Thursday, January 17, 2019

కనుమరుగవుతున్న తెలుగు వారి కళలు, సంప్రదాయాలు మరియు పండుగలు

కనుమరుగవుతున్న తెలుగు వారి కళలు, సంప్రదాయాలు మరియు పండుగలు - Telugu Kalalu




ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి.



అలాంటి కళలు కొన్ని:



1. ముగ్గులు



ముగ్గులు వేస్తున్న తెలుగింటి అమ్మాయి - Muggulu 

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.



వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.



2. కొమ్మునృత్యం



కొమ్మునృత్యం చేస్తున్న గిరిజన మహిళలు - Girijana Mahilalu 

కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం.









దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం కొమ్ము నృత్యం గా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం "డోలు కొయ్య". చైత్రమాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం, ఈ కొమ్ము నృత్యం.



3. జముకు

పూర్వపు రోజులలో శక్తి గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు గ్రోలి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది.



4. బొమ్మలకొలువు



బొమ్మలకొలువు, Bommalakoluvuu 

ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి, మరి కొన్నిచోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప, దీప, నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి.

బొమ్మల కొలువులు చిన్న పిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఇల్లాండ్రను పిలిచి రాజూ-రాణీ, లేదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలకు పెళ్ళి చేయడమో లేదా పేరంటం చేయడమో చేసి వచ్చిన ఇల్లాళ్ళకు వాయినమిచ్చి పంపించడం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో.



5. ప్రభలు



 రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను ప్రభలు - Prabhalu 

ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రభకు బహుమతిని అందచేస్తున్నారు.



గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్ప కొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రికి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథలు మొదలైనవి ఉంటాయి. తల నీలాల మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటేశ్వరుడు, త్రికోటేశ్వరస్వామి అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.



6. బుట్టబొమ్మలు

బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. బుట్టబొమ్మలు ఎత్తుగా ఉండి నడుము భాగమునుండి క్రిందికి దిగేకొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు.



బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. బుట్ట బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు కలవు



7. బుర్ర కథ





ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం -ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీరగాథలను గానం చేసేందుకు ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది. బుర్రకథ అనగానే నాజర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం బహుళ ప్రచారం పొందినవి.



బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. ముగ్గురు బృందముగా ఉండే ఈ ప్రదర్శనలో మధ్య పాత్రధారి ముఖ్య కధకుడు గానూ, మిగిలిని ఇద్దరిలో ఒకరు వంత కథకు, మరొకరు హాస్య కథకులుగానూ ఉంటారు. సాధారణంగా ఇది నిలుచుని చెప్పే కధ ఐనా, సౌలభ్యత కోసం కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయగలవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాలు ఉన్నాయి.



8. తండాలనృత్యం



లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ మహిళల రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు చూడముచ్చటగా ఉంటాయి.



వీరు తండాలుగా జీవిస్తారు. పెళ్ళిళ్ళలో, జాతరలలో, వీరి సాంప్రదాయక సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది. అరకు అడవులలోనూ, శ్రీశైలం అడవులలోనూ మరియు భద్రాచలం అడవీ గ్రామాలలోనూ సందర్శకులకు కూడా వీరి నృత్యాలను చూసే అవకాశం ఉంది.



9. యక్షగానం



యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పు చెందుతూ వచ్చింది. మొదట యాత్రా స్థలాలు, కామందుల లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కధిస్థానములైనవి. వర్తమానంలో అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, ఏ కోవెల వాకిటనో, ఏ సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపి జల్లిన కటికనేలయే దాని రంగస్థలము.



పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి.



10. తప్పెటగుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు. వీరు ఎదురురొమ్ముపై తప్పెట గుళ్ళను కాళ్ళకు చేతులకు చిరు మువ్వలను దరించి అందరూ ఒకే పద్దతిలో కదులుతూ గానం చేస్తుంటారు.



11. జంగందేవరలు

తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగందేవరల ఆహార్యంగా ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.



12. ఎడ్లపందాలు



తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం.



13. కోడి పందాలు



గ్రామీణ ప్రాంతములో కోడిపందాలు

ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతి కి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే. ఒకప్పుడు గ్రామాలలో కోడి పందాలు అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదు - పందాలు జరిగే ప్రాంతములో గుండాటలు, పేక మేజిక్ ప్రదర్శనలు, బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు ఇలా వివిధములతో దాదాపు తిరునాళ్ళ వాతావరణము ప్రతిబింబిస్తూ ఉండేవి. అందుచేతే పందాలంటే ఉదయంనుంచే హడావిడి మొదలయ్యేది గ్రామాలలో. పేరుకు నిషేధం విధించినా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.



14. పులివేషం

సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులివేషం కడతారు. డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన పైడి గురువులు సిద్ధహస్తులు.



విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని ఉంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ.



15. హరిదాసులు

సంకీర్తన చేయుచూన్న హరిదాసు

ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి "ఏ తీరుగ నను దయ చూచెదవో.." అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. చక్కని ఎర్ర రంగు పంచె కట్టుకొని, ఛాతీ మీద, భుజాలపై, నుదిటి మీద విష్ణు నామాలను పెట్టుకొని అపర నారదుల వలె అగుపించే హరిదాసులు, వారి కీర్తనలు సంక్రాంతి సమయంలో పల్లెకు కొత్త శోభను తెస్తాయి.



16. గోరింటాకు

కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభ ముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే.



17. గుసాడీ

ఆదిలాబాదు జిల్లాలో రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. నెమలి పింఛాలతో తయారు చేసిన పాగా, కృత్రిమమైన గడ్డాలు, మీసాలతో వేషం కట్టి, మెడలో గవ్వల హారాలు, తుంగకాయల దండలు, నడుముకు, మణికట్టుకు చిరు గంటలు, గజ్జెలు ధరించి, కంటి చుట్టూ తెల్లని రంగు పూసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గుసాడీ నాట్యం చేస్తారు.



18. థింసా

థింసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేషాదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి. ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఆడా, మగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతులవారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ, వివాహాది సందర్భాలలోనూ చేస్తుంటారు. వీరి దైనందిన జీవితానికి, ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది.



19. డప్పు

పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ముందు మెల్లగా ప్రారంభమయ్యే ఈ నృత్యం రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.



20. శరభనృత్యం

వంటినిడా విభూతి పుండ్రాలు ధరించి శరభ శరభా, హశ్శరభ శరభా అని వీరంగం వేస్తూ, చిందులు తొక్కుతూ, పొడవాటి పలుపు తాడుతో వీపులపై తాటించుకుంటూ ఖడ్గాలను చేత ధరించి వాటిని తిప్పుతూ నృత్యం చేస్తారు. మరొక పద్ధతిలో శూలాలతోనూ శూలాల చివర నూనె గుడ్డలు చుట్టి దానికి మంటలు పెట్టి వాటిని త్రిప్పుతూ నృత్యం చేస్తారు. ఇది కూడా పల్లెలలో ప్రసిద్దమైన జానపద కళ. ఇప్పటికీ ఈ నృత్యాన్ని చాలా చోట్ల వీరభధ్రస్వామి దేవాలయాలలో మరియు నిప్పుల గుండం తొక్కే సందర్బాలలోనూ చూడవచ్చు.



21. చెమ్మచెక్క

చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని, అని ఉంటాడు.



22. రుంజ

రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చునట.

సంక్రాంతి సంభరాల్లో గంగిరెద్దులు



23. గంగిరెద్దులు

ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి.



24. చెడుగుడు

పల్లెల్లో చెడుగుడు

ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట. రెండు జట్లుగా జరిగే ఈ ఆటలో పది నుండి ఐదు వరకూ ఒకోజట్టులో సభ్యులుంటారు. కూత అనే ప్రక్రియతో అవతలి జట్టుమీదకు రెండవ జట్టు నుండి ఒకరు వెళతారు. అతడు నోటితో చేసే ఆకూత అనే శబ్ధం ఆపేలోపుగా అవతలి జట్టులో ఎవరినైనా ముట్టాలి. అవతలి జట్టు అతని కూత ఆపి పారిపోయేలోగా పట్టూకొంటే అతను బయట నిలుచోవలసి వస్తుంది.



25. బుడిగే జంగాలు

బుర్రకధలకు పూర్వ రూపమే జంగం కధ. ఈ కధను చెప్పే వారినే జంగాలని బుడిగే జంగాలని అంటారు. ఒకప్పుడు దేశభక్తి మత ప్రచారాలకు ఎంతో తోడ్పడినా ప్రస్తుతం తెరమరుగై కొందరి ఉధర పోషణార్ధం కొరకే పనికొస్తున్నాయి.



26. కనక తప్పెట్లు

డప్పుల వాయిధ్యాన్నే రాయలసీమలో కనక తప్పెట్లు అంటారు. వీటిని సాధారణంగా జాతరలకు, వివాహాలకు, చాటింపులకు ఉపయోగిస్తూ ఉంటారు. దప్పులతో గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ వివిద వరుసలలో లయగా వాయిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తారు



27. ఘటనృత్యం

ఘటనృత్యం లేదా గరగనృత్యంగా పిలిచే ఈ ప్రక్రియలో తలపై కలిశాకారం కలిగిన ఘటాన్ని ఎత్తుకొని డప్పులశబ్ధానికి లయగా నృత్యం చేస్తారు. ఐదు లేదా మూడు సర్పాల ఘటాలతో జాతరలలో ఎక్కువగా వెరు నృత్యం చేస్తుంటారు.



28. పగటి వేషాలు





జానపదుడి వీధి ప్రదర్శన-పగటివేషాలు జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుకవృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది.



అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాలపేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనాసమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు. పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్ డౌన్ మిత్ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారిపగటివేషాలని , స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి.







ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు , మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. పగటి వేషాలు చారిత్రకత జనవ్యవహారంలో ఉన్నకధలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకధ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కధలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషలను గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రొ. ఎస్. గంగప్ప పరిశోధించి పగటి వేషాలు వాయసంలోను, కూచిపూడి భాగవథులు ప్రదర్శించే వేషాలను పగటి వేషాలుగా వివరించారు. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన ఈ కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ఠ రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమ్నుండే ఈ కలారూపం ఉందని, హాలుని గాధాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు.



పగటివేషాలు - వర్గీకరణ పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషల్లు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు.

ఇతివృత్తం ఆధారంగా పగటివేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. 

1. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం.

2. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి.

3. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి.

4. జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పములోల్ల వేషం,

5. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాశికావిళ్ళ వేషం వంటివి.



పగటివేషాలు- ప్రదర్శన రీతులు పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు , వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటున్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది.



29. బతుకమ్మ



తెలంగాణా ప్రాంతంలో ఆచరించే పూల పండుగ, పూబోడుల పండుగ, బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో మహిళలు జరిపే ఈ పండుగ చివరి రోజును సద్దలు అని వ్యవహరిస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. రంగు రంగుల పూలను ఎంతో మెళుకువతో పిరమిడ్ ఆకారంలో పేర్చి, ఆ పువ్వుల కుచ్చెన నడిబొడ్డులోగాని, శిఖరంలోగాని గౌరమ్మను అమరుస్తారు. ఈ పువ్వుల పళ్లెరాన్ని వాకిట్లో ఉంచి కొత్త దుస్తులు ధరించి స్త్రీలు, బాలికలు చేరి దీని చుట్టూ క్రమంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత ఊరేగించి ఈ బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.



గొర్రెల మందలను కాయడం ఒక వర్గం ప్రజలకు వృత్తి. గొర్రెలు పాలు ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. పైగా వ్యవసాయ భూములలో మందలను వదలి పెట్టడం వల్ల ఆ భూములకు ఎరువులు సమకూరి సారం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కాపరులు గొర్రెలను తోలుకుపోవడం తెలుగునాట తరుచుగా కనబడే చక్కని దృశ్యాలలో ఒకటి.



30. వినాయక చవితి

హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి.



పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది.



కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం ఎంతో అందమైన దృశ్యం.









