Friday, January 4, 2019

గోసంగి గోస


గోసంగి గోస

గోసంగి ప్రాచీన జానపద కళారూపం. నేటి తరానికి దాదాపుగా ఈ కళారూపం గురించి తెలియకుండా పోయింది. ఈ కళా రూపం జాడ తెలుసుకోవాలంటే మన తెలంగాణలో నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, జిల్లాలకు వెళ్ళాల్సిందే. ప్రజానాట్యమండలి ఈ కళారూపానికి ప్రాణంబోసి బతికిస్తున్నది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ కళారూపాన్ని ప్రస్తుత సమస్యలకు అన్వయించి పునరుజ్జీవింపచేసిన విధానం తెలియజేస్తోంది ఈ గోసంగి గోస.

ఎస్‌.సి సామాజిక వర్గంలోని చిందు, మాష్టి ఉపకులాలకు చెందిన కళాకారులు గోసంగి కళారూపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ మాష్టిలు లేదా చిందులు సంచార జీవనం చేస్తుంటారు. ఎస్‌.సి.లలో ఒక తెగయైన మాదిగల పుట్టుక చరిత్రను చెప్పే జాంబవపురాణం పేరుతో ఆటాడుతారు.
సృష్టికి మూలం ఆది జాంబవుడని అతని తర్వాతే సృష్టి ఇంతగా విస్తరింపబడ్డదని ఆ జాంబవుని కథను ఆటగా ప్రదర్శిస్తారు. ప్రధానంగా ఇందులో వివక్షతకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలు అగ్రకులాల వారితో పోరాడతారు. అంతేకాదు మనుధరర్మ శాస్త్రంలో పేర్కొనబడిన పంచమ కులానికి చెందిన వారి శ్రమ మీదనే సమస్త కులాల జీవనం ముడిపడి వున్నదని ఈ పురాణం చెబుతుంది. అగ్రకులాలు మరియు అణగారిన కులాల మధ్య జరిగిన పోరాటంలో అణగారిన కులాల వారే విజయం సాధించినట్టు ఈ కథలో మనకు కనపడుతుంది. సబ్బండ కులాలు ఈ నిమ్న కులానికి చెందిన వారితో పనిచేయించుకుంటూ బతికే విధానం ఇందులో కనబడుతుంది. మరియు ఈ అణగారిన కులాలు పనిలో వాడే పనిముట్లు కూడా ఏదో ఒక దశలో ఇతర కులాల వారికి అక్కరకొస్తాయనేది ఈ కథలోని సన్నివేశాలలో మనకు కనబడుతుంది.
గోసంగి కళారూపం ప్రదర్శనలో మాష్టి లేదా చిందు వారి కుటుంబ సభ్యులే కళాకారులుగా వుంటారు. సుమారు 15-20 మంది వరకు కళాకారులుంటారు. ఈ ఆటలో స్త్రీలు కూడా పాల్గొంటారు. పురుషులు పాత్రలు ధరించి పాడే పాటలకు స్త్రీలు తాళాలు వాయిస్తూ లయబద్దంగా రాగాలను ఆలపిస్తూ కోరస్‌ పాడుతుంటారు. వెనుక వీరు కోరస్‌ పాడుతుంటే స్టేజి మీద పాత్రధారుల అభినయానికి ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే!
చిన్న కత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసె వీర బాహు నేనేనయా
తాలే లెల్లియలో శివతాలే లెల్లీయలో
తాలెల్లె తాలెల్లె యంటారు గాని మాలెల్లె మాలెల్లె యనరేందిరా
తాలీలా లీలా లీలా మాయా లీలా మా లీలలో
... అంటూ సాగే పాటను చూస్తే ఈ కళారూపం స్వభావం అర్థమవుతుంది. 
