Wednesday, July 24, 2019

కందుకూరి వీరేశలింగం సాంఘిక సంస్కరణలు - చారిత్రక నేపథ్యం

కందుకూరి వీరేశలింగం సాంఘిక సంస్కరణలు - చారిత్రక నేపథ్యం

కందుకూరి వీరేశలింగం ( 1848 - 1919 ) వంటి సంఘసంస్కర్తల సేవలకు నోచుకోవడం ఆంధ్రదేశం అదృష్టంగా భావించాలి. 19వ శతాబ్ది మధ్య కల్లా తన నిర్విరామ కృషివల్ల ఆంధ్ర ప్రజలలో విశాల భావాలను నెలకొల్పగల్గాడు.  చివరిదశలో ఆంధ్రదేశంలోనే మూఢాచారాలకు, సనాతన చాందస భావాలకు తావు లేకుండా పోయింది. కాలానుగుణమైన మార్పుల్ని గమనించి కొత్త భావాల్ని స్వీకరించేందుకు ఆంధ్రదేశం సమాయత్తమైంది. ఇదేకాక వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలు సామాన్య ప్రజలలో సైతం నవ చైతన్యం కలిగించాయి. ఇటువంటి సానుకూల పరిస్థితులను వినియోగించుకుని ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని చేసేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అందుకేనేమో ఆంధ్రులు కందుకూరి వీరేశలింగం గారిని గొప్ప సాంఘిక సంస్కర్తగా గుర్తించారు.
కందుకూరి వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు తండ్రి సుబ్బారాయుడు తల్లి పూర్ణమ్మ. తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం వల్ల తల్లి కొడుకును విద్యావంతుణ్ణి చేయాలనే పట్టుదలతో అతనిని ప్రభుత్వ జిల్లా పాఠశాలకు పంపింది. 1869లో వీరేశలింగం మెట్రిక్యులేషన్ పరీక్ష పాస్ అయ్యాడు. కోరంగిలో ఉపాధ్యాయుడుగాను, రాజమండ్రిలో సీనియర్ తెలుగు పండితుడుగాను వీరేశలింగం పనిచేశాడు.
వీరేశలింగం రచన సాహిత్యంలో తనదైన పద్ధతి అంటే పూర్తిగా సమాజానికి ఉపయోగపడే విధంగా తన రచనలను ముందుకు తీసుకు వచ్చాడు. తెలుగులో మొట్టమొదటి నవలయైన “ రాజశేఖర చరిత్ర “  గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో రచించిన వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే నవల ఆధారంగా రచించబడినది. రాజశేఖర చరిత్ర అ కన్నడ అ ఆంగ్లభాషలోకి అనువదించబడింది. లండన్ నుండి వెలువడే ది టైమ్స్ అనే పత్రికలో ఈ నవలను గూర్చి సమీక్షించడం జరిగింది. ఆంగ్లంలో వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ తెలుగులో రాజశేఖర్ చరిత్ర  ఇందులో కొన్ని కొన్ని పాత్రలు సంఘటనలు మొత్తం రెండు ఒకేలా ఉన్నా అందులోనే పేర్లు ( పాత్రలు ) మాత్రం కొన్ని కొన్ని సన్నివేశాలు మార్పు చేసి  వీరేశలింగం రచించడం జరిగింది. ఇది పూర్తిగా అనువాద రచన మాత్రమే కానీ తెలుగు వచ్చే సరికి కొంత మంది కవులు కొంతమంది సమర్థిస్తూ మరికొంతమంది విమర్శిస్తూ వచ్చారు.
మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడిగా పనిచేసిన పరవస్తు చిన్నయ సూరి ( 1806 - 1862 ) రచించిన “ నీతి చంద్రిక “ తెలుగు వచన సాహిత్యం లోని మొదటి ఉత్తమ రచన పేర్కొనవచ్చు.  సంస్కృత పంచతంత్రంలోని మిత్రభేదం, మిత్రలాభం అను మొదటి రెండు భాగాలు అనువాదమే నీతి చంద్రిక రచన. రచనా శైలి కృత్రిమంగాను, ఆడంబరముగాను సాగింది. వీరేశలింగం సంస్కృత పంచతంత్రంలోని మూడవ భాగమైన విగ్రహ తంత్రాన్ని అనువదించేందుకు పై శైలిని అనుకరించాడు. అయితే విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టం అని భావించిన వీరేశలింగం ఈ కృత్రిమ శైలిని వదిలి పెట్టాడు. అందువల్లనే పంతులుగారు సంధి తంత్రాన్ని ( పంచతంత్రంలో నాలుగవ భాగం ) సులభ వచనంలో వ్రాశారు. రాజశేఖర చరిత్ర అనే నవలను రచించి తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా నవలా రచనకు శ్రీకారం చుట్టాడు. జీవ శాస్త్రాలలోను, చరిత్రలోనూ మొదటి తెలుగు పుస్తకాలను ఆయనే రచించాడు. సత్యరాజా పూర్వ దేశయాత్రలు అనువాద రచన, సత్యవతీ చరిత్రము, ఈ రెండు నవలలు గాను; ,మార్కండేయ శతకం, శ్రీరాజమహేంద్ర పురవర గోపాల శతకం, మరియు రసికజన రంజనం మొదలగునవి పద్య కావ్యాలు. వ్యవహార ధర్మబోధిని , కాళిదాసు శాకుంతలం, రత్నావళి, దక్షిణ గోగ్రహణం, సత్య హరిశ్చంద్ర, మాళవికాగ్నిమిత్రము మొదలగునవి నాటకాలు. నీతి కథా మంజరి అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు. స్త్రీల కోసం ప్రత్యేకంగా వచన కవిత్వాలు రాసేవారు. సతీహితబోధిని , హాస్య వర్ధని వంటి మహిళా పత్రికల్ని స్థాపించడంలో కూడా వీరేశలింగం పంతులు మొదటి వారు అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య విమర్శ గ్రంథాల్ని రాయడంలోనూ, కవుల చరిత్రను రాయడంలోనూ పంతులుగారు మొదటి వారని చెప్పవచ్చు. వీరేశలింగం రచనలు తెలుగు సాహిత్యంలోని అన్ని రకాల ప్రక్రియలకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మొదటగా నిలిచిన వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
సాంఘిక సంస్కరణలు : స్త్రీ విద్య : 1870వ దశకంలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న ' ఆంధ్ర భాషా సంజీవని ', ‘ పురుషార్ధ ప్రదాయిని ' అను పత్రికల్లో స్త్రీ విద్యను గూర్చి వివాదం చెలరేగింది. ఆంధ్ర భాషా సంజీవని పత్రికకు మహా మహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులు సంపాదకుడిగా ఉండేవారు. ఈయన సాంప్రదాయవాది. పురుషార్ధ ప్రదాయిని పత్రికను మచిలీపట్టణం వాసియైన ఉమారంగ నాయకులు నాయుడు గారు నడిపేవారు. 1871లో ప్రారంభించబడ్డ ఆంధ్ర భాషా సంజీవని పత్రిక గ్రాంధిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషావాదాన్ని విమర్శించేది. ఈ నేపథ్యంలోనే వీరేశలింగం పంతులు స్త్రీ విద్యను సమర్థిస్తూ పై వివాదంలో భాగ స్వామి అయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు వివేకవర్ధిని అనే పత్రికను 1874లో రాజమండ్రిలో ప్రారంభించాడు. స్త్రీ విద్యను వ్యతిరేకించేవారిని అపహాస్యం చేస్తూ కవిత్వాన్ని చెప్పడమే కాక నాటికలు కూడా రచించాడు. ఇతని రచనయైన ' బ్రహ్మ వివాహం ' బాల్య వివాహాల్ని కన్యాశుల్కాన్ని తీవ్రంగా నిరసించింది. తన ఆశయాన్ని ఆచరణలో పెట్టేందుకు కందుకూరి 1874 సెప్టెంబర్ నెలలో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆంధ్రదేశంలోనే మొదటి బాలికల పాఠశాల కూడా ఇదే కావడం విశేషం. మల్లాది అచ్చన్న శాస్త్రి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. 1881లో రాజమండ్రి లోని ఇన్నీస్ ( ఇంగ్లీష్ ) పేటలో మరో బాలికల పాఠశాలను వీరేశలింగం స్థాపించాడు. సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో తనకు చేదోడువాదోడుగా ఉంటుందని తన భార్య రాజ్యలక్ష్మికి కూడా చదువు నేర్పించారు. బాలికల పాఠశాలలేకాక హరిజన పాఠశాలలు, శ్రామికులకై రాత్రి పాఠశాలల్ని స్థాపించింది కూడా వీరేశలింగంగారే. ఆంధ్రదేశంలో సహవిద్యను మొదట ప్రోత్సహించింది కూడా పంతులుగారే.