పల్లెల్లో కులవృత్తులు

గ్రామాల్లో - కులవృత్తులు వారి జీవన విధానం - Pallelu - Kulavruttulu, Kulam





 పల్లెల్లో కులవృత్తులు

కులం అనేది వారివారి వ్రుత్తి ధర్మానికి సంబందించినది. "తక్కువ కులం - పెద్ద కులం" అంటూ ఏమిలేదు, అది కొందరు అతి గర్వమున్నవాళ్ళు వారికి వారు విధించుకున్న ఒక నిబందన మాత్రమే. ప్రతి కులం వారికి సామాన గౌరవముంది. కులానికి, మతానికి ఎటువంటి సంబంధం లేదు. కులాల పేరుచెప్పి హైందవ ధర్మాన్ని విస్చిన్నం చేసి మతమార్పిడులకు పాల్పడుతున్నవారిని తరిమి-తరిమి తన్నాలి. కాబట్టి కులవృత్తులు ఎలా ఉంటాయి?

1.చాకలి:
ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారిది ముక్యమైన పని అందరి బట్టలను వుతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తికుని వెళ్లి తింటారు. అలాగె రాత్రికి కూడ కొంత అన్నం పెట్టాలి. దీనికొరకు చాకలి స్త్రీ ఒక గంప, ఒక పాత్ర తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి అన్నం కూరలు తీసుకుంటుంది. అన్నాన్ని గుడ్డ పరచిన గంపలో వేసుకుంటే కూరలను ఒక పాత్రలో పోసుకుంటుంది. ఆ విధంగా వూరి వారి అందరి కూరలు ఒకే పాత్రలో సేకరించడము వలన అది ఒక ప్రత్యేక రుచిని కలిగి వుంటుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పుట్టినదే సామెత.. చాకలి కూర. వూరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగ గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది.



పల్లెలోని ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లలు సమర్తాడితే ఆ సందర్బంలో ఆ అమ్మాయి ఒంటి పైనున్న బట్టలు చాకలికి చెందుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సామెతె పుట్టింది. అదేమంటే సరదాకి సమర్థాడితే చాకలి చీర పట్టుక పోయిందట. సామెత వివరణ ఒక అమ్మాయి సరదాకి తాను సమర్థాడినట్లు ప్రకటించింది. ఆనవాయితి ప్రకారము చాకలి వచ్చి స్నానం చేయించి ఆ చీర పట్టుకొని పోయిందట. అదే విధంగా వివాహము వంటి శుభ కార్యాలలోను, చావు వంటి అశుభ కార్యాలలోను చాకలి, మంగలి వంటి వారు తప్పని సరిగా నిర్వహించ వలసిన కార్యాలు కొన్ని వుంటాయి. వాటినే చాకలి సాంగెం, అని మంగలి సాంగెం అని అంటారు. చావులో గాని, పెండ్లి లోగాని చాకలి వారి పని దీవిటి పట్టడము. అది పగలైనా, రాత్రి అయినా దీవిటి పట్టవలసినదే. ఆ విధానము ఒక తప్పనిసరి అయిన సాంప్రదాయము అయిపోయినది. వీరు దీవిటి పట్టడమనే తంతు దేవుని ఊరేగింపులోను, గంగమ్మ జాతర వంటి జాతర సందర్బంలోను తప్పని సరి. గంగమ్మ జాతరలో చాకలి వారే పూజారులు. ఈ విధానములో వీరికి కొంత సంభావన ముట్టుతుంది.



గ్రామంలో ‘రజకులు’ (చాకలి) కొన్ని కుటుంబాలకు ఒక కుటుంబం చొప్పున రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతూ ప్రతి దినం అన్నం పెట్టించుకొని వెళ్ళేవారు. పదవులు నిర్వహించే వారు, భాగ్యవంతులు చాకలికి ‘ఇస్త్రీ పెట్టె’(iron box) ఇచ్చి బట్టలు ‘చలువ’ చేయించుకొనే వారు. సంవత్సరానికి కుటుంబానికి నిర్ణయించిన ‘మేర’ ప్రకారం ధాన్యం వగైరా తీసుకనే వారు. చాకలి వాళ్ళే రైతుల సహాయంతో ‘బట్టీ’ల ద్వారా సున్నం తయారుచేసి కుటుంబానికి కావలసినంత ఇచ్చేవారు. తాంబూలం వేసుకొనే వారికి వీరు ప్రత్యేకమైన సున్నం ఇచ్చేవారు. పెళ్ళి మొదలైన శుభకార్యాలకూ, దైవకార్యాలకూ రజకులు పందిళ్ళు వేసి మామిడి తోరణాలు కట్టేవారు. వంట చెరకు విషయంలో కూడా వీరు రైతులకు ఎంతో సహకరించే వారు.



చాకలి వారు చేయ వలసిన పనులలో మరొకటి ఏమంటే చిన్నపిల్లలకు పురిటి స్నానము చేయించడము, ఆ సందర్బాని ఊరివారందని పిలవడము వీరి విధులల్లో ఒకటి. ఆ చాకలి ప్రతి ఇంటికి వెళ్లి పలాన వారింటిలో పురుడు పోస్తారు మీరు రావలసినదని చెప్తాడు. దీన్ని పురస్కరించుకొనొ ఒక సామెత పుట్టింది. అదేమంటే చాకలి దానికి చెప్పి చాలుకున్నడట. సామెత వివరణ: ఏదైనా ఒక రహస్యము చెప్పి ఎవరికి చెప్పవద్దంటే వాడు ఆ విషయాన్ని చాకలి వానికి చెప్పి చాలుకున్నాడట. అనగా చాకలి దానికి చెప్పిన విషయము వెంటనే ఆ పల్లెకంతా తెలిసి పోతుందని అర్థము.



కాలక్రమేణా వృత్తులు వ్యాపార దృష్టిని సంతరించుకొన్నాయి. సమాజం సమూలంగా మార్పు చెందింది. ఆధునిక పరికరాభివృద్ధి ఫలాలైన ‘లాండ్రీలు’, ‘బార్బర్‌ షాపులు’, నూలుమిల్లులు మొదలైన వాటి పోటీలో చేతివృత్తుల వారు వెనుకబడిపోయి బ్రతుకు దెరువుకోసం పట్టణాలకు వలసలు పోవలసిన దౌర్భాగ్యం పట్టింది. సకాల వర్షాలు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో చివరకు రైతుల ఆత్మహత్యలతో దేశ ఆహారోత్పత్తి కుంటుబడుతున్నది. వ్యాపార పంటలు, ఉన్నత విద్యపై మోజు పెరగడంతో నగరీకరణ జరుగుతూ పల్లెలు చాలావరకు నగరాల్లో కలిసిపోగా మిగిలినవి వెనుకబడిపోయాయి.



2. మంగలి:

మంగలి వృత్తి కూడ ఆ నాటి సమాజంలో చాల ప్రధానమైన వృత్తి. ప్రతి సారి ప్రతి ఫలం ఆశించ కుండా అందరికి క్షవరంచేసే వీ ఆ పనికి గాను ఫలితానికి, మేర ద్వారా ఐదు బళ్లల వడ్లు, ఒక మోపు వరి తీసుకునేవారు. తలంటు స్నానం చేయించడం వంటి పనులు చేసె వారు. ప్రతి రోజు మంగలి పల్లెలలోనికి వచ్చి క్షురక వృత్తి చేసె వారు. తల క్రాపు చేయడం, పెద్దవారికి గడ్డం చేయడం వంటివి చేసె వారు.



నాయా బ్రాహ్మణులు (మంగలి వాళ్ళు) గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఒకరు చొప్పున ఇంటింటికి వెళ్ళి ‘తలపని’ (క్షవరం) చేసేవారు. సంవత్సరాంతంలో వీరు తమ ‘మేర’ తీసుకొనే వారు. వివాహ కార్యాల్లో వీరు వధూవరుల చేతి, కాళ్ళ గోళ్ళు తీయటం మొదలైన ‘కన్నెపెళ్ళి’ పనులు చేసే వారు. పుట్టు వెండ్రుకలు తీయటం, శుభకార్యాల్లో మంగళ వాద్యాలు వాయించి తగిన పారితోషికం పొందటం వల్ల వీరి జీవనం సాగేది. వీరు దైవకార్యాల్లో నిలయ విద్వాంసులుగా ఉండటం వల్ల ‘దేవుని మాన్యం’ కూడా భుక్తంగా ఉండేది.



ఈ విధంగా ’Artisans’ అనీ, పంచభట వృత్తుల వారనీ వీరు గ్రామాల్లో కొన్ని ప్రత్యేక సంప్రదాయ విధానాలు కలిగి, పని హక్కు గలిగి, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే వారు. ప్రాచీన కాలం నుంచి వీరికిచ్చిన ‘మాన్యము’ వంశపారంపర్యంగా అనుభవిస్తూ కార్యసాధకులుగా ఉండేవారు.



3. కుమ్మరి:

అమ్మకానికి సిద్దంగా వున్న కుమ్మరి చేసిన కుండలు.

కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడ ప్రతి పలితానికి 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్లి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు.



వంటకు నాడు గ్రామాల్లో దాదాపు అందరూ మట్టి పాత్రలే వాడేవారు. కుమ్మరులు మట్టితో తయారుచేసిన చట్లు, కుండలు, మూకుళ్ళు, బానలు, కడవలు, ముంతలు, అన్నం తినే చిప్పలు బియ్యం, ధాన్యం పోసుకొనే పెద్ద ‘గరిసెలు’ ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చేవాళ్ళు. సంవత్సరాంతంలో తమకు వచ్చే ‘మేర’ రైతుల నుండి తీసుకొనే వారు. అదనంగా వీరు వివిధ రకాల మట్టిపాత్రలు తయారుచేసుకొని ‘కావిళ్ళ’తో మోసుకొనిపోయి సమీపంలోని పట్టణాల్లో వాటిని అమ్ముకొనే వారు. దైవకార్యాల్లో కుమ్మరులు తమకు కేటాయించిన పనులు నియమంగా నిర్వహించే వారు.



4. వడ్రంగి:

వీరి పని కర్రలతో పని ముట్లు తయారు చేయడం. నాగలి, కాడిమాను, ఎద్దుల బండి, ఇంటి సామానులు తయారు చేయడం వీరి పని. వ్యవసాయం యాంత్రీకరణమైన ఈ రోజుల్లో వడ్రంగి చేయవలసిన వ్వయసాయ పని ముట్లు ఏమి లేవు. అయినా ఇంటికి సంబందిచిన ద్వారాలు, కిటికీలు వంటి పనులు వీరికి ఎక్కువగా వున్నాయి వారు ఇప్పటికి పూర్తి స్థాయిలో పనులలో నిమగ్నమై వున్నారు. వారికి కావలసినంత డిమాండు వున్నది.



5. మేదర:



మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు మరియు ఇతర అందమైన అలంకార వస్తువులు.

వీరు వెదురు బద్దలతో తట్టలు,, బుట్టలు చాటలు దాన్యాన్ని నిలవ చేసె బొట్టలు ఎద్దుల బండికి వేసె మక్కిన వంటివి అల్లు తారు. గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెఛ్ఛి తట్టలు బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగ వుండేది. తాము తయారు చేసిన వస్తువులను రైతులకు దాన్యాన్నికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.



6. జంగం వాళ్ళు:

జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిది, వార, నక్షత్రాలను చెప్పి తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుబాలను చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగానే వుంటుంది. కాషాయ వస్త్రాలను ధరించి, తలపాగా కట్టి, బుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతొలో శంఖం వుంటుంది.



7. కంసాలి:

లోహ వస్తువులను తయారు చేసె వారిని కంసారి అంటారు వీరు కత్తులు, గొడ్డల్లు, కొడవళ్లు వంటి లోహ సామానులు చేసె వారు. ఇప్పుడు వాటి అవసరం ఎక్కువ లేదు. అయినా యంత్రాలతో తయారైన రడిమేడ్ పరికరాలు సంతల్లో దొరుకుతున్నాయి. గతంలో అక్కడక్కడా ''కొలిమి'' వుండేది. కాని ఈరోజుల్లో కొలిమి ఎక్కడా లేదు.



8. గాజుల వాళ్ళు:

ఆ రోజుల్లో గాజుల శెట్టి తన మలారం బుజాన వేసుకొని పపల్లెల్లో తిరిగే వారు. మలారం అంటే: సన్నని పొడవైన దారాలకు గాజులను రెండు వైపులా గుత్తులు గుత్తులుగా కట్టి ఆ దారాలన్నింటిని మధ్యలో ఒకటిగా కట్టి దాన్ని బుజాన వేసుకుంటారు. గాజుల వాళ్ళు కొన్ని పల్లెలను తమ ప్రాంతగా విభజించుకొని ఆ యాపల్లెలలో వారె గాజులను అమ్మేవారు.



