతూ ఉండేవాడిని. ఆఫీసు పని మీద ఒక నెల రోజుల పాటు వేరే ఊరు వెళ్ళాడానికి ఫ్లైట్ టికెట్ లు బుక్ చేసుకున్నాను. ఈ టిక్కెట్లు నా భార్య సాహితీకి, నా కూతురు ఆమని చూపించాను. వీళ్లిద్దరు మీరు ఎక్కడికైనా వెళ్లండి కానీ మాకు నెలకు అయ్యే ఖర్చులు రెండింతలు ఇచ్చి వెళ్లండని చెప్పారు. ఈ కావలసినవి ఇప్పుడే తీసుకోండి అనగానే రెండు ఏటీఎం కార్డులు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు. నేను వాళ్లకు ఫ్లైట్ టికెట్ లు వేరే దేశం వెళ్తున్నానని చూపించాను కానీ నేను మా ఊరికి బయలుదేరాను. ఎందుకంటే అక్కడ మా అమ్మగారికి ఎలా ఉందో అని రోజూ భయపడుతున్నాను. నేను మా ఊరికి కి రానే వచ్చాను. అంతగా భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే  పల్లెటూర్లో కొంతైనా ప్రేమ బ్రతికే ఉంది. నా భార్య నా కూతురు పెట్టిన హంస కంటే పల్లెల్లో స్వేచ్ఛగా బతకడం చాలా సులభం. ఎంతోకొంత అయినా పల్లెల్లోనే మానవత్వం ఉందని ఇక్కడ చూసి తెలుసుకున్నాను.
మా ఊరిలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న చల్లటి వాతావరణం. అందుకేనేమో పెద్దలు సిటీ కి రారు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేరు. మా పాత పడ్డ ఇల్లును పడగొట్టి  జమ్ము గడ్డితో చిన్నఇల్లు కట్టించాను. ఆ జమ్ము గడ్డి ఇల్లు  ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక్కడ అమ్మను చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఇద్దరినీ మాత్రం చూసుకోమని వాళ్లకి  నెల జీతంగా ఇస్తానన్నా వాళ్ల మనసు అంగీకరించలేదు. ఎలాగో మా పొలం కౌలుగా చేస్తున్నారు కాబట్టి ఎంతోకొంత ఆ సమయంలో ఇస్తే సరిపోతుందని అనుకున్నాను. నేను హైదరాబాదు నుండి ఊరికి వచ్చేటప్పుడు ఏటీఎం కార్డులు, చెక్కులు బ్లాక్ చేశాను. ఇంట్లో పది వేల రూపాయలు మాత్రమే  ఉంచాను. వేరే దేశం వెళుతున్నాను అక్కడ ఫోను కలవక పోవచ్చు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చాను. ఎందుకు అలా చేశాను అంటే ఇద్దరికీ తినడానికి పదివేల రూపాయలు ఒక నెల రోజులు సరిపోతుందని భావించాను. పేదవాడి కుటుంబానికి అయితే ఈ పదివేల రూపాయలు నెలరోజులకి చాలా ఎక్కువ. మా అమ్మగారు నేను  ఊరిలో నెలరోజులు ఉన్నంతవరకు నా భార్య సాహితీ , నా కూతురు ఆమని గురించి  పదే పదే ఆలోచించింది. నన్ను అక్కడికి వెళ్లిమని చాలా సార్లు చెప్పింది.
నేను హైదరాబాదు తిరిగి వెళ్ళగానే నా భార్య నా కూతురు కోపంగా చూసారు కానీ ఏమీ అనలేదు. ఆమని నా దగ్గరకు వచ్చి డాడీ మీరు మమ్మల్ని మోసం చేశారా? లేక బుద్ధి చెప్పారో తెలియదు కానీ మేము షాపింగ్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు చూపిస్తే డబ్బులు లేవని తెలిసింది. అక్కడ మాకు పరువు పోయిందని గ్రహించాము. తిట్టుకుంటూ ఇంటికి వచ్చి కనీసం తినడానికే డబ్బులు ఉన్నాయో లేవో అని అక్కడక్కడ వెతకగా పదివేల రూపాయలు కనిపించాయి తినడానికి సరిపోతాయి అనుకున్నాము. బయట భోజనం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు వచ్చాయి మూడు రోజులు పస్తులు ఉన్నామని చెప్పింది. నేను లోలోపల బాధపడ్డా అమ్మకి జరిగిన భోజనం విషయంలో అంత బాధ అనిపించలేదు. వీరిద్దరు పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నారే తప్ప  లోపల నామీద కోపం అలానే ఉంది. ముందున్న అహం మాత్రం ఇప్పుడు లేదని నేను గ్రహించాను.
రెండు నెలల తర్వాత మా ఊరి నుంచి ఫోన్ వచ్చింది మా అమ్మగారు చనిపోయారని. మన ఊరు వెళ్దామని నా భార్య సాహితికి, నా కూతురు ఆమనికి చెప్పాను. కానీ ఇద్దరూ రానని చెప్పారు. వీళ్లు మారరు అని మనసులో అనుకున్నాను. ఈ ఒక్కసారికి నాకోసం రమ్మని ప్రాధేయపడ్డాను. ఊరికి వచ్చిన తర్వాత , ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఊరిలో ఎవరూ పనికి పోలేదు. అందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. నేను కొన్ని రోజులు ఉందామని చెప్పాను. అందుకు కు నా భార్య, కూతురు ఇద్దరు ఊరిలో ఉండడానికి ఒప్పుకోలేదు వెళ్ళిపోదామని చెప్పారు. ఇంతలో మా ఊరిలో ఉన్న లాయరు భీమరాజు గారు వచ్చి  సాహితీ , ఆమని అంటే మీరేనా అని అడిగారు. అవునని నా భార్య కూతురు ఇద్దరు సమాధానం చెప్పారు. లాయర్ గారు వచ్చి  దస్తావేజులు ఇక్కడ సంతకాలు పెట్టండని చెప్పారు. ఎందుకని అడిగేలోపే మీ అత్త అన్నపూర్ణమ్మ గారు సాహితీ అనే పేరు మీద పది ఎకరాలు పొలం, ఆమని పేరు మీద పది ఎకరాల పొలం రాసి ఇచ్చారని లాయర్ గారు చెప్పారు. కొడుకు పేరు మీద రాయకుండా మాకు ఎందుకు ఇచ్చారని వారు అడగ్గా ! అందుకు లాయర్ గారు నా కొడుకు ఎలాగైనా బ్రతుకగలడు. మా అబ్బాయి లేకపోతే మీరు బ్రతకలేరు అని కాదు. మీకు ఏదో ఒక సమయంలో ఆధారం అవుతుందని ఉద్దేశంతోనే మీకు రాస్తున్నానని అన్నపూర్ణ గారు నాతో చెప్పారని లాయర్ గారు బదులిచ్చారు. అప్పుడు నా భార్య సాహితి, కూతురు ఆమని బోరున విలపించారు. వాళ్లు చేసిన తప్పులకు క్షమించమని నా కాళ్లు పట్టుకుని ఏడ్చారు. నా పేరు సాహిత్య ప్రకాష్

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534



No comments:

Post a Comment