వితంతు పునర్వివాహాలు : 1874లో మద్రాసులో వితంతు పునర్వివాహాల సంఘాన్ని ప్రారంభించారు. దివాన్ బహదూర్ ఆర్ రంగనాథరావు, పి చంచల్రావు వంటి మద్రాసు నగర ప్రముఖులు సభ్యులుగ ఉండేవారు. కానీ ప్రారంభించిన రెండేళ్లకే ఈ సంఘం కనుమరుగైంది. 1875లో విశాఖపట్నం వాసియైన మహా మహోపాధ్యాయ పరవస్తు వెంకట రంగాచార్యులు వితంతు వివాహాన్ని సమర్థిస్తూ ‘ పునర్వివాహ సంగ్రహం ' అనే గ్రంథాన్ని రచించాడు. దీనిని చూసిన కొక్కొండ వెంకటరత్నం పంతులుకు కంపఠం పుట్టింది. రంగాచార్యులకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. వీరేశలింగంతో సంబంధాలు లేనప్పటికీ ఆయన సహాయాన్ని అర్థించాడు. కానీ వీరేశలింగం హృదయం వితంతువుల పైనే ఉంది. అయినప్పటికీ వితంతు వివాహం గూర్చి వాదోపవాదాలు తోనే సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆశయాల్ని ఆచరణలోకి తేవాలని ఆయన ఆరాటం. అందుకే ఎవరు పక్షమూ వహించకుండా కొంతకాలం గడిపాడు. 1875 కల్లా వీరేశలింగం పంతులు బ్రిటీషు ఉన్నతాధికారులతోను, మద్రాసు నగర ప్రముఖులతోనూ మద్రాసు రాష్ట్ర ఇతర పట్టణాల్లోని ప్రముఖులతోనూ సంబంధ బాంధవ్యాలని పెంచుకున్నాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధాన అధికారి ఈ.పి మెట్కాఫ్ వీరేశలింగం చేపట్టే కార్యక్రమాలలో ఉత్సాహం చూపించడమే కాక పంతులుగారి వివేకవర్థిని పత్రికకు చందాదారుడయ్యాడు. పంతులుగారి కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహం ఇచ్చాడు 1878 సెప్టెంబర్ నెలలో రాజమండ్రిలో ' సంఘ సంస్కరణ సమాజం ‘ స్థాపించబడింది.
1879 ఆగస్టు 3న మహారాజా బాలికల పాఠశాలలో వితంతు వివాహం పై మొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఉపన్యాసం ఆంధ్ర దేశమంతా సంచలనం సృష్టించింది.  ఇక్కడే అక్టోబర్ 12న మరో ఉపన్యాసం ఇచ్చాడు. దీంతో సాంప్రదాయవాదులలో కలవరం పుట్టింది. వీరేశలింగం వాదనల్ని ఎదుర్కోవడానికి రాజమండ్రి, కాకినాడ లో పోటీకి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ వితంతు వివాహం శాస్త్ర సమ్మతం కాదని నిరూపించలేకపోయారు. దీంతో వీరికి ఆవేశం ఎక్కువైంది. వీరేశలింగంను కొట్టించడానికి రౌడీలను ఉపయోగించారు. అయితే వీరేశలింగం శిష్య బృందం ఉక్కు కవచంలా ఆయన్ని కాపాడింది. 1880లో తన స్నేహితులైన చల్లపల్లి బాపయ్య, బసవరాజు, గవర్రాజుల సహకారంతో వితంతు పునర్వివాహం సంఘాన్ని పంతులుగారు స్థాపించారు. తనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని, వీరేశలింగం తన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఉపక్రమించాడు. వితంతువుల్ని వివాహం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. తన శిష్య బృందాన్ని మారుమూల ప్రాంతాలకు పంపి వీరికోసం వెతికించాడు. కానీ వితంతువుల తల్లిదండ్రుల్ని ఒప్పించడం చాలా కష్టసాధ్యమైంది. చివరకు ఒక వితంతువు తల్లి తన కుమార్తెకు వివాహం చేయడానికి ఉత్సాహం చూపింది. వెంటనే తన శిష్యుల్ని ఆ వితంతువు నివసించే పల్లెకు పంపి అతి కష్టం మీద ఆమెను రాజమండ్రికి తీసుకువచ్చారు. ఈ వితంతువు పేరు సీతమ్మ. 1881 డిసెంబరు 11న రాజమండ్రిలో గోగుల పాటి శ్రీరాములతో సీతమ్మ వివాహం జరిగింది. ఈ విధంగా ఆంధ్రదేశంలో లో మొదటి వితంతు వివాహం అగ్రకులంలోనే జరిపించడం విశేషం. ఈ పెళ్లి కూడా సవ్యమైన వాతావరణంలో జరగలేదు. రాజమండ్రిలోనే సాంప్రదాయ వాదులు ఈ పెళ్లిని చెడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పంతులుతో పాటు ఆయన శిష్య బృందం కూడా ఏ పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వివాహం జరిగే ప్రాంతం చుట్టుపక్కల పోలీసు బందోబస్తు చేయబడింది. తమ ప్రయత్నంలో విఫలులైన సాంప్రదాయ వాదులు పెళ్లిలో పాల్గొన్న 31 కుటుంబాల్ని కులం నుండి వెలివేశారు.
ఈ మొదటి వితంతు వివాహం జరిగిన నాలుగు రోజులకే ( డిసెంబర్ 15న ) రెండో వితంతు వివాహం జరిపించాడు వీరేశలింగం. రత్నమ్మ అనే వితంతువు రాచర్ల రామచంద్రయ్య వివాహం చేసుకున్నాడు. 1892 నాటికి 20 వితంతు వివాహాల్ని జరిపించాడు. వీరేశలింగం కార్యకలాపాలంన్నింటిలోనూ ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి కాకినాడ వ్యాపారవేత్త పైడి రామకృష్ణయ్య. వివిధ సందర్భాలలో లో మొత్తం 30 వేల రూపాయలు ఇచ్చి వీరేశలింగాన్ని ప్రోత్సహించాడు. పెళ్ళికాని వితంతువులకు, తల్లిదండ్రులచే విడవబడ్డ వితంతువులకు మద్రాసులోనూ ( 1897 ), రాజమండ్రిలోను (1905 ) వితంతు శరణాలయాల్ని కట్టించాడు. 1883లో స్త్రీలకు ప్రత్యేకంగా సతి హిత బోధిని అను మాసపత్రికను ప్రారంభించాడు.
బ్రిటన్ దేశస్తురాలు మానింగ్ అనే యువతి వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయానికి 50 పౌండ్లు చెందేటట్లు తన వీలునామాలో రాసి పెట్టింది. వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రభుత్వం 1893లో రావు బహదూర్ బిరుదు ప్రధానం చేసింది. 1898లో మద్రాసులో జరిగిన భారత సంఘసంస్కరణ సభకు అధ్యక్షత వహించి దేశంలోనే అత్యున్నతమైన గౌరవాన్ని పొందాడు. ఈ సభలోనే మహాదేవ గోవింద రనడే వీరేశలింగాన్ని దక్షిణ దేశ ఈశ్వరచంద్ర  విద్యాసాగరుడు గా అభివర్ణించాడు. 1899లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో మొదట తెలుగు పండితుడిగా వీరేశలింగం నియమింపబడ్డాడు. 1904లో ఉద్యోగ విరమణ చేసి తిరిగి రాజమండ్రికి వెళ్ళాడు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వితంతు శరణాలయాల్ని, అనాథశరణాలయాల్ని స్థాపిస్తూ తన కార్యక్రమాలను కొనసాగించారు. 1905 డిసెంబర్ 15న తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణకై ‘ హితకారిణి సమాజం ' అను కేంద్ర సంస్థను స్థాపించాడు. 1908 మే 2న హితకారిణీ సమాజాన్ని రిజిస్టర్ చేయించి దాదాపు 50 వేల రూపాయల విలువగల తన యావదాస్తిని సమాజానికి దత్తం చేశాడు.