9. మాల:

వీరు హరి జనులు. ఇతర ప్రాంతాలలో వీరిని అంట రాని వారుగా పరిగణించబడినా, ఈ ప్రాంతంలో అనగా రాయలసీమ లో మాత్రం అంట రాని తనం అంత తీవ్రం వుండేది కాదు. వీరి జన సంఖ్య ఎక్కువే. వీరు ఎక్కువగా కూలీలుగా వుండే వారు. వీరిలో కూడ భూములున్న వారు కొందరుండేవారు. వీరు వ్వవ సాయ పనులు చాల బాగ చేస్తారు.



10. మాదిగ:

వీరు కూడ హరిజనులే. కాని వీరి జన సంఖ్య తక్కువే. వీరు చెప్పులు కుట్టడం, తోలు తోచేసిన కపిలి బానలను కుట్టడం అవకాశం వున్నప్పుడు రైతు పొలంలో కూలికి వెళ్లడం చేసే వారు. వీరికి కూడ రైతుల నుండి మేర వరి మోపు లభిస్తుంది. రైతు లందరూ వీరి వద్దనే చెప్పులు కుట్టించు కునేవారు. కరెంటు మోటార్లు వచ్చాక వీరి వృత్తి మరుగున పడిపోయింది.



11. బెస్త వారు:

బెస్త వారి కులంలో అనేక ఉప కులాలున్నాయి. గంగ పుత్ర, వన్నెకుల క్షత్రియ, పలికాపు, అనే కులాలు ఇందులోనె ఉన్నాయి. బెస్త వారి వృత్తి చేపలు పట్టడము. ఈ కులం వారు కృష్ణా, గోదావరి, తుంగ భద్రా నదీ ప్రాంతాలు, మరియు సముద్ధ తీర ప్రాంతాలలోనె ఎక్కువ ఉన్నారు. మిగతా ప్రాంతాలలో వీరి జన సంఖ్య చాల తక్కువ. వీరు చేపలు పట్టడం తప్ప మరే పని చేయలేరు. తీర ప్రాంతాలలో వుండే బెస్తలకు దిన దిన గండం నూరేళ్ల వయస్సుగా బ్రతుకీడుస్తున్నారు. వారి వృత్తి ప్రాణాలతో తెలగాటమే. వీరు ఆర్థికంగా చాల వెనుక బడిన కులంవారు. చేపలు పట్టే పడవలు, బోట్లు లక్షలాది రూపాయల విలువ చేస్తాయి. వాటిని వీరు కొనలేరు. పెద్ద ఆసాములు పడవలను కొని బెస్త వారికి అద్దెకిస్తుంటారు. వీరి అద్దె విధానము వైవిధ్యంగా వుంటుంది. పడవకు రోజుకింత అని గాని, లేదా నెలకింత అనిగాని అద్దె వుండదు. ఒక సారికి ఇన్ని చేపలు ఇవ్వాలి అని నిబందన వుంటుంది. అదే ఆ పడవకు అద్దె. వారికి ఎన్ని చేపలు దొరికినా అద్దె చేపలు పోగా మిగిలిన చేపలు బెస్త వారికి చెందు తాయి. చాల సార్లు అద్దెకు ఇవ్వాల్సిన చేపలు కూడా దొరకవు. ఇలా ఎక్కువ సార్లు వారికి తగిన ఫలితము దొరకదు. కొందరు చిన్న చిన్న పడవలలో చేపల వేటకు వెళ్లతారు. అవి చాల దూరం ప్రయాణించలేవు. కనుక అధికంగా చేపలు దొరకవు అంత దూరం పెద్ద పడవలే వెళ్లగలవు. అదృష్త వశాత్తు ఎప్పుడైనా పెద్ద చేపలు ఎక్కువగా దొరికితే బెస్త వారి పంట పండినట్టు కాదు. మధ్యలో దళారులుంటరు. చేపలను వారికి అమ్మాల్సిందే. పట్టిన చేపలను దాచుకొని నిదానంగా అమ్ముకుందామంటే కుదరదు. ఏ రోజుకారోజు వాటిని అమ్మేయాల్సిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు ఎంతో కొంత ధనం ముట్ట జెప్పి ఆ చేపలను తమ స్వంతం చేసుకొని తగు రీతులో వాటిని ఎగుమతి చేసి అధిక మొత్తంలో ధన సంపాదన చేస్తున్నారు. బడుగు జీవులైన ఈ బెస్త వారు తమ వృత్తిని వదులుకోలేక వేరె పని చేయలేక అలాగె బ్రతుకీడుస్తున్నారు.



జూలై, ఆగస్టు నెలల్లో చెరువుల్లో చేప పిల్లన్ని వదిలి మార్చి నుంచి మే వరకు చేపలను పడతారు. దళారీలు చెరువులను గుత్తకు మాట్లాడుకొని ఆదాయాన్ని గడించటంవల్ల మత్స్యకారులు నష్టపోతున్నారు. చెరువులో విత్తనాలు చల్లే సదరు కాంట్రాక్టర్‌ చేపలు పట్టే సమయానికి మత్స్యకారుల వద్ద కొనుగోలు చేస్తాడు. వాటిని ఆ వ్యక్తి మార్కెట్‌లో ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. దళారి వ్యవస్థ లేనిపక్షంలో మత్స్యకారులు నేరుగా చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయించి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సొసైటీలకు విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఫలితంగా వృత్తిదారులు స్వయంగా విత్తనాలు వేసి చేపలు పట్టుకొని మార్కెట్‌కు తరలించి విక్రయించడం ద్వారా లాభాన్ని గడించే అవకాశం లభించింది. వాగులలో ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. 105 రూపాయల ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు చేపలు పట్టుకొనే వీలు కల్పించింది. కట్ల, రౌ, బంగారు తీగ చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. చేపల మార్కెటింగ్‌కు గాను ఈ మధ్య మహిళలకు సబ్సిడీపై బైక్‌లను అందించారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో చిత్తూరు, పశ్చిమ గోదావరి మెదక్‌ జిల్లా ల్లోగురుకుల పాఠశాలలున్నాయి.వృత్తిదారులు చనిపోతే రెండు లక్షలు భీమా ఇస్తున్నారు. మహిళా మత్స్యకారులు కూడా మత్స్య మిత్ర గ్రూపుల నుంచి రుణాలు, నైలాన్‌ వలలు, ఐస్‌ బాక్స్ లు తదితర పరికరాల కోసం రుణాలు పొందారు.మహిళా మత్స్య ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. తక్కువ నీటిలో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేసే మెళకువలు నేర్పించాలని, కేరళలో చేపడుతున్నట్లుగా ఇక్కడ కూడా చేపల పచ్చళ్లు, ఫ్రై తదితర వెరైటీ వంటకాలు తయారు చేసి విక్రయించేలా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరికైనా చేపలు అవసరమైతే డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఎదగాలని వృత్తి దారులు భావిస్తున్నారు.



12. సాలె వారు:

సాలె వరి వృత్తి మగ్గం పై బట్టలు నేయడము. వీరి పరిస్థితి కూడా చాల అద్వాన్నంగా ఉంది. (వివరాలు సేకరించ వలసి వున్నది)



13. దొమ్మరి:

దొమ్మరి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి. వీరిలో కొందరు వీధిలో సర్కస్ ప్రదర్శనలు ఇచ్చి సంపాదించేవారు. ఒకనాడు పడుపు వృత్తే వీరి జీవనాధారం. వారికి సంబదించిన సామెత. " చెప్పేది సారంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు" వెళ్ళటం లేదు. కనిగిరి పట్టణ శివారు ప్రాంతంలో దాదాపు వంద కుటుంబాల దొమ్మరులు నివసిస్తున్నారు. ఆడవారు ఇళ్ళల్లో పాచి పనులు, మగవారు చెక్క దువ్వెనలు, ఈరిబానులు అమ్ముకోవడం, గేదెల కొమ్ములు కోయడం, పండ్ల బండ్లు వేసుకొని కాయలు అమ్ముకుంటున్నారు. అడవి ప్రాంతంలో తెచ్చుకున్న కరల్రతో చెక్క దువ్వెనలు, ఈరిబానులు తయారు చేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. దువ్వెనల తయారీ పందుల పెంపకం వీరి కుటీర పరిశ్రమలు.వారు ఒళ్లు గగుర్పొడిచే విద్యలు ప్రదర్శిస్తారు. సన్నటి తాడుపై నడచి అబ్బు రపరుస్తారు. బిందె మీద బిందెలు పెట్టి వాటిపైన సాహసాలు చేస్తారు. గడ ఎక్కి ఊరికి శుభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈనాటి జిమ్నాజియానికి తీసిపోని విన్యాసాలు చేస్తారు దొమ్మరులు. దారిన వెళ్లేవారు కూడా కాసేపు నిలబడి వీరి ప్రదర్శన చూసి సంతోషంగా తమకు తోచినంత ఇచ్చి వెళ్లేవారు. దొమ్మర కులస్థులు నిత్యసంచారులు. చివరికి వారుండే గుడిసెలను కూడా గాడిదలపై వేనుకుని ఊరూరా తిరుగుతారు. వీరు ఇంట్లో వస్తువులతో పాటు మేకలు, కుక్కలను కూడా తమ వెంట తీసుకెళ్లి ముందుగా ఊరి చివర దిగుతారు. తర్వాత ఊరి పెద్ద వద్దకు పోయి ఆ గ్రామంలో ప్రదర్శన ఇస్తామని చెబుతారు. దొమ్మరులు గ్రామంలో అడుగుపెడితే శుభసూచకమనే భావన ఉండేది. ఎవ్వరూ అడ్డు చెప్పేవారు కాదు. పదేళ్లువచ్చేసరికి వీరు తమ పిల్లలకు శిక్షణ ఇస్తారు. గడ ఎక్కడం, దూకటం, పల్టీలు కొట్టటం, బిందెల మీద బిందెలు పెట్టి దానిమీద మనిషిని నిల బెట్టటం వంటివి సాధన చేయిస్తారు. విన్యాసాలు ప్రదర్శించే ఒక బృందం తయారు కావాలంటే కనీసం ఎనిమిది మంది ఉండాలి. వీరంతా గ్రామ కూడలిలోనో, చావిడి దగ్గరో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దొమ్మరులు గ్రామానికి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం కనుక వర్షాలు కురవకపోయినా, పం టలు పండక పోయినా దొమ్మరవాళ్లను ఆ గ్రామా నికి ప్రత్యేకంగా పిలిపించుకుంటారు. దొమ్మర ఆడపడుచుతో వ్యవసాయ భూముల్లో ప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. వేపాకు, పసుపు, బియ్యం కలిపిన మూటను నడుముకు కట్టుకున్న దొమ్మర మహిళ గడ ఎక్కుతుంది. దాదాపు 40 అడుగుల ఎత్తున్న ఈ గడపై ఆమె విన్యాసాలు చేస్తూ వడిలో ఉన్న బియ్యాన్ని వ్యవసాయ భూములపై విసురుతుంది. బావుల దగ్గర కూడా ఆమె ఓడు బియ్యాన్ని చల్లుతుంది. ఈ తంతు ముగిశాక వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. విన్యాసాలు చేసే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడితే వెంట తెచ్చుకున్న చెట్ల పసర్లతో వైద్యం చేసుకునేవారు.



14. ఇతర ఆశ్రిత జాతులు:

పల్లె వాసుల పై ఆధారపడిన యాచక వృత్తి వారు అనేకం. అందులో ముఖ్యమైనది బుడబుక్కల వారు. వీరి వేష ధారణ చాల గంబీరంగా వుంటుంది. నొసటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని కోటు వేసుకొని, మెడపై అటు ఇటు కింది వరకు వేలాడుతున్న చీరలను ధరించి, కుడి చేతిలో చిన్న డమరుక / బుడబుక్కను ధరించి 'డబ డబ' వాయిస్తూ అంబ పలుకు జగదంబా పలుకు కంచి లోని కామాక్షి పలుకు, కాసీలోని విశాలాక్షి పలుకు అంటూ ఆయా గృహసుని కష్టాలను ఏకరువు పెడ్తాడు. ఇదిగో అంబ పలుకుతున్నది అంటూ తన బుడబుక్కను వాయిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఎవేవో మాయ మాటలు చెప్పి వాటిని 'అంబ' పలుకుతున్నదని నమ్మిస్తాడు. వాటి నివారణకు మంత్ర తంత్రాలను కడతానంటాడు. వాడి మాటలకు లొంగి పోయిన పల్లెవాసులకు కొన్ని కష్ట నివారణ మార్గాలను చూసిస్తూ యంత్రాలను, తంత్రాలను ఇచ్చి ఇంటిలో వెన్ను గోడులో గాని, గడప పై గాని కట్టమని ఇస్తాడు. ప్రతి ఫలంగా కొంత దాన్యాన్ని పొందు తారు. వీరి ప్రస్తావన ఈ కాలంలో చాల అరుదుగా ఉంది. ఇంకా పూర్తిగా మాసి పోలేదు .