కథలోని దరువులు దాదాపుగా తాలెల్లె తాలెల్లె లెల్లీయలో అనే ఊత పదముల కోరస్‌ కు అనుగుణంగా శ్రోతలకు వినసొంపుగా వుంటాయి. ఈ ఆటను రాత్రిళ్ళే కాకుండా పగటి పూట కూడా ప్రదర్శిస్తారు. గోసంగి కళాకారులు ఎవరి చరిత్రనైతే కథగా చెబుతారో వారి వద్దనుండే పారితోషికం (త్యాగం) స్వీకరించి జీవనం గడుపుతారు. ఆటకు సంబంధించినన్ని రోజులు వీరి కుటుంబం లోని ఆడవాళ్ళు వారి సామాజిక తెగయైన మాదిగ కుల స్థుల ఇంటింటికి వెళ్ళి అన్నం, కూరలు అడు క్కొని తింటారు. చివరి రోజు ఇంటికి 5 లేదా పది రూపా యలు అందరి దగ్గర సమానంగా వసూలు చేసిన డబ్బును ''త్యాగం'' అనే పేరుతో గౌరవంగా స్వీకరిస్తారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో అందరి కులవృత్తులు అంతరించిన తీరుగానే వీరి కులవృత్తియైన గోసంగి కళారూపం కూడా గోస యెల్లదీస్తోంది. కొంతమంది కళాకారులు నమూనా చూయించుకోవడానికి ఈ కళారూపాన్ని గుర్తు చేసుకొని నేటికీ నిలబెడుతున్నారు.
ఈ కథలోని దరువులు యక్షగానం లోని దరువులుగా అనిపిస్తాయి. కాని యక్షగానం కంటే వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ కళారూపంలో. మామూలుగా మద్దెల వాయిధ్యం వుంటుంది. చిన్న హార్మోనియం లేదా స్తుతి పెట్టె , తాళంజోళ్ళు, కాళ్ళకు గజ్జెలు ముఖ్యమైన వాయిద్య విశేషాలు. ఆయా పాత్రల స్వభావం బట్టి ఉపయోగించే వస్తువులు ఎటూ ఉండనే ఉంటాయి. పంచెలు కట్టుకోవడం కళాకారుల ఆనవాయితీ.
చిందు, మాష్టి కళాకారులు ఈ గోసంగి కళను ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని నేర్చుకున్న దాఖలాలు మనకు కనబడవు. జనం బాణీలనే వారు సొంతం చేసుకొని వాటికి మరింత వన్నె తెచ్చేవిధంగా ఆలపిస్తారు. దాదాపు వీరంతా నిరక్షరాస్యులయి వుంటారు. కాని కథను మాత్రం క్రమం తప్పకుండా వినిపిస్తారు.
నేను 3వ తరగతి చదువుతున్నపుడు మా వూరు పోచారంలో చిందువారు ఈ గోసంగి ఆటను ఆడంగా చూశాను. ఆ రోజుల్లో కులవివక్ష గ్రామాల్లో బాగా వుండేది. నేను చదువుకునే రోజుల్లో మిగతా కులస్తుల పిల్లలతో బాగా కలిసిమెలిసి తిరిగే వాడిని కాదు. యెందుకంటే వారి తల్లిదండ్రులు చూసి కొడతారో లేక తిడతారోనన్న భయం నాకు వుండేది. అటువంటి పరిస్థితులలో గోసంగి కళారూపం చూసిన నాకు యెక్కడాలేని సంతోషం కల్గింది. అగ్రకులాల వారిని ఏ మాత్రం లెక్కచెయ్యకుండా ఆటలో జరిగే సంవాదాలు నా మనసులో బాగా నాటుకున్నాయి. మనం చెపేఆ్పలనుకున్న విషయం ఎంత చేదైనదైనా, విప్లవాత్మకమైనదైనా కథారూపంలో చెబితే అగ్రకులాల వారికి కోపం రాదేమో అని అనుకునే వాడిని. ఈ వివక్షతకు వ్యతిరేకంగా పాటరాయాల నిపించేది.
రాష్ట్రమంతటా ఆత్మగౌరవ పోరాటానికి దళితులు సమీకృత మౌతున్న సమయమొచ్చింది. నాకు దళితులెదుర్కుంటున్న వివక్షత పై మరొక కళారూపం తయారు చేయాలనిపించింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రజానాట్యమండలి తొలిరాష్ట్ర మహాసభలు రవీంధ్ర భారతిలో జరిగాయి. ఆ సందర్భంగా గోసంగి రూపంలో ఓ కథను ప్రదర్శించాం. మేధావులు, కళాభిమానులు, కళాకారులు, ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వేదిక పై కళారూపాన్ని తిలకించి కొన్ని మంచి సూచనలు కూడా చేశారు.