వీరేశలింగం దేవదాసి పద్ధతిపై అవినీతిపరులైన ఉద్యోగులపై ధ్వజమెత్తాడు. సంఘంలోనే ఉన్నత వర్గాల వారు వేశ్యలను ఉంచుకోవడం గౌరవంగా భావించేవారు. వీరి ఇళ్లల్లోనే అధికార అనధికార నిర్ణయాలు కూడా జరిగేవి. అధికారుల నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేందుకు కొంతమంది ఈ దేవదాసిల్ని సాధనంగా వాడుకునేవారు. వివాహ సందర్భాల్లో దేవదాసీల చేత నాట్యం చేయించేవారు వీరేశలింగం ఈ దేవదాసీ పద్ధతిని నైతిక విలువల్ని దిగజార్చేదిగా ఉందని భావించి తీవ్రంగా వ్యతిరేకించాడు. రాజమండ్రిలోనే అవినీతి పరులైన అధికారుల గుట్టు బట్ట బయలు చేసి అధికార యంత్రాంగంలో భయోత్పాతాన్ని సృష్టించాడు వీరేశలింగం. ఈయన బయటపెట్టిన అవినీతికి భయపడి ఒక జిల్లా మున్సిఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రదేశంలో ప్రజా చైతన్యం ప్రారంభమైన సమయంలో కందుకూరి వీరేశలింగం కొన్ని కొన్ని ప్రాంతాలను సందర్శించి తాను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించి సమాజంలో జరిగే సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో కృష్ణాజిల్లా బందరులో గ్రహించారు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో లో ఆంధ్రులు ఆలోచనలలో కొత్త భావాలు మొలకెత్తాయి. 1857లో మద్రాసు విశ్వ విద్యాలయం స్థాపించడంతో ఆంధ్ర దేశంలో ఉన్నత విద్య అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. 1843లో పాశ్చాత్య విద్యా బోధనకు నోబెల్ నాయకత్వంలో లో చర్చి మిషనరీ సొసైటీ ( నోబుల్ కళాశాల ఇప్పటి సంస్థ ) మచిలీపట్నంలో ఒక పాఠశాలను స్థాపించింది. 1864లో ఈ పాఠశాల ఒక కళాశాల స్థాయికి ఎదిగింది. 1873లో మద్రాసు ప్రభుత్వం రాజమండ్రిలో ఒక సెకండరీ గ్రేడ్ కళాశాలను స్థాపించింది. 1877లో ఈ కళాశాలలోనే డిగ్రీ కళాశాలగా మార్చారు. 1878లో విశాఖపట్నంలో హిందూ కళాశాల  ( ఈనాటి ఏ. వి.ఎన్ కళాశాల ) స్థాపించబడింది. 1879లో బరంపురంలో కళ్ళికోట కళాశాలను స్థాపించారు. ఆంధ్రదేశంలో జరిగిన ఆంగ్ల విద్యావ్యాప్తి వల్ల ముఖ్యంగా సర్కారు జిల్లాల్లో పాశ్చాత్యుల స్వేచ్ఛ భావాల్ని అలవర్చుకున్న ఒక కొత్త విద్యావంతుల వర్గం ఏర్పడింది. వీరు సనాతన సాంప్రదాయలతో కూడిఉన్న ఆనాటి హిందూ సమాజంలో ఇమడలేకపోయారు. అందువల్ల ఆనాటి అధికార వర్గాన్ని అసంబద్ధమైన మతాచారాల్ని విమర్శించకుండా ఉండలేకపోయారు. దీంతో వీరు ఆనాడు తలెత్తిన రాజకీయ సాంఘిక ఉద్యమాలకు మూల పురుషులు అయ్యారు. కందుకూరి వీరేశలింగం గారు పైన తెలియజేసిన కళాశాల లన్నిటిలోనూ నెల రోజుల పాటు ఒక్కొక్క కళాశాలలో పునశ్చరణ తరగతులకు హాజరు అయ్యారు. సంఘంలో జరిగే అరాచకాలపై తిరుగుబాటు తత్వాన్ని బందరులోనే చవిచూశారు.
1910 ఆగస్టు 11వ తేదీన వీరేశలింగం తన జీవిత భాగస్వామియైన రాజ్యలక్ష్మిని కోల్పోయాడు. భార్య చనిపోవడం వల్ల వీరేశలింగం పంతులు మానసికంగా కృంగిపోయారు. అందుకు ముందే ( 1909లో ) తన ఆప్తమిత్రుడైన దేశిరాజు పెద బాపయ్య మరణించాడు. ఇటువంటి సమయంలో వీరేశలింగంపై ఆయన శత్రువులు లేనిపోని అపనిందలు వేశారు. దీంతోపాటు ఆయనపై పరువు నష్టం దావాలు కూడా వేశారు. అయితే వీటన్నింటి నుండి వీరేశలింగం విజయవంతంగా బయటపడ్డాడు. కానీ జీవితం పట్ల తనకు ఇది వరకు ఉన్న ఆసక్తిని కోల్పోయాడు 1919 మే 27న మద్రాసులో తన అంతిమ శ్వాస విడిచాడు.
కందుకూరి వీరేశలింగం పంతులు గారిని గూర్చి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
వీరేశలింగం పంతులు మధ్యయుగపు మత్తు నుండి ఆంధ్రుల్ని కదిలించాడు. వారి మూర్ఖత్వం పై కొరడా ఝళిపించారు. ఆంధ్ర విశ్వాసాల నుండి వారికి ముక్తిని ప్రసాదించాడు. వారి జీవితాలకు, ఆలోచనలకు ఆధునికమైన అభ్యుదయకరమైన మానవత్వపు విలువలు గల ఒక మలుపును చూపగల్గారు – “ వి ఆర్ నార్ల “
వీరేశలింగం పంతులు వారిలో చైతన్యాన్ని కలిగించినట్లయితే ఆంధ్ర దేశము , ఆంధ్ర ప్రజలు , ఈనాడు ఉన్న స్థితిలో ఉండేవారు కారు. సూక్ష్మబుద్ధి, ఎనలేని ధైర్యం, బహుముఖ ప్రజ్ఞ కలిగిన ప్రముఖులైన భారతీయుల్లో వీరేశలింగం ఒకరు. అసత్యం పై యుద్ధాన్ని ప్రకటించి సమాజ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు – “ రాజాజీ “
సమాజంలో తీవ్రమైన మార్పులు రావాలని కోరి అందుకోసమే నిర్విరామంగా కృషి చేసిన వీరేశలింగం పంతుల్ని దక్షిణ భారతంలోని మొదటి సంఘసంస్కర్తల్లో ఒకరుగా భావించవచ్చు. అయితే ఆనాడు అందరూ సంస్కర్తలు లాగానే పంతులు గారు కూడా అపార్ధాలకు వేధింపులకు గురయ్యారు. సాంఘిక పునరుజ్జీవనం కోసం ఎన్నో అవహేళనల్ని, అపాయాల్ని తట్టుకొని కృషిసల్పిన పంతులు గారి ఆదర్శానికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము.  – “ సర్వేపల్లి రాధాకృష్ణన్ “
ఆధునికాంధ్ర లోకంలో వీరేశలింగం పంతులు చాలా గొప్ప వ్యక్తి. వీరేశలింగం తన జీవిత చరిత్రలో యుగ వికాసాన్ని గూర్చి ఇలా వివరిస్తాడు. చాలామంది ప్రజలు తాము నివసిస్తున్న యుగపు వెలుగుల్ని ప్రసరింపజేయకనే తమ జీవితాన్ని కొనసాగిస్తారు. వారు వెలుగును ప్రసాదించనూ లేరు, గ్రహించనూలేరు. ఎవడైతే వెలుగును పట్టుకుని నవ చైతన్యాన్ని సృష్టించి సమాజంలో మార్పుకు అభివృద్ధికి కారకుడవుతాడో అతనే నిజమైన నాయకుడు. సమాజంలో మార్పు అభివృద్ధి జరగకపోతే మనిషి జీవితంలో జడత్వము, ఆందోళన చోటు చేసుకుంటాయి. నవ సమాజం నిర్మాతల్లో ఒకడు కావడంచేత వీరేశలింగం ఆధునిక యుగానికి అద్దం పట్టాడని చెప్పవచ్చు. పంతుల్ని సృష్టికర్త అన్నారంటే దీనికి కారణం ఆయన కూడా సృష్టిలో ఒక ప్రాణి కావడంవల్లే. ఎవరైతే తాము నివసించే కాలతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారో వారికే సృష్టి చేసే శక్తి కూడా ఉంటుంది. – “ కట్టమంచి రామలింగారెడ్డి “

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033543





ప్రశ్నించే తత్వం - బ్లాక్ వాయిస్

తంగిరాల సోని – బ్లాక్ వాయిస్
నేను చాలా పుస్తకాలు చదివిను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ చాలా చాలా బాగుంది ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వందార్థాలు మరియు పర్యాయపదాలు గానో నానార్ధాలు గానో అర్థం చేసుకోవలసి వస్తుంది కానీ ఈ కవిత్వం ఇప్పుడున్న వాడుక భాషలో చెప్పాలంటే చదువురాని వారికే త్వరగా అర్థమవుతుందని చెప్పవచ్చు. దీనిని మోటు కవిత్వం అని కూడా అనవచ్చు. ఇప్పటి కవులు చాలా కవిత్వాలలో తనదైన భాష, శైలి, అర్థం తమకు అనుగుణంగా రాసుకుంటున్నారే తప్ప ఇతరులకు త్వరగా అర్థమయ్యే రీతిలో ఎవరూ రాయడం లేదునిపిస్తుంది. బ్లాక్ వాయిస్ కవిత్వం అలా కాదు ఎవరు చదివినా సరాసరి ఆకట్టుకున్న శైలిలోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కవిత్వం చదువుతున్నంత సేపూ ఈ పదాలు మనం రోజు మాట్లాడుకునే మాటలే కదా అనుకున్న ఆ పదాలు రాయడానికి ఒక్కసారిగా ఎవరికి ఆలోచన తట్టదు. ఒక్క తంగిరాల సోని గారికి తప్ప. ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం సరదా కోసమో, పుస్తకాలు ముద్రించుకోవడం కోసమో, అవార్డుల కోసమో - పురస్కారాల కోసమో కాదు . దేశంలో జరిగే అరాచకాలపై అందులో దళితులపై జరిగే దాడులపై తంగిరాల సోనీ తమ కవిత్వాన్ని తిరుగుబాటు తత్వం ఉండేలా ఒక సంకేతాన్ని బ్లాక్ వాయిస్ రూపంలో ఎగర వేసాడు. దళితులపై ఎక్కడైనా దాడులు జరిగినా వెంటనే స్పందించి ఆ సంఘటనకు వెళ్లడం వెంటనే కవిత్వరూపంలో సోషల్ మీడియాలో పంపడం జరుగుతుంది కానీ, ఎక్కడైనా ఏసంఘటనలు జరిగినా మనకు ఎందుకులే అనేవాళ్లే చాలా మంది ఎక్కువ. కానీ సోనీ మాత్రం తన వాయిస్ ని వినిపిస్తాడు. అతనిలో గొప్ప విషయం ఏమిటంటే వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్లకు ధైర్యం చెప్పే వ్యక్తి.  అందులో స్త్రీలపై జరిగే అన్యాయాలపై ఎక్కువగా స్పందించి తన బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా ప్రశ్నించే తీరు, ఎదుర్కొనే తీరు, తిరుగుబాటుచేసే తీరు,  సరికొత్త గొంతుతో వినిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా అర్థమవుతుంది.