15. కొండ రాజులు:

కుర్రు తొకన్నలు. వీరు కూడా గంబీరమైన ఆహార్యముతో వుంటారు. భుజాన జోలితో, ఎర్రటి వస్త్రాలు ధరించి, నెత్తిన తలపాగతొ, అందులో నెమలి పించం పెట్టి రాజసం ఉట్టిపడేలా వస్తారు. కుర్రో కుర్రు.... కొండ దేవరా పలుకు, ..... అంటూ పల్లె వాసులకు కల్ల బొల్లి కబుర్లు చెప్పి వారిని తమ మాయ మాటలతో వశీకరణ చేసుకొని, వారి కష్టాలకు నివారణోపాయాలు చెప్పి కొంత ధాన్యం ప్రతి ఫలంగా పొందు తారు.



16. మొండోళ్లు:

వారు ఏరైతు ఇంటి ముందు వాలినా వారు బిచ్చం వేసినంత వరకు వెళ్లరు. అందుకె వాళ్లను మొండోళ్లు అని అన్నారు. వారి నుండి పుట్టినదె ఈ సామెత మొండోడు రాజు కన్న భలవంతుడు. వారు రైతు ఇంటి ముందు భయాన దృశ్యాలను ప్రదర్సిస్తాడు. రక్త సిక్తమైన పసి పిల్లవాన్ని చేటలో పెట్టి దాన్ని ఇంటి ముందు పెట్టి పెద్ద కొరడాతో తనను తాను కొట్టు కుంటూ నానా భీబచ్చం చేస్తారు. అతని భార్య తన మెడకు వేలాడు తున్న ఒక వాయిద్యంతో వింత వింత శబ్ధాలు చేస్తూ పాటలు పాడుతుంది. ఈ ఘోర కృత్యాలను భరించ లేక గృహస్తు రాలు ఎంతో కొంత వడ్లు గాని బియ్యం గాని బిచ్చం వేస్తుంది. వారు అక్కడి నుండి ప్రక్క ఇంటి కెళుతారు.



వాయిద్య సహకారంతో పాటలు పాడి యాచించె రైతుల పైన, వారి పొలాల పైన ఆధార పడి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రతికే అనేక ఆశ్రిత జాతుల వారి ఆరోజుల్లో చాల సంతోషంగానె కాలం గడెపేవారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇటు రైతులు అటు రైతులపై ఆధార పడి బ్రతికే ఆశ్రిత జాతులు రైతులకు పరాయి వారుగానె మిగిలిపోయారు. స్వంత ప్రాంతంలో వున్న దళితులకు రైతులకు ఆనాడు వున్న అవినాబావ సంబంధం ఇప్పుడు ఎంత మాత్రము లేదు. ఇది సాంఘిక పురోగమనమో, తిరో గమనమో.



17. చిలక జోస్యం:

చిలక ఒక కార్డు తీస్తున్నది.

వీరు ఒక పంజరంలో చిలకను పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ జోస్యం చెపు తుంటారు. వీరు మంచి మాట కారులు. వీరిని ఎవరైన తమ ఇంటికి పిలిస్తే వెళ్లి కూర్చొని చిలక పంజరాన్ని కింద పెట్టి సుమారు ఒక ఇరవై కవర్లను వరుసగా పేర్చి పెట్టటాడు. ప్రతి కార్డులో ఒక దేవతా బొమ్మ మరొక కార్డుపై జ్యోతిషానికి సంబంధించిన కొన్ని మాటలు వ్రాసి వుంటాయి. జ్యోస్యం చెప్పించు కో దలచిన వాని పేరు అడిగి పేరును బట్టి అతన నామ నక్షత్రము చెప్పి దానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పుతాడు. ఆ తర్వాత పంజరం తలుపు తీసి చిలకను బయటకు పిలుస్తాడు. ఆ చిలక వచ్చి కొంచెం అటు ఇటు తిరిగి అక్కడ పరిచిన ఇరవై కవర్లలోనుండి ఒక కవరును తన ముక్కుతో తీసి బయట పడేస్తుంది. దానిని జ్యోతిష్కుడు తీసి అందులోని దేవతా బొమ్మని చూపి జరిగినవి, జరగబోయే విసేషాలను ఏకరువు పెడతాడు. తర్వాత మరొ కార్డులోనివిషయాన్ని చదివి కొన్ని లెక్కలు వేసుకొని సమస్యకు కొన్ని పరిష్కారా మార్గాలను సూచిస్తాడు.



18. యాచక వృత్తి వారు:

చాల కాలం క్రితం జాన పద కళారీతులకు బాగా ఆదరణ వున్న రోజుల్లో ఆయా కళాకారుకలు ప్రజల్లో మంచి గౌరం వుండేది. అటు వంటి వారిని పల్లె ప్రజలు పిలిపించుకొని వారి కళా రూపాన్ని ప్రదర్శింప చేసుకొని ఆనందించి వారికి కొంత సంభావన ఇచ్చే వారు. ఆవిధంగా వారి జీవనం గౌరప ప్రదంగా సాగేది. అలాటి వాటిలో ముఖ్యం చెప్పుకో దగ్గది.... బుర్ర కథ, ఒగ్గు కథ మొదలైనవి. కాల క్రమంలో వీరి కళకు ఆదరణ తగ్గి అంతరించి పోయే దశలో మిగిలిన ఆ కళాకారులు లేదా వారి వంశం వారు బ్రతుకు తెరువుకు వేరు మార్గము చేత గాక..... తమ వృత్తికి ఆధణ లేక, వారే తమ కళను పల్లెల్లో ఇళ్లముందు ప్రదర్శించి యాచించి తమ జీవనమును జరుపుకుంటున్నారు. బుర్ర కథలోని మాధుర్యాన్ని రుచి యేరిగిన పల్లె పద్దలు.... ఆ కళాకారుల చేత మరికొంత సేపు బుర్ర కథను చెప్పించుకొని ఎక్కువ సంభావన ఇస్తున్నారు. ఆ తరం మారితే వారికి అంత మాత్రము కూడా ఆదరణ కూడా దొరకదనిపిస్తుం.



కొన్ని జాతుల వారు కేవలము యాచనే వృత్తిగా స్వీకరించి అదే ఆధారంగా జీవించె వారున్నారు. ఇలాంటి వారిలో ఆ కుటుంబంలో అందరు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇటువంటి వారిలో కొందరు స్త్రీలు రామారి పాటలు పాడి యాచిస్తుంటారు. వారు ఎటువంటి ఆగడాలు చేయరు. గృహస్తు రాలు వారికి ఎంతో కొంత బిచ్చం వేసి పంపు తుంది. ఇంకొంత మంది వుంటారు..... వారు.. దొమ్మరి వారు వీధిలో గారిడి విద్యలు ప్రదర్శించి ఇంటింకి వెళ్లి యాచిస్తుంటారు. ఈ దొమ్మరి వారు, సంచార జాతులు. వీరు పల్లెలకు దూరంగా డేరాలు వేసుకొని తాత్కాలికంగా నివాసం వుంటారు. వీరు రెండు కర్రల మధ్య ఒక దారం కట్టి చిన్న పిల్లల చేత దాని మీద నడిపించడం, వారి చేతనే వింతైన కుప్పి గంతులు వేయించడం, ఇలా కొన్ని ప్రదర్శనలిచ్చి ఇటింటికి వెళ్లి యాచించడం వారి ప్రధాన వృత్తి. వీరి ఉప వృత్తి ''వ్వబిచారం'' వీరి నుండి పుట్టినదే ఈ సామెత '' చెప్పేవి సారంగ నీతులు.,.. దూరేది దొమ్మరి గుడిసెలు''. ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గినా పూర్తిగా మాసి పోలేదు. ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో కన్నా జన సంఖ్య ఎక్కువగా వున్న వారంతపు సంతలలో ఎక్కువ. ఆ తర్వాత చెప్పుకో దగ్గ యాచకులు.



19. పాముల వాళ్ళు:

వీరు రైతు ఇంటి ముందు.... తమ బుట్టలో వున్న పాములను బయటకు తీసి పాముల బుర్ర వూదుతూ నాగు పాములను ఆడిస్తుంటారు. ఈలాంటి వారికి బిచ్చం తప్పని సరిగా వుంటుంది. ఈ పాముల వాళ్ళు... చెవిలో చీము కారుతున్న చిన్న పిల్లలకు పాము తోకను చెవిలో తిప్పితే చీము కారడం పోతుందని చెప్పి అలా చేసి కొంత ధాన్యాన్ని ఫలితంగా పొందు తారు. ఇంకా కొంత మంది ఎలాంటి విద్యలు ప్రదర్సించ కుండా కేవళం తమ కష్టాలను చెప్పుకొని యాచించె వారు కొందరుంటారు. అలాంటి వారికి తప్పని సరిగా బిచ్చం లభిస్తుంది. ఇలా రైతుల మీద ఆధార పడిన యాచకుల సంఖ్య చాల ఎక్కువే. ఆ రోజుల్లో రైతులు సుభిక్షంగా వున్నందున ఇలాంటి వారి జీవనానికి డోకా వుండేది కాదు. ఆరోజుల్లో యాచకులు ఎవరైనా ఇంటి ముంకు వస్తే ఎంతో కొంత బిచ్చం లభించేది. ఇది యాచకుల వృత్తి నైపుణ్యం కాదు. రైతుల, రైతు మహిళలు ఔదార్యమే ముఖ్య కారణం. ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గింది. రైతులే దీనావస్థలో వుంటే వీరి సంగతి పట్టించుకునే వారెవరు? ఇలాంటి వారు రైతుల పరిస్థితి గ్రహించి నగరాల పై బడ్డారు. గతంలో ఇలాంటి వారి ఆటలు పట్టణాలలో కొంత కాలం సాగింది. ఇప్పుడు పట్టణాలలో కూడా వీరిని ఆదరించే వారె కరువయ్యారు. పట్టణాలలో యాచలకు అన్నం పెడితే తీసుకోరు. వారికి డబ్బులు మాత్రమే కావాలి. చాలమందికి ఇది వృత్తి మారింది. ఈ యాచకులకు ఒక వ్వవస్త ఉంది. వీరి వెనుక కొంత మంది వుండి వారిని ప్రతి నిత్యం రద్దీగా వుండే స్థలానికి చేర్చి.... సాయంకాలం తిరిగి తీసుకెళ్లుతారు. వారి అన్న వస్త్రాలు ఆ నాయకులే చూసు కుంటారు. ప్రతిఫలంగా వారు యాచనలో సంపాదించిన దానిలో కొంత తీసుకొని మిగతా వారికి ఇస్తారు. ఈ వ్యవహారము పెద్ద పెద్ద పట్టణాలలోనె జరుగు తుంది. ఈ వ్వవస్థను ప్రభుత్వం ఏనాడో నిషేధించి యాచకులకు పునరావాసము కల్పించినా వారు అక్కడ వుండక నాయకుల అండలోనే జీవనం సాగిస్తున్నారు.



20. బుడబుక్కల వారు:

బుడబుక్క కళాకారుల వృత్తి భిక్షాటనమే అయినా వారి పట్ల జానపదుల్లో గౌరవాదరాలుండేవి. వారు గ్రామాల్లో పదాలు చెప్పుకొంటూ సంచరిస్తే తమకు శుభం జరుగుతుందని ఆనాటి గ్రామస్తుల నమ్మకం. అందుకే వాళ్ళను కసురుకోకుండా దానధర్మాలు చేసేవారు. బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్‌’ అని డమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.



21. వీదిగారడీవారు:

వీరు ఎక్కువగా దొమ్మరి వారై వుంటారు. వీరు కుటుంబంతో సహా పల్లెల్లో తిరుగుతు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. వీరు చేసె విన్యాసాలలో ముఖ్యంగ చెప్పుకో దగ్గవి..... అటు ఇటు కర్రలు పాతి వాటిమధ్యన ఒక దారాన్ని కట్టి ఆ దారంపై చిన పిల్లలను నడిపించడము., ఒకడు తన నడుంకు కట్టుకున్న గుడ్డ ఆధారంగా పొడవాటి కర్రను ఆనించి దానిపై చిన పిల్లలను ఎకించి విన్యాసాలు చేయించడము., ఇనుప రింగులలో తలను కాళ్ళను ఒకేసారి దూర్చి బయటకు రావడము, పిల్లలుచే శారీరిక విన్యాసాలు చేయించడము ఇలా అనేక విన్యాసాలు చేసి చివరకు ప్రదర్శన మధ్యలో గుడ్డ పరిచి, లేదా ప్రేక్షకుల వద్దకు వెళ్ళి యాచిస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా సంతలు, జాతరలు, ఇతర వుత్సవాలు జరిగే చోట ప్రదర్శిస్తుంటారు.