తల్లిదండ్రులు భారంగా భావించే పిల్లలు ప్రస్తుత రోజుల్లో చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం . వయసుమళ్ళిన తల్లిదండ్రులను ప్రేమగా జీవితాన్ని కొనసాగించడానికి తమ పిల్లలు ముందుకు రాక పోవడానికి కారణం ప్రేమ నశించడమే. తల్లి పనిచేసే శక్తి ఉంటే అన్ని పనులు చేయించుకుని ఒక ముద్ద భోజనం పెట్టి తన పనేదో తనను చూసుకోమనేవారు ఒకప్పుడు ఉన్న ఇప్పుడు కనుమరుగవుతున్నారు. తల్లి తన బిడ్డలను ఎలా చూసుకునేదో అమ్మ ఒంటరి కవిత్వం ద్వారా మనకు చక్కని సందేశం ఇస్తున్నారు సోనీ. సమాజంలో ఆడపిల్లల పుడుతుంటే సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఇందులో ఆడపిల్ల నేను పుట్టగానే నన్ను భారంగా చూడలేదు కానీ  నేను పుట్టిన తర్వాత నాన్నచనిపోయాడని నన్ను అవమాన పరిచారు మా ఊరి ప్రజలు. అమ్మ ఎంత బాధ పడిందో నాకు తెలుసు నా చిన్నప్పుడు పందిరి గుంజకు ముతక చీర ఊయలగా కట్టి దానిలో పడుకోబెట్టి పరిగేరుకోవడానికి పొలం పోయేది. వస్తూ వస్తూ పరిగి గింజల్ని కోమట్ల కొట్టంలో వేసి చీరలో సోలెడు బియ్యం, రెండు ఉల్లిపాయలు, రెండు మిరపకాయలు, తీసుకుని గబగబా వస్తూ తలకు కట్టిన గుడను బిగదీసుకుంటూ వస్తుంటే వాడ మలుపు లోనే నా ఏడుపు గొంతు వినిపించి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే పక్కన ఉన్నవాళ్లు మీ పిల్ల దయ్యం పిల్ల ఆ గొంతుచూడు ఎలాఉందో ఊరు మొత్తం వినిపిస్తుంది ఆమెకు లేనిపోని చాడీలు చెబుతుండేవాళ్ళు. తల్లి తన బిడ్డను కళ్ళు తుడుస్తూ, తల నిమురుతూ, చీముడు తుడుస్తూ అలా ఆలోచించే అమ్మ అబిడ్డ ఎదిగేకొద్దీ అమ్మ అలా తగ్గుతూ ఉండేది అమ్మను వాటేసుకుని పడుకుంటే అమ్మ పేగులో సముద్రాల అలలు పోటెత్తిన శబ్దాలు వినిపించాయి నాకు. మూడు పూటలు అన్నం పెట్టి, అమ్మ కుంటల్లో నీళ్లు తాగి ఆకలని నింపుకునేది . “ నేను ఎదుగుతుంటే / అమ్మకు గుండెల్లో కలుక్కుమన్నట్టు వుండేది / నా సమర్తకు రైక ముక్కయినా / కొనలేని అమ్మ /  నేను బువ్వ తినందే తినని మా అమ్మ /  నన్ను సూడకుండా ఉండలేని అమ్మ /  ఇప్పుడు నాకు వయస్సు వొచ్చిందని / ఎవళ్ళనో నాకు కట్టబెట్టడానికి వెతుకుతుంది / కిందా మీదా పడి నాకు పెళ్లి చేసి / ఇప్పుడు నన్ను పంపేటప్పుడు / తన రెండు చేతులతో పాటు / అమ్మ ప్రాణాన్నే నేను తీసుకెళ్తునట్టుంది / అమ్మ నుండి నన్ను దూరం చేస్తుంటే / నాకు అమ్మే కావాలి అనిపించి / గుక్క పట్టి  ఏడ్చుకుంటూ వచ్చా / నేను లేకుండా నా పిచ్చితల్లి / యట్టా బతికిద్దో / నాకు తెల్వడంలా / ఇప్పుడు అమ్మ ఒంటరి.... ఇలా తల్లీ పిల్లల మధ్య చాలా సంఘటనలు మనము గుర్తు చేసుకోవచ్చు.
చాలామంది కవులు స్త్రీల అందాలను అణువణువు వర్ణించారే తప్ప! బాధలను ఎవరు వర్ణించలేదని  దేశంలో  స్త్రీలపై జరిగే సంఘటనలు బాదా తప్త హృదయంతో కలాలు కదిలించాలని తంగిరాల సోనీ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా తెలియజేశారు. నా నెత్తురుతో అనే కవితలో ఓ స్త్రీ ఆవేదనతో నాఅందాలు వర్ణించడానికి, ప్రతి అవయవాలు కొలవడానికి , మమ్మల్ని ఏవిధంగా చిత్రహింసలు పెట్టారో, ఎలా రేప్ చేశారో రాయడానికి మాత్రమే మీ కలాలు కదులుతాయి గాని, మా బాధలు  మా రోదనలు రాయడానికి మీ కలాలకు కుష్టురోగం వచ్చింది కదా ! మేము సమాజంలో రావాలి అంటే భయం, జీవించాలంటే భయం ఎక్కడ చూసినా మనుషుల్లో మానవత్వం చచ్చి , మృగం ఆవహించి పశువుల ప్రవర్తిస్తున్నారు. అదేమంటే ఇది చేసే పనికి అలాగే జరగాలని వేదమంత్రంలా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ సరదాగా నా పై జోకులు వేసుకుంటూ అనరానీ మాటలతో చచ్చిన తర్వాత కూడా ఇది ఇలా అది అలా ఈ మాటల పోటులతో మమ్మల్ని చంపుతుంటారని, నానెత్తురుతో అనే కవితలో బాధను వ్యక్తం చేస్తూ.... “ నా దేహంపై కప్పుకున్న గుడ్డని తీసి / నాపై పొర్లడడానికే కలాలు కదులుతాయి.../  బయట మాత్రం మేం స్త్రీ వాదులం /  అని చెప్పే గొప్ప హింసావాదులు ఉన్న / పరమ కిరాతక పురుషులోకం.../  కప్పుకోండి... కప్పుకోండి...కప్పుకోండి... / నా శరీరం తోలు వొలిచి తయారు చేసిన / వజ్రాల శాలువాతో సత్కరించుకోండి / నా రొమ్ములు కొరికి సిరా నింపిన / కలాలు తీసుకోండి / నన్ను చంపి బంగారంతో తయారుచేసిన / పతకాల సర్టిఫికెట్లు అందుకోండి.../ మీక్కావాల్సింది నా పతనమే కదా / మీక్కావలసింది నా బానిసత్వమే కదా / మీక్కావలసింది నాపై పెత్తనమే కదా / మీక్కావాల్సింది నా శరీరమే కదా / ఒరే.. ఒరే.. ఒరే... /  తలతిప్పితేనే వరసకట్టి / హింసించే పరమ దుర్మార్గులారా / మీ ఇళ్లల్లో కూడా నేను ఉంటానని / మీరు కూడా నా నుండే వచ్చారని తెలుసుకోండి... ఇలా దేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా తంగిరాల సోనీ నా నెత్తురుతో అనే కవితలో స్త్రీ ల బాధలను వ్యక్తం చేశారు.