22. బుర్రకథ కళాకారులు:

ఒక ఇంటిముండు గంట వాయిస్తూ నిలబడ్డ దాసరి

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

Monday, January 14, 2019

త్రిపురనేని రామస్వామి


త్రిపురనేని రామస్వామి

 బాల్యంలో పందుంపుల్ల కోసం చెట్టుదగ్గరకెళ్లినపుడు అక్కడ వెండ్రుకలూ నిమ్మకాయలూ వంటివి కనిపిస్తే చిరుతిండికి పనికొస్తాయని డబ్బుల్నీ,ఆడుకోడానికి పనికొస్తుందని వేపబెత్తాన్ని తీసుకుని అందరూ నోరెళ్లబెట్టేలా చేసిన ఆకతాయి, తాను మిఠాయి తింటుంటే "నాకూ కొనిపెట్టవా ? " అని జాలిగా అడిగిన బ్రాహ్మణబాలుడికి సరే పోనీ పాపం అని కొని పెడుతుంటే ఆ బాపనకుర్రాడు "నువ్వు డబ్బులు మాత్రమే ఇవ్వు.ఆ మిఠాయిని తాకవద్దు" అంటే క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టిన  కుర్రాడు,బడికి ఆలస్యంగా ఎందుకొచ్చావని అడిగిన మాస్టారికి  "స్నానం చేసి రావడం వల్ల " అని సంజాయిషీ ఇచ్చి " ఏమిటి ? అబ్రాహ్మణులకు కూడా ఉదయపు స్నానమా ! అన్నారని మాస్టారిని ఎదిరించి, ఫలితంగా పాఠం అయ్యేవరకూ నిలబడి ఉండాల్సొచ్చిన ధైర్యశాలి ,"అందరూ సమానులు కాదా ? బ్రాహ్మణుల ఆధిక్యత ఏమిటి ? అబ్రాహ్మణుల అల్పత్వం ఏమిటి ? "అనే ప్రశ్నలు బాల్యంలోనే సంధించిన హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణాజిల్లా అంగలూరు లో చలమయ్య రామమ్మ దంపతులకు 15-1-1887లో జన్మించాడు.

ఈయన ఇంగ్లండులో బారిష్టరు చదివి బందరు,బెజవాడలలో వకీలుగా పనిచేసి చివరకు తెనాలిలో స్థిరపడ్డారు. పురాణాలమీదా  బ్రాహ్మణసంప్రదాయాల మీదా ( బ్రాహ్మణులమీద కాదు ) తిరుగుబాటు చేశారు. న్యాయవాదిగా కోర్టులో ఒక సాక్షిని నువ్వు అని సంబోధించినందుకు న్యాయాధిపతి " అతను బ్రాహ్మణుడు" ఏకవచనం కూడదు "మీరు" అని సంబోధించాలి ' అంటే " నాకు ఏకులమైనా ఒక్కటే "  అని టక్కున సమాధానమిచ్చారు . త్రిపురనేని కోపం బ్రాహ్మణుల మీద కాదు.వారి ఆచారాలమీదే !కాబట్టే ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఒక బ్రాహ్మణ యువకుడికి ఉద్యోగం ఇప్పించమని చీటీ రాసి పంపిస్తే తెనాలి మున్సిపాలిటీలో ఉద్యోగం వేయించారు. మూడాఛారాలను ఎదుర్కోడానికి యువజన సంఘాన్నిస్థాపించారు.రాముడు శంభూకుడి శిరస్సు ఖండించిన ఘట్టాన్నిచదివి కంపించిపోయి తన ఇంటిపేరును 'శంభుకాశ్రమం' గా మార్చారు. *రాముడు దేవుడుకాదనీ,పురాణాలు కట్టుకథలనీ,భగవద్గీత కల్పితమనీ ,భారత రామాయణాలూ ధర్మశాస్త్రాలూ ఒకవర్గం తన అధికారం కోసం రాసిన గ్రంధాలనీ ప్రచారం చేశారు.* మారీసుపేటలో బ్రాహ్మణులు ఒక మేకను తెచ్చి యజ్ఞం చేయాలనుకుంటే దాన్ని ఈయన భగ్నం చేశారు. *వేదాలు దైవం అయితే వాటిని ఒక రాక్షసుడెలా మింగ గలిగాడు? అని ప్రశ్నించారు?'వేదాలు ఎలా పుట్టాయో ,ఋషులదగ్గరకెలా వచ్చాయో వేదాల్లోనే ఉందా !చక్కని కథ.పిల్లలకు చెప్పడానికి బాగుంటుంది' అని ఎద్దేవా చేసారు.* మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. *"శుభా శుభ కార్యాలన్నీ బ్రాహ్మణులే చేయించాలని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు"*  అన్నారు.

*పెళ్లి అనేది వ్యక్తిగత విషయం.దేవుడికీ మతానికీ సంబంధం లేదు.పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తం రాముణ్ణి అడవులపాలు చేసిన సంగతి మనకు తెలుసు.లగ్నాలు కుదరడం లేదని రోహిణీ కార్తెలో ఏ రెండుజాములకో పెళ్లిళ్లు కుదిర్చి అందరికీ చీకాకు కల్పించడం ఉచితమా?"*  అంటూ పెళ్లి విధానాలను వివరిస్తూ " వివాహ విధి " అనే పుస్తకం రాశారు.ఇది ఆ రోజుల్లో ప్రజాభిమానాన్ని పొందింది.భగవంతుడికి సంస్కృతభాషే ఇష్టమని తలిచే ఈ మూఢలోకానికి పెళ్లి మంత్రాలు తెలుగులో కూడా ఉండవచ్చని ఎలాచెప్పాలి?అన్నారు.ఆయన చేసిన పెళ్లిళ్లలో "అగ్నిసాక్షిగా " అని కాక "పెళ్లిపెద్దల సాక్షిగా " అనిప్రమాణం చేయించేవారు.

*పురాణాలు వ్యాససృష్టి కాదనీ అవన్నీ కల్పితాలనీ సూతుడు తనకు చెప్పినట్టు "సూతపురాణం" లో రాశారు.* విశ్వనాథవారు "వేనరాజు"నాటకంలో వేనరాజుకి ఘోరం తలపెట్టారని విమర్శించి "ఖూనీ" అనే నాటకాన్నిరచించారు.భగవద్గీతకు అధిక్షేపణగా బ్రహ్మనాయుడు బాలచంద్రునికి బోధించినట్టుగా తానొక భగవద్గీతను రాశారు.'కుప్పుసామి' అనే ద్రావిడుల దేవుడిపేరు మీద ఒక నీతిశతకాన్ని రచించారు.చచ్చిపోయిన జీవి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడని చెబుతూనే మళ్ళీ పిండాలు పెడతామని పిలవడం ఎందుకు? అని ప్రశ్నించారు. *1929లో ఒంగోలు తాలూకా కాకర్లపాడులో  పితృకార్యంలో తగిన దక్షిణ ఇవ్వలేదని  ఒక వైశ్యుడిని బ్రాహ్మణులు చితగ్గొడితే బాధితుడిపక్షాన వాదించి వారికి జరిమానా వేయించారు.*

*త్రిపురనేనికి సమయ స్ఫూర్తీ చమత్కారం సహజంగా అలవడ్డాయి.* ఒక భక్తుడు ఆయన్ని " మీరు నాస్తికులుకదా ! దేవుడొక్కడే అనే ఆస్తికుల ఆర్య సమాజంలో ఎలా చేరారు?" అని ప్రశ్నిస్తే "  33 కోట్ల దేవతలున్న హిందూసమాజంవారిని ఆర్య సమాజం వారు ఓడించేస్తే ,ఆర్య సమాజం వారి ఒక్కదేవుడితో నేను కుస్తీపట్టి ఓడిస్తాను" అన్నారు. *ఎవరైనా వచ్చి " మా దేవుడికి రెండుపువ్వులివ్వండి" అంటే " కావాలంటే మీ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ చెట్టుకింద పెట్టండి.పువ్వులు చెట్టుకి ఉంటే అందం కానీ కోసేస్తే ఏముంటుంది? "*  అనేవారు. ఒక పురోహితుడాయన్ని " మీకు మంచితనంతో పాటు దైవ చింతన ఉంటే బాగుండేది" అంటే " చింతా ,సీమ చింతా తెలుసు.ఈ దైవచింత గురించి నాకు తెలియదు.అని చమత్కరించారు.ఒక శాస్త్రిగారాయన్ని *'రాముణ్ణి విమర్శించే మీరు రామస్వామి అనేపేరెందుకు పెట్టుకున్నారు?' అనడిగితే  "స్వామి అంటే మొగుడు అని అర్ధం.అంటే నేను రాముడికి మొగుణ్ణి "అన్నారు* .ఒక పండితుడు *"ధర్మము కృతయుగంలో నాలుగు పాదాల నడిచింది" అంటే " ఆ కాలంలో అందరూ పశుప్రాయులన్నమాట"*  అన్నారీయన.
.లండన్ లో ఒక స్త్రీ ఆయన్ని " మీరు టోపీ ధరిస్తే మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా! " అంది.వెంటనే ఈయన "మీరు చీరె, రవికె ధరిస్తే మంచి రాకుమారుణ్ణిచ్చి పెళ్లి చేస్తాను "అన్నారు. *గాంధీ టోపీ అంటే ఆయనకి అసహ్యం కలగడానికి కారణముంది. గాంధీగారు దక్షిణాఫ్రికాలో జైలులో ఉన్నపుడు తెల్లవారికీ నల్లవారికీ భేదం తెలియడంకోసం సూపరింటెండెంట్ గాంధీ గారికి తెల్ల టోపీ తగిలించాడు.జైలునుంచి వచ్చాక కూడా గాంధీ దాన్ని కొనసాగించారు.* త్రిపురనేని శాకాహారి.ఓ విందులో తాపీ ధర్మారావుగారాయన్ని" మీరు తృణభక్షకులు(grass eaters) " అన్నారు.వెంటనే ఈయన "మీరు శవభక్షకులు" అని బదులిచ్చారు.

ఇతిహాసకథల్లోని కల్పనలపై కూడా త్రిపురనేని ధ్వజమెత్తారు. రాజరాజ నరేంద్రుడు,చిత్రాంగి కథ మాళవదేశానికి సంబంధించిందనీ కవులు దీన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన భారత కృతికర్త రాజరాజనరేంద్రుడికి అంటగట్టారన్నారు.కృష్ణుడి మేనత్త రాధ నందుని చెల్లెలనీ ,అతనితో సయ్యాటలాడిన రాధ వేరని వివరాలతో చెప్పారు.అలాగే చంద్రవంశపు దశరథుడి కుమార్తె శాంతను ,సూర్యవంశపు రాజైన రాముడి తండ్రి దశరథుడికి కూతుర్నీ,సీతకు ఆడబిడ్డనూ  చేశారన్నారు.

త్రిపురనేనికి  జాతీయాభిమానం తక్కువేమీ కాదు.ఐర్లాండ్ వెళ్ళినపుడు ఒక ఆంగ్లేయుడు 'భారతీయులది దాస్యబుద్ధి ' (slavish mentality)అన్నాడని రొట్టె కోసే కత్తిని పైకెత్తి 'మళ్ళీ ఆ మాట అంటే నీ నాలుక కోసేస్తాను'అన్నారు.ఆ తెల్లవాడు నోరెత్తితే ఒట్టు.బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల ప్రభావంతో "రాణాప్రతాప్ " అనే నాటకాన్ని, *ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో " వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ* .వంటి గేయాలనూ రాశారు.

*ఆంద్ర మహాసభ సభ్యులచే "కవిరాజు " అనే బిరుదు పొందిన త్రిపురనేని16-1-43న మరణించారు.తాను చెప్పిందే నమ్మమని ఆయన ఎవరికీ చెప్పేవారు కాదు."చదవండి.ఆలోచించండి.మీరే ఒక నిర్ణయానికి రండి"*  అనేవారు.అందుకే ఆయన కుమారుడు *గోపీచంద్ తన 'అసమర్ధుని జీవయాత్ర' నవలను "ఎందుకు? అని ప్రశ్నించడం నేర్పిన నాన్నగారికి "* అంకితం అన్నారు.

పురాణాలు,హిందూ సంస్కృతి, ఛాందసభావాలపై  తీవ్రంగా దాడిచేసి,బ్రాహ్మణత్వ ఆధిక్యతను నిరసించి గొప్ప హేతువాదిగా ప్రశంసలందుకున్న త్రిపురనేని స్వీయకులాభిమానం ప్రదర్శించి అపఖ్యాతి మూటకట్టుకున్నాడు.తమకులంవారు గౌరవం పొందాలంటే విద్యావంతులవ్వాలనీ,తమ అభిప్రాయప్రకటనకోసం తమ కులానికో పత్రిక ఉండాలనీ చెప్పడమే కాదు కమ్మవారు క్షత్రియులు అనే వింతవాదాన్ని కూడా తీసుకొచ్చాడు. *ఇలాంటి పరిమితులను పక్కనపెట్టి హిందూ మతోన్మాదం విజృంభిస్తున్న ఈనాడు యువతరం త్రిపురనేని సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ( త్రిపురనేని రామస్వామి జీవితం సాహిత్యం )

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534


Friday, January 4, 2019

జానపద కళా రక్షకులు - గోసంగివారు

జానపద కళా రక్షకులు - గోసంగివారు

గోసంగి కులం వారు తమ జీవనోపాధికి తంబూరను వాడుతారు. హార్మోన్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామాగ్రిని వాడుతారు. రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం, జగదేక వీరుని కథ, కాంభోజ రాజు కథ, బాలనాగమ్మ, ఆధునికంలో అల్లూరి సీతారామ రాజు, అంబేడ్కర్‌, గాంధీ. నెహ్రూల బుర్ర కథలను చెప్పుకుంటూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా జానపద కళల సంరక్షకులుగా గోసంగి కులంవారు సమాజానికి హితోధికంగా దోహదపడుతున్నారు. ఉత్పత్తి కులాలను సంతోషపెట్టే కళల్లో జానపద కళలు ప్రధానమైనవి. బహుజన కులాలను ఆశ్రయించి అనేక ఆశ్రీత కులాలు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఈ సాంస్కృతిక పరమైన వ్యవస్థ కొనసాగుతోంది. ఇలాంటి ఆశ్రీత కులాలు- మరుగున పడిన మానవ విలువలు కలిగిన గొప్ప సంస్కృతిని కాపాడుతున్నాయి అనడంలో సందేహం లేదు. వీరిలో వివిధ రకాల జానపద కళలను ఆశ్రయించి బతికే కులం కాని కులం గోసంగి కులం. వీరు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగానూ, రాయల సీమలో మధ్యమంగానూ, ఆంధ్రా ప్రాంతంలో తక్కువగానూ ఉన్నారు. తెలంగాణలో గోసంగి కులం పేరు తో ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే ఇంచుమించు లక్ష కుటుంబాలు జీవ నం కొనసాగిస్తున్నాయి. రాయలసీమ, ఆంధ్రాలో వివిధరకాల ఆశ్రీత కులాలకు చెందిన పేర్లతో వీరు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గోసంగి కులంగా జీవిత పయనాన్ని కొనసాగిస్తున్న వారి చరిత్ర చాలా దుర్భరంగా ఉంది. వీరి పరిస్థితులు అతి హీనమైనవిగా గోచరిస్తు న్నాయి. ఈనాటికి కూడా వీరు భిక్షాటన చేయక తప్పడం లేదు. తినటా నికి తిండిలేక, ఉండటానికి గూడు లేక, కట్టుకోటానికి బట్టలేక- అనగా కనీస అవసరాలు ఏ మాత్రం లేకుండా అతి దయనీయ మైన స్థితిలో ఉన్నారు. విశేషమేమంటే గోసంగిలు వివిధ రకాల జానపద కళల ద్వార బిచ్చమెత్తుతూ… ఎత్తుతూ… చివరకు తాము ఏ కులానికి చెందిన వారమో తమకే తెలియని స్థితిలో దయనీయమైన జీవనాన్నికొనసాగిస్తున్నారు. గోసంగి కళాకారులను ‘గోసం వారని, గాసం వా రని, గోసికె వారని, గుడిసెల వారు అని, శారద కాండ్లు, కాటి పాపల వారని, బహురూపుల వారని, బాలసంతుల వారని, బుడిగె జంగాలని, బవనీల, బైండ్లవారని- ఇలా అనేక పేర్లతో వీరిని పిలువడం వ్యవహారం లో ఉంది. తాము ఏదైతే వృత్తిని స్వీక రించి జీవన ప్రధాన మార్గంగా చేసు కొని అడుక్కుంటారో వారిని అదే కుల స్థులుగా వ్యవహరించటం రివాజు. తాము జీవనం కొనసాగించే వృత్తినే కులంగా చెప్పుకుని జీవించడం వల న ఇప్పుడు ‘గోసంగి’ కులం వారు ఇ బ్బందులు పడుతున్నారు. ఏ కులమో సొంత అస్తిత్వం లేక, తాము ఏ కులం చెప్పుకోవాలో తెలియక ఈ కులాన్ని చెప్పుకోవటానికి కష్టాలు పడుతున్నారు. ఉత్పత్తి కులాల వారి ఆశీస్సులతో బతికే వీరిని ఏ ఉత్పత్తి కుల ఆశ్రీత కులంగా వ్యవహారించాలో ప్రభుత్వానికే అంతుపట్టని స్థితి. గత ప్రభుత్వం వీరిని ఎస్సీలుగా ప్రకటించింది. ఎస్సీలలో మాదిగలను ఆశ్రయించే పెద్దకులం వీరిది. కానీ వీరు మాలలను ఆశ్రయించటానికి ఇష్టపడకున్నా వీరిని మాలలు తమ ఆశ్రీత కులమని అక్కునచేర్చుకుంటున్నారు. మిగతా జానపదకళలను ఆశ్రయించి విడిపోయిన గోసంగి కులాలు ఏయే ఉత్పత్తి కులాన్ని ఆశ్రయించి బిచ్చమెత్తుకుంటున్నాయో… ఆయా కులాల ఆశ్రీత కులంగా చెప్పుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గోసం గిలది హీనస్థితి, వెలివేతకు గురైన జీవితం. అంటరాని జాతి. ఊరికి ఆమడ దూరం వీరి నివాసం. అది కూడా చెట్లకింద నివాసం. దేశదిమ్మరులుగా తిరు గుతారు. సమాజంలోని వ్యక్తులకు ఉన్న విలువలు వీరికి తెలియవు. ఎందు కంటే వీరికి వందల ఏండ్ల చరిత్ర ఉన్నా ఇప్పటి వరకూ వీరికి విద్యలేదు. స్థిరని వాసం లేదు. వాటి వాసన కూడా ఎరుగరు. ఒక గ్రామానికి పరిమిమైన వారు కాదు. ఆదిమానవుని బాటలో నేటికీ పయనిస్తున్నారు. జీవనోపాధికి అనేక మార్గాలను ఏర్పాటుచేసుకోటం వీరి విద్య. వీరు నలుగురు ఒకచోట ఉండలే రు. గ్రూపులుగా విడిపోవటం వల్ల వీరి ఐక్యతకు విఘాతం కలుగుతోంది.ఏండ్ల తరబడి వివిధ రకాల జానపద కళలను అవలంబించే కులం గోసంగి కులం. వీరు బిచ్చమెత్తుకుని, పొట్ట పోసుకుంటూ అంటరానివారుగా పల్లెల్లో, పట్టణాల్లో కూడా బానిసలుగా బతుకుతున్నారు. వీరికి ప్రధానమైన వృత్తి లేదు. ఏ వృత్తిని అవలంబించినా భిక్షాటనం చేయడం పరిపాటి. అయితే ఏ వృత్తిని చేపట్టినా తమకుకూడా గ్రామాల్లో సుస్థిర నివాసం ఒకటి ఉండాలనే అవసరాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సుస్థిర పడటానికి శతవిధాల తిప్పలు పడు తున్నారు. వాటిలో కొన్నింటి పరిశీలిస్తే… ‘కొందరు కాటికాపరులుగా జాషువా రచించిన సత్య హరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను పద్యాలను ఆలపిస్తారు. ఈ పాటలను తమ సొంతంచేసుకొని, చౌరస్తాలలో నలుగురు కూడిన చోట, పండుగలు పబ్బాలు జరిగేచోట, పెళ్లిళ్లు, పేరంటాలు జరిగేచోట పాడుకుంటూ, నలుగురిని మెప్పించి, వారు తమ సంతోషంతో ఇచ్చిన కట్న కానుకలను, ఇనా ములను తీసుకొని పబ్బం గడుపుతున్నారు. అందువల్ల వీరి కుల దేవుడు పోతు రాజు అయ్యాడు. పగటి వేషాలు వేసుకుని శవాల దగ్గర అడుక్కుంటున్నారు. మరికొందరు బహురూపుల వేషాలు వేసుకొని, తుపాకీ రాముని వేషం వేసు కొని, నవ్వు పుట్టించే డంబాచారంతో యాచన కొనసాగిస్తున్నారు. దీనివల్ల వీరి కుల దేవుడు కూడా పోతురాజు అయ్యాడు. ఇంకా కొందరు బాలసంతుల వేషం వేస్తారు. ఇది వీరి జీవితంలో భిక్షాటన చేసుకోటానికి అపూర్వమైన జానపద కళ. వీరు పోతురాజు లాగా వేషం వేసుకొంటారు. ఈ కళను ప్రదర్శించేవారు గోసంగి కులంలో కొంత గొప్ప వారుగా, ఆధునిక దృక్పథం ఉన్నవారుగా, లేదా కొంత ముందంజలో ఉన్నవారిగా గుర్తిస్తారు. వీరు బుర్ర మీసాలు, భుజాల వరకు పెంచిన రింగు రింగుల జుట్టు, రంగు రంగుల దుస్తులు, ముఖానికి రాసుకున్న పసుపు, నిలువు నామాల మధ్యలో రూపాయి బిళ్లంత బొట్టు, మెడకు, మోచేతులకు, కాళ్లకు రవుతెండి కడియాలు, నడుం చుట్టూ, కాళ్లకు ఘల్లు ఘల్లున మోగే గజ్జెలు. భుజాన కావడిని వేసుకొని, చేతిలో దివిటీ లాంటి కందిలీ దీపాన్ని వెలిగించుకొని ఎడమ చేత గంట ఊపుతూ… తెల్లవారు జామున వాడ వాడ తిరుగుతూ… బిచ్చమెత్తుతారు. ప్రతీ ఇంటినుండి- బిచ్చం వేసిన తర్వాతనే ఇంకొక ఇంటికి కదులుతారు. బిచ్చం వేసిన ఇల్లు సిరిసంపదలతో తుల తూగాలని