ఒకప్పుడు మనం కట్టేలతోనే భోజనం వండుకునే వాళ్ళం . రాను రాను గ్యాస్ - కరెంటుతో అలవాటైపోయింది మనకి. చెప్పాలంటే రోగాలు కూడా దగ్గర  అయ్యామే తప్ప మళ్లీ కట్టెలతో వండటం లేదు. పల్లెల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులు కలిసి వరిచేలల్లో పనికి వెళ్లి పనిచేసి వస్తూ వస్తూ కొన్ని కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారు . ఆకట్టేలు పచ్చివైనా, ఎండివైనా వీటితోనే వంట చేసేవారు . కట్టెలతో వండుకున్న భోజనం తింటే ఎలాంటి రోగాలకు దరిచేరనీయకుండా గ్యాస్ కు దూరంగా ఉంచుతాయి. పల్లెల్లో కట్టెలమోపు తీసుకువస్తున్నారంటే ఎక్కువమంది స్త్రీలే . అమ్మ కట్టెలమోపు తీసుకు వస్తూ వస్తూ ఈ కట్టెలమోపు అనే కవితలో అమ్మ చేసే పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది ... “ పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగి / తలకు కట్టుకోవల్సిన తువ్వాలు ఒకటి తీసుకుని / చేతిలో కొడవలి పట్టుకుని / గబగబా ఇంటి తాడిక నెట్టి ) అందర్నీ లేపుకుని / పుల్లలు ఏరడానికి పోయేది అమ్మ.../ కంది కట్టే, పొగాకు కట్టే, పత్తి కట్టే / నెత్తిమీద మోస్తావుంటే / అంత బరువు యట్టా మోస్తున్నావే / అనీ.. ఊరిలో జనం నోరు ఎళ్ళబెట్టే వాళ్ళు / అమ్మ ఇంటి చుట్టూరా / తడిక కట్టిందంటే / ' ఎంత అందంగా కట్టివే '  అనీ / చుట్టు పక్కల వాళ్లు మురిసేటోలు.../  పరగడుపునే పుల్లలకు పోయీ / వస్తా వస్తా చీరచెంగులో రేగు పళ్ళు తెచ్చేది / నోట్లో వేపపుల్ల పెట్టుకుని / ఆకలని ఎండగడుతూ ఉండేది అమ్మ/ రాత్రుళ్లు సగం బువ్వతోనే / చెయ్య కడిగే మా అమ్మ /  పొద్దున్నే మంచినీళ్ళు తోనే కడుపు నింపుకునేది / వారంలో ఒక్కసారి అయినా సరిగ్గా / బువ్వతిందో లేదో కానీ.../  పనికి వంగిందంటే / యంత్రమైన వంగి దండం పెట్టాల్సిందే అమ్మకు... ఇలా అమ్మ పనితనం గురించి చక్కని సందేశం తన కవిత్వం ద్వారా తెలియజేశారు సోనీ గారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న మాట అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ చేసే పనులు గురించి, త్యాగాలు గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది. నడక, నేర్పరి, శైలి , భాష అన్ని మొదటిగా అమ్మ దగ్గరేనేర్చుకుంటాము. కవిత్వాలు, నవలలు, కథలు మొదలగునవి ఏవైనా అమ్మ గురించే ఎక్కువగా రాస్తుంటారు రచయితలు . అలాంటి అమ్మ గురించి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే అమ్మ విలువ తెలిసిన వారికి ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ గురించి చులకనగా మాట్లాడినా , దూషించినా బిడ్డలు తిరగబడతారు లేదో తెలియదుగానీ కచ్చితంగా తల్లి తిరగబడాలి అని సోనీ గారు చెప్పే అమ్మ కవిత్వంలో... పొడిచే పొద్దు కన్నా అమ్మ ముందే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి పేడ నీళ్లు చల్లి  చట్టేలో గిద్దెడు బియ్యం పోసి కట్టె పొయ్యలో ఉడుకుతుండగా బయట దొరగారి పిలుపుకి కాలిన సాసరను పక్కన పెట్టి ఏందయ్యగారు పిలిచారు అనేలోపే దొరసాని ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. ఇంకా రాలేదేమిటా అని నీకోసం ఎదురు చూస్తున్నా ఇంట్లో పనంతా చేసి ఆ చద్దికూడు తీసుకొని వెళ్ళు అని చెప్పి దొరసాని మళ్ళీ పడుకుంది. పనంత చేసేసరికి సాయంత్రం అయింది. పని చేసి వస్తూ వస్తూ కొంతమంది దారిలో అరుగులమీద దొరలు పంచలు సర్దుకుంటూ, పళ్ళు నూరుతూ , కండ్లు కొడుతూ, రొమ్ము ఇరుస్తూ, పళ్ళు పెదాల మీద కొరుకుతూ... “ ఏందే..! / నీ మొగుడు సచ్చాక .. / చాలా వొళ్ళు చేశావంటూ / సరసాల మాటలు మాట్లాడుతున్నారు../ కాగుతున్న నూనెలో ఎయ్యాలి / ఈ దొరగాండ్లను అంటూ / తల దించుకొని నడుస్తుంది అమ్మ.../ ఆకలితో పేగులు మాడిన డొక్కలో / వాడికి సౌందర్యం కనబడిందంట...! / అలసి సొలసి పనులతో నిద్రలేమి నా కళ్ళల్లో / కామపు చూపులు కనపడిందంట / పాలురాని నా రొమ్ములో / వాడికి నయాగరా జలపాతాలు కనపడ్డాయంట..!/ ఈ.. దొరగాండ్లకు.../ ఒక్కపూట బువ్వ లేకపోతే..!  బతకలేని వెధవలు../ దొరసాని ముందుకెళ్తే../ దొరగారు కుక్క పిల్లలా, కుక్కిన పేనులా పడుండాలి.../ బయట రోషంలేని మీసం మెలేస్తారు / గాంభీర్యం ప్రదర్శిస్తారు... అంటూ నా మొగుడు ఇంటా మగాడే బయట మగాడే మా ఆయనకి దేనికి చాలరు ఈ దొర గాండ్లు . మా ఆయన పొలం పనికి పోతే పని చిటికలో అయిపోతాది. మా ఆయన పని చేసి బయటకు వస్తుంటే ఈ దొరగాండ్లు రెండు చేతులు తీసుకువెళ్లి రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కూర్చుని భయపడుతూ తలదించుకుని చూస్తుంటారు . నా మగాడు పేరు చెబితే మీకు పంచెలు తడవాలా అంటూ ... ఏడుస్తున్న పిల్లాడ్ని ఎత్తుకొని ముద్దాడుకుంటూ.. గుమ్మంలో కూలబడి తన రొమ్ములో రాని పాలు ఇస్తూ బిడ్డలో వాళ్ళయ్యను చూసుకుంటూ మురిసిపోతోంది అమ్మ...!
తంగిరాల సోనీ గారు దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు గద్గద స్వరంతో వినిపించిన బ్లాక్ వాయిస్ కవిత్వంలో ఎక్కువ శాతం స్త్రీవాద కవిత్వమే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రతి స్త్రీలో మన ఇంట్లో స్త్రీలతో సమానంగా చూడాలని సరికొత్త గొంతుతో స్త్రీవాద భావజాలాన్ని ఈ సమాజం అందిపుచ్చుకోవాలని స్త్రీలపై జరిగే దాడులలో గృహహింస, హత్యాయత్నం , చులకన భావన,  బానిసత్వం నీటి నుండి స్వేచ్ఛగా ప్రజలకు తమకు తాము నచ్చే విధంగా నడుచుకోవాలని, ఇంటి పనికి , వంట పనికి పరిమితమైన స్త్రీలు స్వేచ్ఛ సమాజంలోకి అడుగుపెట్టడానికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్య్రం లో స్త్రీలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రూపొందించిందని తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ ద్వారా వినిపించారు.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

అమ్మ కోసం

అమ్మ కోసం
ప్రపంచంలో ఎవరంటే ఇష్టం అంటే మొదటగా చెప్పేది అమ్మ పేరు మాత్రమే. ఎందుకంటే సర్వం అమ్మ ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదా అంటే కనిపిస్తుంది కానీ అమ్మ ప్రేమలా బయటకు వ్యక్తమవ్వదు. ఇలాంటి ప్రేమలు రానున్న రోజుల్లో చూడడానికి కనుమరుగైపోతాయెమో? ఈ సృష్టిలో తల్లిదండ్రులను మించిన ప్రేమ మరొకటి ఉండదేమో! ఈ వ్యక్తి చాలా మంచివాడు చాలా వినయంగా నడుచుకుంటాడు అంటే వాళ్ల తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం అలాంటిదని సహజంగా ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. మా తల్లిదండ్రుల పెంపకంలో కూడా నేను అలాగే పెరిగాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు. మాకు ఇరవై ఎకరాల పొలం ఉంది. ఈ ఇరవై ఎకరాల పొలాన్ని మా నాన్న ( గోపాలరావు ) గారు ఒక్కరే సాగు చేసేవారు. నేను చిన్నప్పుడు పొలంలో ఉన్న మా నాన్నగారికి అన్నం పట్టుకెళ్లేవాడిని. మా నాన్నగారు పొలం పనులు చేస్తుంటే నేను కూడా చేయాలని పొలంలో దిగి పని చేస్తుంటే నీకు ఎందుకు నాన్న ఈ పొలం పనులు, చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకో అని ప్రతిరోజు చెబుతుండేవారు. నేను పదవ తరగతిలో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు అప్పుడు నేను పొలం పని చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా అమ్మ ( అన్న పూర్ణమ్మ ) నాన్న మాట ప్రకారం పైచదువులు చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోమని చెప్పారు కదా! చక్కగా చదువుకో నాన్న అని బ్రతిమలాడి చెప్పింది. అప్పటి నుండి నాకు అమ్మ మాటలే నాకు మా ఊరిలో మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టింది. అంతేకాదు అందరికంటే ఎక్కువగా చదువుకున్నది నేనే. మా ఊరిలో చాలామంది పది పాసైన వారు ఉన్నారు కానీ ఎక్కువగా పొలం పనులకు వెళ్ళి పోతూ ఉండేవారు. కానీ మా అమ్మ నా  పై చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చదివించింది.
నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండగా నాకు పెళ్లి సంబంధాలు చూడమని పక్క ఊర్లో ఉన్న దూరపు బంధువులకు చెప్పింది అమ్మ. అమ్మాయి ( పెళ్లి కూతురు )ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మా అబ్బాయిని జీవితాంతం చక్కగా చూసుకోవాలి. ఇలా మా ఊళ్లో ఎవరు కనబడిన ఇలాగే చెప్పేది అమ్మ. ఏదైతేనేం నా పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా చేసింది. నా భార్య పేరు సాహితి. సాహితీ అనే పేరులోనే మంచి సాహిత్య విలువలు ఉంటాయని మా అమ్మ పెళ్లి కార్డు చూసినప్పుడు చెప్పింది. నాకు పెళ్ళైన మూడు నెలలకి నాకు ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు రమ్మని బాగా ఒత్తిడి చేశారు. మీకు ప్రభుత్వ ఉద్యోగం పై వచ్చే జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్లు కాల్ లెటరు చేతిలో పెట్టి  వారంలో మీరు ఉద్యోగానికి వచ్చేది , రానిది  విషయాన్ని తెలియజేస్తారని చెప్పి వెళ్లిపోయారు.  అప్పుడు మా అమ్మగారు ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం ఉంది హైదరాబాదు ఎందుకు వద్దులే అంది అమ్మ. నా మనసులో ఉన్న మాట కూడా అదే. ఇంతలో మా అత్తగారు , నా భార్య సాహితి అమ్మగారు ఇంతకంటే మంచి జీతం మరెక్కడా సంపాదించుకోలేరు. ప్రస్తుతం ఉన్న జీతం కంటే మూడు రేట్లు ఎక్కువగా ఇస్తున్నారంటే ఇంతకంటే ఏముంది అని ఆ టీవీ ఛానల్ గురించి గొప్పగా చెప్పింది. అసలు నేను టీవీ ఛానల్ కి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రస్తావన టీవీ ఛానల్ వరకు ఎందుకు వెళ్ళింది అని ఆరా తీయగా మా అత్తగారు బంధువులు ఆ టీవీ ఛానల్ వాళ్ళకి గొప్పగా చదువుకున్న వ్యక్తి, సామాజిక అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి అని  నా పేరు వాళ్ళకి తెలియజేశారని తెలిసింది. ఇంతలో నా భార్య కూడా హైదరాబాద్ వెళ్దాం అండి హైదరాబాదు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. దయచేసి ఒప్పుకోండి అని ఒత్తిడి చేసింది. ఊళ్లో చాలామంది ఇంత పెద్ద జీతం వస్తుంటే వెళ్ళండి అని చెప్పారు. కానీ నా మనసు అంగీకరించలేదు. చివరకి మా అమ్మగారిని కూడా నా భార్య ఒప్పించింది. హైదరాబాద్ వెళ్దామని అన్ని సర్దుకున్నాం . ఇంతలో మా అమ్మగారు నేను రావడం లేదు నాన్న ఇక్కడ పొలం ఇల్లు చూసుకోవాలి మీరు సంతోషంగా వెళ్ళండి అని చెప్పింది. మీరు రాకపోతే నేను రాను అమ్మా! మేము ఇక్కడే ఉంటాం. అని చెప్పగా ఇంతలో అమ్మ ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చి మన ఇంట్లో ఎవరైనా ఉండడానికి వస్తే నేను వస్తాను బాబు అని చెప్పింది. అయినా నేను వెళ్లకుండా ఉండిపోయాను కానీ నా భార్య వారం రోజులుగా బిక్కమొహం వేసుకుంటూ సరిగ్గా అన్నం తినకుండా ఉంది. మా అమ్మ మమ్మల్ని బలవంతంగా హైదరాబాదుకు పంపింది.
హైదరాబాద్ లో ప్రముఖ టీవీ ఛానల్ లో నా ఉద్యోగం అయినప్పటికీ మనసంతా అమ్మ మీద ఉంది ఎందుకంటే అమ్మను వదిలి ఇంత దూరం రాలేదు. వీళ్లు ఇచ్చే జీతం కంటే అమ్మ మాటలే చాలా విలువైనదని తెలుసుకున్నాను. సంవత్సరానికి పాప పుట్టింది. అంతులేని సంతోషం అచ్చం అమ్మ లా ఉందని. పాపను తీసుకునే మా ఊరు వెళ్ళాం. మా అమ్మ కూడా  సంతోషపడుతూ మా మనవరాలు చూడు ఎంత చక్కగా ఉందో అంటూ వచ్చే పోయే వాళ్లకు చూపెడుతుంది. ఇంతలో నా భార్య సాహితి  పాపను అలా అందరికీ చూపించకూడదు అని మా అమ్మతో చెప్పింది. అందుకు అమ్మ అందరికీ అంటే ఊళ్లో వాళ్లు పరాయి వాళ్ళు కాదు అందరూ మనవాళ్ళే అని చెప్పింది అమ్మ. మా ఊరిలో ఒక వారం రోజులు ఉండి తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. నేను మా ఊరికి వెళ్లడం తగ్గించేశాను. అప్పుడప్పుడు అమ్మ వస్తూ ఉంటుంది. నేను ఉదయం వెళితే మళ్లీ రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చే వాడిని. ఇలా ప్రతి రోజు నేను చేసే పని ఏమీ లేకపోయినా నా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్టుగా ఉండిపోయేవాణ్ణి.
హైదరాబాదులో సొంత ఇల్లు,  కార్లు ఉన్నాయి. మా ఊర్లో ఉన్న ఇల్లు పాతబడి పోయింది. పొలాన్ని కౌలుకిచ్చి మా అమ్మగారిని హైదరాబాద్ తీసుకు వచ్చాను. మా అమ్మ  ఒక నెలరోజులు ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా బాధపడింది. ఎందుకంటే సొంత ఊరు వదిలి ఇంతవరకు ఇన్ని రోజులు లేదు. మేము సినిమాలకి,  షికార్లకి వెళ్ళేటప్పుడు మా ఆమ్మ బయటకు వచ్చేది కాదు. ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. మేము బయటి నుంచి వచ్చేసరికి వంటపని, ఇంటిపని చక్కగా చేసేది. అమ్మ చేతి వంట అంటే చెప్పేదేముంది. బయట తిన్న తృప్తి ఉండదు. ఏదైనా అమ్మ వంట అమృతమే! అమ్మ రాకముందు మా ఇంట్లో ఇద్దరు పని వాళ్ళు ఉండేవారు. పల్లెల్లో పొలం పనులు చేసే వాళ్ళు ఇంట్లో చాలా చక్యంగా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో ఐదు మంది చేసే పని, పల్లెల్లో పొలం పనిచేసేవాళ్ళు ఒక్కరితో సమానం. మా అమ్మ ఇంటికి వచ్చిన ( హైదరాబాద్ ) తర్వాత నా భార్య సాహితీ, నా కూతురు ఆమని ఇంతవరకూ ఇంట్లో ఎలాంటి పనులు చేయలేదు. నా భార్య సాహితి పల్లెటూర్లో ఎలా ఉందో దానికి భిన్నంగా ఉంది. ఆమెతో పాటు నా కూతురు ఆమని కూడా ఇలానే ఉంది అంటే సిటీ లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి ఆటలోనే చూసి వస్తారు. పైగా విపరీతమైన షాపింగ్ చేసి వస్తారు. నా కూతురికి పాతికేళ్లు దాటిన బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది.