ఆశీర్వదిస్తూ… తమ జోలెలో ఉన్న పెద్ద శంఖాన్ని తీసి, దానిని ఊదు తూ విజయభేరిని తలపింప చేస్తారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి, ఇంటిల్లి పాదిని నిద్ర నుండి లేపుతారు. పాటలు పాడుతూ, బిచ్చం అడుక్కొని జీవితం కొనసాగిస్తున్నారు. ఇంకొందరు గొంగడి, డప్పు కట్టె ద్వారా ఒగ్గు కథను చెప్పే బీరన్నల వారి మాదిరిగా గొల్లలను అడుక్కొని జీవిస్తున్నారు. ఒగ్గు కథలను చెప్పుకుని గొల్ల కుర్మ ఉత్పత్తి కులాలను అడుక్కోటం సహజ క్రియగా వీరికి అబ్బింది. అందు వల్ల వీరి కుల దేవుడు దుబ్బ మల్లన్న అయ్యాడు. రాత్రంతా కథలు చెపుతూ ఇంటికో గొర్రెను, ఇంటికింత డబ్బును, ఇంటికింత ధాన్యాన్ని అడుక్కుంటారు. ఇంకొందరు తోలు బొమ్మలను ఆడిస్తూ ధాన్యాన్ని, అన్నాన్ని, బట్టలను అడుక్కొని జీవన యాత్రను సాగించేవారు నేటికీ ఉన్నారు’. గోసంగి కులంవారు తమ జీవనోపాధికి తంబూరను వాడుతారు. హార్మో న్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామా గ్రిని వాడుతారు. రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం, జగదేక వీరు ని కథ, కాంభోజ రాజు కథ, బాలనాగమ్మ, ఆధునికంలో అల్లూరి సీతారామ రాజు, అంబేడ్కర్‌, గాంధీ. నెహ్రూల బుర్ర కథలను చెప్పుకుంటూ తమ జీవి తాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా జానపద కళల సంరక్షకులుగా గోసంగి కులంవారు సమాజానికి హితోధికంగా దోహదపడుతున్నారు. వీరు అంటరాని వారుగా గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో మూడు కట్టెల ఎలవారం గుడారాలను లేదా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని తాత్కాలికంగా మకాం పెట్టే వారు. ఇక గ్రామంలోకి బిచ్చం కోసం వెళ్తారు. కింది కులాల నుండి పై కులాల వరకు అనగా ఉత్పత్తి కులాలకు చెందిన వారందరి వద్ద బిచ్చం ఎత్తు కుంటారు. ఆ గ్రామాన్ని పూర్తిగా జానపద కళలతో ముంచేస్తూ పొట్ట పోసుకుంటారు. తమకు కలిగిన సంతానాన్ని కూడా తమతోనే తీసుకవెళ్లి, తాము అవలంబించే పాటలను, కథలను నేర్పించి తమ దృష్టిని వంశ పారంపర్యంగా కొనసాగేటట్లు చేయటమే వీరికి వెన్నతో పెట్టిన విద్య.తాము బిచ్చమెత్తుకొని సంపాదించినదంతా తినడానికి, తాగడానికి, ఇంకా ఇతర వృధా ఖర్చులకు వినియోగించుకుంటారు. అంతే కాక ఏ చిన్న గొడవ వచ్చినా వాటిని పెద్దవి చేసుకొని పంచాయితీలు పెట్టుకుంటారు. తీర్మానం చేసిన పెద్ద మనుషులకు కొంత డబ్బు ఇవ్వడమే కాక, ఆ రోజు పంచాయితికీ వచ్చిన వారందరికీ తినటానికి, తాగడానికి ఖర్చు చేసే పద్దతి ఉంది. ఈ ఖర్చుఅంతా తప్పు చేసిన వారిపై పడుతుంది. విశేషం ఏమిటంటే వీరి పంచాయితీ ఒక్క పైసా లేకుండా జమానతు రూపంలో (అడ్వాన్సుగా) చీపురు పుల్లల లాంటివి పెడతారు. అగ్గిపు ల్లలను, తుమ్మముండ్లను ఇంకా ఇతరత్రా అక్కడ ఆ సమయంలో ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును తమ వైపున నిలబడిన పెద్ద మనిషి చేతిలో పెడతారు. ఒక పుల్ల ఖరీదు వంద రూపాయలు, పది చీపురు పుల్లల ఖరీదు 1000 రూపాయలుగా చెలామణి అవుతాయి. ఒక్కొ క్కరు వేయి రూపాయల జమానతు ఇవ్వాలంటే పది పుల్లలను బయానా పెడతారు. మాట మీద నిలబడతారు. పదిమంది ఎట్లా నిర్ణయం చేస్తే ఆ విధంగా మసులు కుంటారు. తప్పు చేసిన వ్యక్తి ఈ వేయి రూపాయలు సమర్పించుకోవాలి. ఈ వేయి రూపాయలు ఇవ్వటానికి వాయిదాల పద్ధతి కూడా ఉంటుంది. దీనిని దండుగ అంటారు. ఈ దండుగ వేయించిన అవతలి వ్యక్తి హీరోగా చెలామణి అవుతాడు. సంతోష పడతాడు. ఈ దండుగ పెట్టించటం వల్ల హీరోకు వ్యక్తిగతంగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అవతల వ్యక్తి చేత దండుగ పెట్టించాను అనే డాంబికం తప్ప. ఈ దండుగ రూపాయలు పంచాయితీ పెద్దమనుషులకు చేరతా యి. వాటిని దాదాపు సగం వరకు తినడానికి తాగడానికి మాత్రమే ఖర్చు చేస్తారు. ఇంకా సగం మరోసారి అవసరానికి వాడుకుంటారు. ఈ దండుగ రూపాయలు ఖర్చు చేయించటానికి ఆడవాళ్లుకూడా ఉత్సుకతను కనపరుస్తా రు. ఆడ మగ తారతమ్యం లేకుండా తెల్లకల్లు, నల్లకల్లు, సారాయి, గుడుంబా లను తనివితీరా సేవించటం వీరికి వారసత్వంగా వస్తున్న సంస్కృతిలో భాగం. జానపద కళలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల, సినిమాలు, టీవీలు, రేడియోలు రావటం వలన వీరు కళలకు దూరం అయ్యారు. వీరు ఇప్పుడు జూలు కత్తిరిం చుకొంటున్నారు. సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు. మామూలు దుస్తులనే వాడుతున్నారు. కొంతమంది చదువు కోటానికి ఉత్సుకతను కనప రుస్తున్నారు. కొంతమంది పల్లెల్లో రైతు కూలీలుగాను, మామూలు రోజువారి కూలీలుగా మారుతున్నా రు. కూలీ జీవితమైనా పరవాలేదు కానీ ఒక స్థిరనివాసాన్ని ఏర్పరచు కోడం ప్రధానంగా నేడు భావిస్తు న్నారు. ఈ నేపథ్యంలో వీరు జన జీవన స్రవంతితో పాటుగా ఉండాలని కోరు కుంటున్నారు. వీరి అభివృద్ధి గురించి వీరి వేషభాషణాదులమీద గనిశెట్టి రాములు ‘చీకటి బ్రతుకుల్లో గోసంగిలు’ (2004) అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో గోసంగిలు వాడే కోడ్‌ భాషను మిర్యాల సాయులు చేసిన అనువాదంకూడా ఉంది. ఉదా: ‘గుసాయిలారా సెనార్తి మన గోసంగి గూడెంలో అందర పుణ్యం మంచిగా నచ్చున్నారా!, సిర్ఫా మిర్యాల సాయిలు, మీ అమ్మా అయ్యా, నీ శాంతి, ఫికంలు అందరు పుణ్యం మంచిగా నచ్చున్నారా’ దీని అర్థం తెలుగులో… ‘పెద్ద మనుషు లారా, నమస్కారమండీ, మన గోసంగి సంఘంలో అందరు క్షేమంగా ఉన్నారా? పిలగా! మిర్యాల సాయిలు, తల్లి దండ్రీ, నీ భార్యా పిల్లలు మంచిగా ఉన్నారా?’ అని. గోసంగి సంఘాలు ఈ మధ్యనే ఆవిర్భాంలోకి వచ్చాయి. తెలంగాణలో గనిశెట్టి రాములు, మిర్యాల సాయిలు, విభూతి శంకర్‌, ఇ.ఎం. గంగాధర్‌, గంగమల్లు, బాలయ్య, పోశెట్టి, సాయన్న, గంగయ్య అబ్బయ్య, మల్లయ్య, సదుల కిష్టయ్య రాములమ్మ, లక్ష్మి మొదలగు వారు గోసంగిల అభివృద్ధికి కృషి చేస్తున్నవారిలో ముఖ్యులు. రాయలసీమలో మారయ్య, పెంటయ్య, రాసారి ఇస్తారె, ఆంధ్రాలో భూమయ్య, దశరథ్‌, కిషన్‌, రాజలింగం, పరశురాం, బుద్ది రాజు, పంతుకుమార్‌ తదితరులు కూడా వీరి అభివృద్ధిలో కొనసాగుతున్నారు. ఒకపక్క ప్రపంచంలోనే పేరెన్నిక గన్న హైటెక్‌ సిటీ అని ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన పెద్ద పెద్ద టెక్నాలజీ వ్యవస్థలు పెరుగుతున్నా… ఇంకొక పక్క గోసంగి కులంలో పుట్టిన ఏ ఒక్క వ్యక్తికి కూడా చదువు రాకుండా ఉండే స్థితి. గోసంగివారు వారి పిల్లలకు విద్యాభ్యాసాలు నేర్పించటానికి ముందుకు రారు. ఒక అక్షర జ్ఞానిగా బతకమని తమ పిల్లలకు చెప్పుకోరు. ఇలాంటి ఆలోచనలే గోసంగులకు రాదు. ఈ జాతిలోని వారు ఎప్పటికీ బానిసలుగానే ఉండాలనే ఆలోచన పుట్టుకతోనే వచ్చింది. అతి పెద్దదైన భారత రాజ్యాంగ వ్యవస్థ వీరికి చాలా బహుదూరం. వీరికి ఏ రంగంలోనూ ప్రామాణికమైన ఆలోచనలు రావు. సమాజంలో ఏవిధంగాబతకాలి? రాజ్యాంగం తమకు ఒనగూర్చిన హక్కులే మిటి? ఏ ప్రభుత్వం కింద, ఎందుకు, ఎవరికోసం బతుకుతున్నాం!, పోనీ మా సంతతినన్నా ఉన్నత విద్యావంతులుగా తయారు చేయాలి, ఉద్యోగస్తులుగా ఎదిగేటట్లు చేయాలి, లేదా అన్నింటికంటే ముఖ్యమైన రాజకీయ వ్యవస్థలో వీరిని రాణించే విధంగా తయారు చేయాలనే ఆలోచనలు గోసంగి కుల వారసు లకు లేకపోవటం విచారకరం. వీరి అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