ఒకసారి అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాము. అక్కడికి మా ఊరి వాళ్ళు వచ్చారు . మా అమ్మను కూడా తీసుకు వస్తే చాలా సంతోష పడేదేమో అని మనసులో అనిపించింది. మేము బయటకి వెళ్ళిన ప్రతిసారీ అమ్మ వచ్చేది కాదు అలా అని ప్రతిసారి మేము అడిగే వాళ్ళం  కాదు. ఈసారి ఎందుకనో అడగకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాను. మేము ఇంట్లోకి వెళ్లేసరికి అమ్మ కిందపడి అటు ఇటు కొట్టు కుంటూ ఉంది. గబగబ హాస్పిటల్కి తీసుకు వెళ్లాను. అమ్మకు పక్షవాతం వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఒక కాలు ఒక చేయి పనిచేయడం లేదు. ఒక వారం రోజుల తర్వాత డాక్టర్ ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పారు. అమ్మను ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత నా భార్య కూతురు ఇద్దరు బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు. పాపం చాలా బాధ పడుతున్నారని అనుకున్నాను. కానీ వాళ్లకు వంట చేసే వాళ్ళు లేరని అందుకు బాధ పడుతున్నారని చెప్పారు. ఆ రెండో రోజు నుంచి నేను పని మనిషి పెట్టాను. కానీ పనిమనిషి అన్ని పనులు చేయలేదని గ్రహించాను. నా భార్య , కూతురు ఇద్దరు బయటకు వెళ్లేముందు అందంగా తయారు అవ్వడానికి మా అమ్మ కొన్ని కొన్ని వస్తువులు అందిస్తూ ఉండేది. ఇప్పుడు వారిద్దరికి అందించేవాళ్ళు కూడా మనుషులను పెట్టమని ప్రతిరోజు నస పెట్టేవారు. అమ్మను చూసుకోవలసిన వీళ్లిద్దరు, వీళ్లిద్దరు చూసుకోవడానికి మరో ఇద్దరు పని మనుషులు కావలసి వచ్చింది. ప్రతి రోజు నేను ఆఫీస్ కి వెళుతున్నానే తప్ప ఆలోచనలన్నీ అమ్మ కోసమే. అమ్మకు వచ్చిన వ్యాధిని మందులతో కొంతకాలం వరకు తగ్గించినా, ఆప్యాయంగా పలకరించి మనస్ఫూర్తిగా సేవ చేస్తేనే అమ్మ త్వరగా కోలుకుంటుందని నా మనసులో నేను అనుకున్నా కొంతమంది మిత్రులు చెప్పిన ఆలోచనలు కూడా ఇదే.
నేను ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట్లాడలేని పరిస్థితి.  అమ్మకి అన్నం తినిపించి మందులు వేసి మళ్లీ పడుకోబెట్టాను. ఇంతకీ మా అమ్మ రోజూ అన్నం తిని మందులు వేసుకుంటుందా లేదా అని ఒక ఆలోచనలో ఉండిపోయాను. ప్రతిరోజు అమ్మకు అన్నం ఎవరు తినిపిస్తున్నారు? మందులు ఎవరు వేస్తారు అని చిన్న సందేహం వేసింది. ఇంతలో నా భార్య, కూతురు వీరిద్దరితో పాటు పని మనిషి కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్లారని అడిగాను. సినిమాకి వెళ్ళామని నా కూతురు సమాధానం చెప్పింది. మా అమ్మకు అన్నం తినిపించి మందులు వేస్తున్నారా అని అడిగాను. నేను మీ అమ్మగారికి ఈ సేవ చేయలేను సార్ ఇంట్లో పని మొత్తం చేస్తున్నాను అని సమాధానం చెప్పింది పనిమనిషి. నేను జీతం ఇచ్చి వేరే పని మనిషిని కూడా పనికి రావద్దని చెప్పి పంపించాను. నా భార్య సాహితీ, కూతురు ఆమని పని మనుషులు లేకపోతే మేము ఎలా బతకాలి? కనీసం మీ అమ్మకు సేవ చేసేవారైనా కావాలి కదా! దయచేసి పనిమనిషిని పెట్టించండి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చెబుతూ వచ్చారు. ఇంట్లో మీ ఇద్దరే పని చేయాలి మా అమ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని గట్టిగా చెప్పాను. నా భార్య సాహితి నేను మా ఇంట్లోనే ఇంతవరకు పనిచేయలేదు. అలాంటప్పుడు మీ అమ్మగారికి సేవ చేయడానికి ఎలా ఒప్పుకుంటానని  అనుకున్నారు. ఇంతలో నా కూతురు ఆమని కూడా చూస్తూ చూస్తూ ముసలివావళ్ళను ఎలాపట్టుకుంటారు డాడీ ! అయినా  ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తే నెలకు ఒక సారి, రెండు నెలలకోసారి పోయి చూసి రావచ్చు డాడీ దయచేసి ఇంట్లో వద్దు డాడీ ! అని చెప్పేలోపే మా ఆవిడ సాహితీ కూడా నాకు తెలిసిన వాళ్ళు , వాళ్ల పేరెంట్స్ ను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వేశారు. మనం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వేద్దాం అని చెప్పగానే నాకు ఎప్పుడూ రాని కోపం వచ్చింది. వీళ్లు ఇలా తయారవడానికి కారణం కూడా నేనే ప్రధాన వ్యక్తిని. వీరిద్దరు సినిమాలకు షికార్లకు వెళుతుంటే ఎందుకు రోజు అని ఆరోజు ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదేమో? అని మనసులోనే అనుకున్నాను. పని మనుషులు లేకపోవడం వల్ల ప్రతిరోజు వీరిద్దరు బయటకు వెళ్ళి టిఫిను, భోజనం చేసి వస్తారు. నేను మా అమ్మ గారిని వదిలిపెట్టి  ఆఫీసు కూడా వెళ్ళలేక పోతున్నాను. ఒక వారం రోజులు వరకు నేనే వంట చేసి అమ్మకు అన్నం పెట్టి, మందులు వేసేవాడిని. ఈ వారం రోజులు గమనించిన నా భార్య,  నా కూతురు మీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. ఆఫీస్ కి వెళ్ళకుండా ఇలా రోజు సేవలు చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది చిప్పకూడే (అడుక్కు తినాలి ) అని నా భార్య చెప్పగానే కోపం వచ్చింది. అందుకు నా కూతురు ఆమని కూడా ఎందుకు అలా మా వైపు కోపంగా చూస్తారు. అప్పుడు నాకు మనసులో అనిపించింది అమ్మకు పక్షవాతం వస్తే పని చేయాల్సిందల్లా పోయి ఇలా మాటలతో చంపుతారా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా అనుకోని సందర్భాలు వస్తే లోపలున్న కపట ఆలోచనలు బయటకు వస్తాయని ఊహించలేదు. ఇలా మాకే జరుగుతుందా? ఎవరికైనా జరుగుతుందా అని లోలోపల అనుకున్నాను. కానీ బయట ప్రపంచం కూడా ఇలానే ఉందని కొంతమంది మిత్రులను అడిగి తెలుసుకున్నాను. ఏదేమైనా నా భార్యకు, నా కూతురుకు మా అమ్మ గారు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. కానీ నేను ఆఫీసుకి ఎక్కువగా సెలవులు పెట్టి అమ్మగారిని డాక్టర్కు చూపించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని. కొన్ని రోజులకు మా అమ్మగారికి ఆరోగ్యం కుదుటపడింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే మా అమ్మగారు నడుస్తున్నారు,  మాట్లాడుతున్నారు. కానీ ఇది వరకు ఉన్న చలాకితనం ఇప్పుడు లేదు కొద్దిగా నీరసంగా ఉంటుంది. నేను ఆఫీసుకు వెళ్ళగానే మా అమ్మగారిని నా భార్య, నా కూతురు తిడుతూ ఉండేవారని నేను గ్రహించాను. నేను ఆఫీస్ కి వెళ్లి రాగానే ప్రతి రోజు మా అమ్మగారు నేను మన ఊరు వెళ్ళిపోతాను అని ప్రతిరోజూ చెబుతూ ఉండేది. నా భార్య మాత్రం మన ఇంట్లో మీ అమ్మ ఒంటరిగా, బాధగా ఆలోచించే కంటే మీ ఊరికి పంపించడం చాలా మంచిదని చెప్పింది. అయినా నేనేమీ పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఏడుస్తూ నేను మన ఊరికి వెళ్లి పోతాను నాన్న ! నన్ను పంపించు చెప్పగానే కనిపించే వ్యాధి కన్నా కనిపించని మనోవ్యాధి మనిషిని మరింతగా బాధింప చేస్తుందని అనుకున్నాను. ఈ లోపు నా భార్య నా కూతురు వచ్చి మీ అమ్మగారిని ఊరికి పంపిస్తారా? మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్లిపోమంటారా? అని చెప్పగానే ఇప్పుడు ఏమైంది అందరూ కలిసే కదా ఉండేది? అని నేను చెబుతుండగా మీ అమ్మగారు ఇంట్లో ఉంటే మేము క్షణం కూడా ఈ ఇంట్లో ఉండమని నా భార్య కూతురు ఇద్దరు చెప్పి వరండాలో కూర్చున్నారు. మా అమ్మగారు నాన్న నావల్ల ఇబ్బందులు వచ్చినా , రాకపోయినా తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు కష్టంగా భావించడు.  కుటుంబం అంటే మొదట భార్య, పిల్లలు తర్వాతే ఎవరైనా!  నీవు కోడలు సాహితీని, మనవరాలు ఆమని వాళ్ళు మనసులను కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో నన్ను మాత్రం మన ఊరికి పంపించు ఇప్పుడే అని బట్టలు సర్దుకుని వచ్చింది మా అమ్మగారు.