గోసంగి గోస


గోసంగి గోస

గోసంగి ప్రాచీన జానపద కళారూపం. నేటి తరానికి దాదాపుగా ఈ కళారూపం గురించి తెలియకుండా పోయింది. ఈ కళా రూపం జాడ తెలుసుకోవాలంటే మన తెలంగాణలో నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, జిల్లాలకు వెళ్ళాల్సిందే. ప్రజానాట్యమండలి ఈ కళారూపానికి ప్రాణంబోసి బతికిస్తున్నది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ కళారూపాన్ని ప్రస్తుత సమస్యలకు అన్వయించి పునరుజ్జీవింపచేసిన విధానం తెలియజేస్తోంది ఈ గోసంగి గోస.

ఎస్‌.సి సామాజిక వర్గంలోని చిందు, మాష్టి ఉపకులాలకు చెందిన కళాకారులు గోసంగి కళారూపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ మాష్టిలు లేదా చిందులు సంచార జీవనం చేస్తుంటారు. ఎస్‌.సి.లలో ఒక తెగయైన మాదిగల పుట్టుక చరిత్రను చెప్పే జాంబవపురాణం పేరుతో ఆటాడుతారు.
సృష్టికి మూలం ఆది జాంబవుడని అతని తర్వాతే సృష్టి ఇంతగా విస్తరింపబడ్డదని ఆ జాంబవుని కథను ఆటగా ప్రదర్శిస్తారు. ప్రధానంగా ఇందులో వివక్షతకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలు అగ్రకులాల వారితో పోరాడతారు. అంతేకాదు మనుధరర్మ శాస్త్రంలో పేర్కొనబడిన పంచమ కులానికి చెందిన వారి శ్రమ మీదనే సమస్త కులాల జీవనం ముడిపడి వున్నదని ఈ పురాణం చెబుతుంది. అగ్రకులాలు మరియు అణగారిన కులాల మధ్య జరిగిన పోరాటంలో అణగారిన కులాల వారే విజయం సాధించినట్టు ఈ కథలో మనకు కనపడుతుంది. సబ్బండ కులాలు ఈ నిమ్న కులానికి చెందిన వారితో పనిచేయించుకుంటూ బతికే విధానం ఇందులో కనబడుతుంది. మరియు ఈ అణగారిన కులాలు పనిలో వాడే పనిముట్లు కూడా ఏదో ఒక దశలో ఇతర కులాల వారికి అక్కరకొస్తాయనేది ఈ కథలోని సన్నివేశాలలో మనకు కనబడుతుంది.
గోసంగి కళారూపం ప్రదర్శనలో మాష్టి లేదా చిందు వారి కుటుంబ సభ్యులే కళాకారులుగా వుంటారు. సుమారు 15-20 మంది వరకు కళాకారులుంటారు. ఈ ఆటలో స్త్రీలు కూడా పాల్గొంటారు. పురుషులు పాత్రలు ధరించి పాడే పాటలకు స్త్రీలు తాళాలు వాయిస్తూ లయబద్దంగా రాగాలను ఆలపిస్తూ కోరస్‌ పాడుతుంటారు. వెనుక వీరు కోరస్‌ పాడుతుంటే స్టేజి మీద పాత్రధారుల అభినయానికి ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే!
చిన్న కత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసె వీర బాహు నేనేనయా
తాలే లెల్లియలో శివతాలే లెల్లీయలో
తాలెల్లె తాలెల్లె యంటారు గాని మాలెల్లె మాలెల్లె యనరేందిరా
తాలీలా లీలా లీలా మాయా లీలా మా లీలలో
... అంటూ సాగే పాటను చూస్తే ఈ కళారూపం స్వభావం అర్థమవుతుంది. 
కథలోని దరువులు దాదాపుగా తాలెల్లె తాలెల్లె లెల్లీయలో అనే ఊత పదముల కోరస్‌ కు అనుగుణంగా శ్రోతలకు వినసొంపుగా వుంటాయి. ఈ ఆటను రాత్రిళ్ళే కాకుండా పగటి పూట కూడా ప్రదర్శిస్తారు. గోసంగి కళాకారులు ఎవరి చరిత్రనైతే కథగా చెబుతారో వారి వద్దనుండే పారితోషికం (త్యాగం) స్వీకరించి జీవనం గడుపుతారు. ఆటకు సంబంధించినన్ని రోజులు వీరి కుటుంబం లోని ఆడవాళ్ళు వారి సామాజిక తెగయైన మాదిగ కుల స్థుల ఇంటింటికి వెళ్ళి అన్నం, కూరలు అడు క్కొని తింటారు. చివరి రోజు ఇంటికి 5 లేదా పది రూపా యలు అందరి దగ్గర సమానంగా వసూలు చేసిన డబ్బును ''త్యాగం'' అనే పేరుతో గౌరవంగా స్వీకరిస్తారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో అందరి కులవృత్తులు అంతరించిన తీరుగానే వీరి కులవృత్తియైన గోసంగి కళారూపం కూడా గోస యెల్లదీస్తోంది. కొంతమంది కళాకారులు నమూనా చూయించుకోవడానికి ఈ కళారూపాన్ని గుర్తు చేసుకొని నేటికీ నిలబెడుతున్నారు.
ఈ కథలోని దరువులు యక్షగానం లోని దరువులుగా అనిపిస్తాయి. కాని యక్షగానం కంటే వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ కళారూపంలో. మామూలుగా మద్దెల వాయిధ్యం వుంటుంది. చిన్న హార్మోనియం లేదా స్తుతి పెట్టె , తాళంజోళ్ళు, కాళ్ళకు గజ్జెలు ముఖ్యమైన వాయిద్య విశేషాలు. ఆయా పాత్రల స్వభావం బట్టి ఉపయోగించే వస్తువులు ఎటూ ఉండనే ఉంటాయి. పంచెలు కట్టుకోవడం కళాకారుల ఆనవాయితీ.
చిందు, మాష్టి కళాకారులు ఈ గోసంగి కళను ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని నేర్చుకున్న దాఖలాలు మనకు కనబడవు. జనం బాణీలనే వారు సొంతం చేసుకొని వాటికి మరింత వన్నె తెచ్చేవిధంగా ఆలపిస్తారు. దాదాపు వీరంతా నిరక్షరాస్యులయి వుంటారు. కాని కథను మాత్రం క్రమం తప్పకుండా వినిపిస్తారు.
నేను 3వ తరగతి చదువుతున్నపుడు మా వూరు పోచారంలో చిందువారు ఈ గోసంగి ఆటను ఆడంగా చూశాను. ఆ రోజుల్లో కులవివక్ష గ్రామాల్లో బాగా వుండేది. నేను చదువుకునే రోజుల్లో మిగతా కులస్తుల పిల్లలతో బాగా కలిసిమెలిసి తిరిగే వాడిని కాదు. యెందుకంటే వారి తల్లిదండ్రులు చూసి కొడతారో లేక తిడతారోనన్న భయం నాకు వుండేది. అటువంటి పరిస్థితులలో గోసంగి కళారూపం చూసిన నాకు యెక్కడాలేని సంతోషం కల్గింది. అగ్రకులాల వారిని ఏ మాత్రం లెక్కచెయ్యకుండా ఆటలో జరిగే సంవాదాలు నా మనసులో బాగా నాటుకున్నాయి. మనం చెపేఆ్పలనుకున్న విషయం ఎంత చేదైనదైనా, విప్లవాత్మకమైనదైనా కథారూపంలో చెబితే అగ్రకులాల వారికి కోపం రాదేమో అని అనుకునే వాడిని. ఈ వివక్షతకు వ్యతిరేకంగా పాటరాయాల నిపించేది.
రాష్ట్రమంతటా ఆత్మగౌరవ పోరాటానికి దళితులు సమీకృత మౌతున్న సమయమొచ్చింది. నాకు దళితులెదుర్కుంటున్న వివక్షత పై మరొక కళారూపం తయారు చేయాలనిపించింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రజానాట్యమండలి తొలిరాష్ట్ర మహాసభలు రవీంధ్ర భారతిలో జరిగాయి. ఆ సందర్భంగా గోసంగి రూపంలో ఓ కథను ప్రదర్శించాం. మేధావులు, కళాభిమానులు, కళాకారులు, ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వేదిక పై కళారూపాన్ని తిలకించి కొన్ని మంచి సూచనలు కూడా చేశారు.
కళారూపం తయారు చేసిన తీరు: ఈ గోసంగి కళారూపం తయారికి నాకున్న పరిజ్ఞానంతో పాటు బయట నుంచి మరింత సహకారం తీసుకోవాలనిపించింది. నల్గొండ జిల్లా భువనగిరి మండలంలో ముత్తిరెడ్డి గూడెం అనే గ్రామంలో నా మిత్రుడు గడ్డ శీను ఇంటికి తోటి కళాకారుడైన వెంకట్‌ రెడ్డిని తీసుకొని పోయినాను. ఈ కళారూపం యొక్క అవసరాన్ని తెలియజేశాను. ఈ కథను నా పిల్లలు నేర్చుకొమ్మంటే నేర్చుకుంటలేరు. నీ కెట్ల బుద్దిపుట్టింది సార్‌ మా కథంటే అని అడిగాడు శీను వాళ్ళ నాయిన. అవసరమేందో చెప్పాను. దరువులు, వచనం, కథ సాగే తీరు అన్నీ వివరంగా అడిగితెల్సుకున్నాను. మా కులవృత్తియైన కళారూపాన్ని మీరైనా బతికించండి సారూ అంటూ శీను వాళ్ళ అమ్మనాన్నలిద్దరు చేతులు జోడించి నాకు దండంబెడుతుంటే నా కండ్లల్లో నీళ్లు తిరిగినవి. తప్పకుండా మీ ఆశీస్సులతో మంచి కళారూపం తయారు చేస్తానని మాటిచ్చి వచ్చాను.
మొదటగా ఇతివృత్తం ఏదుంటే బాగుంటదో నని బాగా ఆలోచించాను. కులాలు ఎలా ఏర్పడ్డాయో వాటికి మూలం ఇందులో చెప్పాలనుకు న్నాను. ప్రజానాట్యమండలిలో రచయితగా అడుగుపెట్టినప్పటి నుండి అనేక క్లాసులు విన్నాను. సమాజ పరిణామ క్రమం గురించి ఈ కథలో చెప్పాలనిపించింది. మనుధర్మ శాస్త్రం యొక్క మర్మం నాకు తెల్సిన మేరకు చెప్పాలనుకున్నాను. 
కథలో దళితుడిగా జాంబవుడనే పాత్రను ఇతని భావాలకు వ్యతిరేకంగా మనుధర్మ శాస్త్రాన్ని నెత్తిన మోసే ఒక బ్రహ్మాణుడి పాత్రను ప్రవేశపెట్టాను. అందులో ఒక పాట ఇది...
జాంబవుడు: తాలు గాలికి కొట్టుకపోతుంటె జూపెట్టి తాలెల్లె తాలెల్లెయంటారురా 
మాలు రాసులకొద్ది మూలకు బడుతుంటె మాలెల్లె మాలెల్లె యనరేందిరా
ఒక భూస్వామి కల్లంలో గాలికి కొట్టుకుపోయే తాలును కూలీలకు జూయించి అంతా తాలుబోయింది పంట బాగా రాలేదు. కనుక కూలి సరిపడా అడగొద్దంటాడు. అందుకనే పాటలో తాలెల్లె తాలెల్లె అని అరుస్తాడు. 
మాలు అంటే ఇక్క వరిధాన్యం. గట్టిగింజలు రాసులకొద్ది గరిసెల్లో దాచుకుంటరు కాని పాటలో మాలెల్లె మాలెల్లె అనడు. ఇది అసలు రహస్యం.
జాంబవుడు: తక్కువ కులమంటె తొక్కిసంపుత సూడుకులమెట్ల బుట్టిందో నే జెప్తరా
అని బ్రాహ్మణునితో వాదానికి దిగుతాడు.
ఆదిమ కాలంలో మనిషి అవసరాలకు ఇనుమును కత్తిగా తయారు చేసికొని, వేటాడి, సంపద పోగేసిన క్రమంలో ఆస్తి తగాదాలు ఎలా మొదలైనయో జాంబవుడు వివరించి చెబుతాడు. చేసిన వృత్తిని బట్టి ఆ కాలంలో కులం ఆపాదించబడినదని చెబుతాడు.
బ్రాహ్మణుడేమో కులాలను దేవుడు సృష్టించాడని బ్రహ్మముఖం లోంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఉదరం నుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు అతి శూద్రులు పుట్టిండ్రని చెబుతాడు.
బ్రాహ్మణుని పాట...
వేలు వేలుకు మధ్య వ్యత్యాసమున్నట్టె మనుషుల్లో కులభేదముంటుందిరా 
తాలీలా లీలా లీలా మాయా లీలా మాలీలలో 
ఎక్కువ కులస్తులమని ఎగిరిపడే వాళ్ళకు ఈ కథలో ఒక సవాల్‌ విసురుతాడు జాంబవుడు
ఎక్కువంటు మురిసి పోతావు పూజారి నీలో ఎక్కువ ఏముందో చూపెట్టు 
ఎక్కువంటు నిక్కినీల్గకు తొక్కెదా పాతాళమునకు
అక్కరలు మా తోటి దీర్చుక అవతలుండుమంటరేలా
పనిలో మీకంటె మేం గొప్ప పూజారినీకు తిని తిరిగే హక్కులేదంట 
అని బ్రాహ్మణున్ని గద్దించి భయపెడ్తాడు. కథ చివరలో జాంబవుడు అంబేద్కర్‌ను ఏకాదశవతారంగా వర్ణిస్తాడు. 
అప్పడు బ్రాహ్మణుడు జాంబవున్ని తప్పు బట్టాలని చూస్తాడు. ఎట్లంటే దశావతారాలుగా భగవంతుడు అవతరించి దుష్టశిక్షగా శిష్టరక్షణ కై నిలిచాడు. ఏకాదశవతారమెక్కడిదిరా అని అంటాడు. అప్పుడు జాంబవుడు స్పంధించి ఏరు బ్రాహ్మణ పది అవతారాలు యెత్తినా మా బతుకుల్లో పైసొంతు ఫలితం నేటికి కనబడలేదు. మాకు దేవుడంటే అంబేద్కర్‌ కారల్‌ మార్క్స్‌లేనని బెబుతాడు.
ఏకాదశవతారమెత్తి వచ్చిండు ఈ లోకంలో భీమారావంబేద్కరూ 
మనిషిని మనిషిగ జూసేటి రోజులు మారుకుంటు వచ్చేనన్నాడురా
లండను లైబ్రరీలున్న పుస్తకాలు దండిగ జదివింది ఇద్దరు రా 
అంబేద్కరూ మార్క్సు ఆశయాల బాట మరువక మేమంత నడిసేమురా
అని భవిష్యత్తు వాక్యం చెప్పడంతో కథ ముగుస్తుంది. సమాజ పరిణామక్రమాన్ని కులాలపుట్టుక, ఆస్తిపంపకం, వ్యత్యా సాలు ఏర్పడ్డ తీరు ఈ కథలో ప్రధాన అంశాలుగా ప్రేక్షకులకు కనబడతాయి. అభ్యుదయ భావాలు కల్గిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. జాంబవుని పాత్ర ప్రవేశించే సమయంలో డప్పుల హోరు, జాంబవుని విన్యాసాలు, ఆతని వేషాధారణ చూపరులను బాగా ఆకట్టుకుంది. ప్రాచీన కళారూపం ప్రజాదరణ పొందిందనడానికి ఒక నిదర్శనంగా నిలిచింది గోసంగి.