నేను మా అమ్మగారిని తీసుకుని మా ఊరికి వెళ్ళాను. మా ఇల్లు పాతబడి కూలిపోయింది. తెలిసిన వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంచి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. కానీ నా భార్య సాహితీ, నా కూతురు ఆమని ముఖాల్లో ఏదో చెప్పలేని ఆనందం హావా భావాలు కనిపించాయి. కానీ ఇంట్లో వంట చేసి చాలారోజులైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరు బయట తిని ఇంటికి పడుకోవడానికి మాత్రమే వస్తారు. నేను కూడా ఆఫీస్ క్యాంటీన్ అలవాటు చేసుకున్నాను. మాఇంట్లోనే వీరిద్దరికి భారంగా ఉన్న మాఅమ్మ అక్కడ వాళ్లకు మాత్రం భారంగా ఉంటుందేమోనని రోజు భయపడుతూ ఉండేవాడిని. ఆఫీసు పని మీద ఒక నెల రోజుల పాటు వేరే ఊరు వెళ్ళాడానికి ఫ్లైట్ టికెట్ లు బుక్ చేసుకున్నాను. ఈ టిక్కెట్లు నా భార్య సాహితీకి, నా కూతురు ఆమని చూపించాను. వీళ్లిద్దరు మీరు ఎక్కడికైనా వెళ్లండి కానీ మాకు నెలకు అయ్యే ఖర్చులు రెండింతలు ఇచ్చి వెళ్లండని చెప్పారు. ఈ కావలసినవి ఇప్పుడే తీసుకోండి అనగానే రెండు ఏటీఎం కార్డులు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు. నేను వాళ్లకు ఫ్లైట్ టికెట్ లు వేరే దేశం వెళ్తున్నానని చూపించాను కానీ నేను మా ఊరికి బయలుదేరాను. ఎందుకంటే అక్కడ మా అమ్మగారికి ఎలా ఉందో అని రోజూ భయపడుతున్నాను. నేను మా ఊరికి కి రానే వచ్చాను. అంతగా భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే  పల్లెటూర్లో కొంతైనా ప్రేమ బ్రతికే ఉంది. నా భార్య నా కూతురు పెట్టిన హంస కంటే పల్లెల్లో స్వేచ్ఛగా బతకడం చాలా సులభం. ఎంతోకొంత అయినా పల్లెల్లోనే మానవత్వం ఉందని ఇక్కడ చూసి తెలుసుకున్నాను.
మా ఊరిలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న చల్లటి వాతావరణం. అందుకేనేమో పెద్దలు సిటీ కి రారు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేరు. మా పాత పడ్డ ఇల్లును పడగొట్టి  జమ్ము గడ్డితో చిన్నఇల్లు కట్టించాను. ఆ జమ్ము గడ్డి ఇల్లు  ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక్కడ అమ్మను చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఇద్దరినీ మాత్రం చూసుకోమని వాళ్లకి  నెల జీతంగా ఇస్తానన్నా వాళ్ల మనసు అంగీకరించలేదు. ఎలాగో మా పొలం కౌలుగా చేస్తున్నారు కాబట్టి ఎంతోకొంత ఆ సమయంలో ఇస్తే సరిపోతుందని అనుకున్నాను. నేను హైదరాబాదు నుండి ఊరికి వచ్చేటప్పుడు ఏటీఎం కార్డులు, చెక్కులు బ్లాక్ చేశాను. ఇంట్లో పది వేల రూపాయలు మాత్రమే  ఉంచాను. వేరే దేశం వెళుతున్నాను అక్కడ ఫోను కలవక పోవచ్చు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చాను. ఎందుకు అలా చేశాను అంటే ఇద్దరికీ తినడానికి పదివేల రూపాయలు ఒక నెల రోజులు సరిపోతుందని భావించాను. పేదవాడి కుటుంబానికి అయితే ఈ పదివేల రూపాయలు నెలరోజులకి చాలా ఎక్కువ. మా అమ్మగారు నేను  ఊరిలో నెలరోజులు ఉన్నంతవరకు నా భార్య సాహితీ , నా కూతురు ఆమని గురించి  పదే పదే ఆలోచించింది. నన్ను అక్కడికి వెళ్లిమని చాలా సార్లు చెప్పింది.
నేను హైదరాబాదు తిరిగి వెళ్ళగానే నా భార్య నా కూతురు కోపంగా చూసారు కానీ ఏమీ అనలేదు. ఆమని నా దగ్గరకు వచ్చి డాడీ మీరు మమ్మల్ని మోసం చేశారా? లేక బుద్ధి చెప్పారో తెలియదు కానీ మేము షాపింగ్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు చూపిస్తే డబ్బులు లేవని తెలిసింది. అక్కడ మాకు పరువు పోయిందని గ్రహించాము. తిట్టుకుంటూ ఇంటికి వచ్చి కనీసం తినడానికే డబ్బులు ఉన్నాయో లేవో అని అక్కడక్కడ వెతకగా పదివేల రూపాయలు కనిపించాయి తినడానికి సరిపోతాయి అనుకున్నాము. బయట భోజనం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు వచ్చాయి మూడు రోజులు పస్తులు ఉన్నామని చెప్పింది. నేను లోలోపల బాధపడ్డా అమ్మకి జరిగిన భోజనం విషయంలో అంత బాధ అనిపించలేదు. వీరిద్దరు పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నారే తప్ప  లోపల నామీద కోపం అలానే ఉంది. ముందున్న అహం మాత్రం ఇప్పుడు లేదని నేను గ్రహించాను.
రెండు నెలల తర్వాత మా ఊరి నుంచి ఫోన్ వచ్చింది మా అమ్మగారు చనిపోయారని. మన ఊరు వెళ్దామని నా భార్య సాహితికి, నా కూతురు ఆమనికి చెప్పాను. కానీ ఇద్దరూ రానని చెప్పారు. వీళ్లు మారరు అని మనసులో అనుకున్నాను. ఈ ఒక్కసారికి నాకోసం రమ్మని ప్రాధేయపడ్డాను. ఊరికి వచ్చిన తర్వాత , ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఊరిలో ఎవరూ పనికి పోలేదు. అందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. నేను కొన్ని రోజులు ఉందామని చెప్పాను. అందుకు కు నా భార్య, కూతురు ఇద్దరు ఊరిలో ఉండడానికి ఒప్పుకోలేదు వెళ్ళిపోదామని చెప్పారు. ఇంతలో మా ఊరిలో ఉన్న లాయరు భీమరాజు గారు వచ్చి  సాహితీ , ఆమని అంటే మీరేనా అని అడిగారు. అవునని నా భార్య కూతురు ఇద్దరు సమాధానం చెప్పారు. లాయర్ గారు వచ్చి  దస్తావేజులు ఇక్కడ సంతకాలు పెట్టండని చెప్పారు. ఎందుకని అడిగేలోపే మీ అత్త అన్నపూర్ణమ్మ గారు సాహితీ అనే పేరు మీద పది ఎకరాలు పొలం, ఆమని పేరు మీద పది ఎకరాల పొలం రాసి ఇచ్చారని లాయర్ గారు చెప్పారు. కొడుకు పేరు మీద రాయకుండా మాకు ఎందుకు ఇచ్చారని వారు అడగ్గా ! అందుకు లాయర్ గారు నా కొడుకు ఎలాగైనా బ్రతుకగలడు. మా అబ్బాయి లేకపోతే మీరు బ్రతకలేరు అని కాదు. మీకు ఏదో ఒక సమయంలో ఆధారం అవుతుందని ఉద్దేశంతోనే మీకు రాస్తున్నానని అన్నపూర్ణ గారు నాతో చెప్పారని లాయర్ గారు బదులిచ్చారు. అప్పుడు నా భార్య సాహితి, కూతురు ఆమని బోరున విలపించారు. వాళ్లు చేసిన తప్పులకు క్షమించమని నా కాళ్లు పట్టుకుని ఏడ్చారు. నా పేరు సాహిత్య ప్రకాష్

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534