కళారూపం తయారు చేసిన తీరు: ఈ గోసంగి కళారూపం తయారికి నాకున్న పరిజ్ఞానంతో పాటు బయట నుంచి మరింత సహకారం తీసుకోవాలనిపించింది. నల్గొండ జిల్లా భువనగిరి మండలంలో ముత్తిరెడ్డి గూడెం అనే గ్రామంలో నా మిత్రుడు గడ్డ శీను ఇంటికి తోటి కళాకారుడైన వెంకట్‌ రెడ్డిని తీసుకొని పోయినాను. ఈ కళారూపం యొక్క అవసరాన్ని తెలియజేశాను. ఈ కథను నా పిల్లలు నేర్చుకొమ్మంటే నేర్చుకుంటలేరు. నీ కెట్ల బుద్దిపుట్టింది సార్‌ మా కథంటే అని అడిగాడు శీను వాళ్ళ నాయిన. అవసరమేందో చెప్పాను. దరువులు, వచనం, కథ సాగే తీరు అన్నీ వివరంగా అడిగితెల్సుకున్నాను. మా కులవృత్తియైన కళారూపాన్ని మీరైనా బతికించండి సారూ అంటూ శీను వాళ్ళ అమ్మనాన్నలిద్దరు చేతులు జోడించి నాకు దండంబెడుతుంటే నా కండ్లల్లో నీళ్లు తిరిగినవి. తప్పకుండా మీ ఆశీస్సులతో మంచి కళారూపం తయారు చేస్తానని మాటిచ్చి వచ్చాను.
మొదటగా ఇతివృత్తం ఏదుంటే బాగుంటదో నని బాగా ఆలోచించాను. కులాలు ఎలా ఏర్పడ్డాయో వాటికి మూలం ఇందులో చెప్పాలనుకు న్నాను. ప్రజానాట్యమండలిలో రచయితగా అడుగుపెట్టినప్పటి నుండి అనేక క్లాసులు విన్నాను. సమాజ పరిణామ క్రమం గురించి ఈ కథలో చెప్పాలనిపించింది. మనుధర్మ శాస్త్రం యొక్క మర్మం నాకు తెల్సిన మేరకు చెప్పాలనుకున్నాను. 
కథలో దళితుడిగా జాంబవుడనే పాత్రను ఇతని భావాలకు వ్యతిరేకంగా మనుధర్మ శాస్త్రాన్ని నెత్తిన మోసే ఒక బ్రహ్మాణుడి పాత్రను ప్రవేశపెట్టాను. అందులో ఒక పాట ఇది...
జాంబవుడు: తాలు గాలికి కొట్టుకపోతుంటె జూపెట్టి తాలెల్లె తాలెల్లెయంటారురా 
మాలు రాసులకొద్ది మూలకు బడుతుంటె మాలెల్లె మాలెల్లె యనరేందిరా
ఒక భూస్వామి కల్లంలో గాలికి కొట్టుకుపోయే తాలును కూలీలకు జూయించి అంతా తాలుబోయింది పంట బాగా రాలేదు. కనుక కూలి సరిపడా అడగొద్దంటాడు. అందుకనే పాటలో తాలెల్లె తాలెల్లె అని అరుస్తాడు. 
మాలు అంటే ఇక్క వరిధాన్యం. గట్టిగింజలు రాసులకొద్ది గరిసెల్లో దాచుకుంటరు కాని పాటలో మాలెల్లె మాలెల్లె అనడు. ఇది అసలు రహస్యం.
జాంబవుడు: తక్కువ కులమంటె తొక్కిసంపుత సూడుకులమెట్ల బుట్టిందో నే జెప్తరా
అని బ్రాహ్మణునితో వాదానికి దిగుతాడు.
ఆదిమ కాలంలో మనిషి అవసరాలకు ఇనుమును కత్తిగా తయారు చేసికొని, వేటాడి, సంపద పోగేసిన క్రమంలో ఆస్తి తగాదాలు ఎలా మొదలైనయో జాంబవుడు వివరించి చెబుతాడు. చేసిన వృత్తిని బట్టి ఆ కాలంలో కులం ఆపాదించబడినదని చెబుతాడు.
బ్రాహ్మణుడేమో కులాలను దేవుడు సృష్టించాడని బ్రహ్మముఖం లోంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఉదరం నుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు అతి శూద్రులు పుట్టిండ్రని చెబుతాడు.
బ్రాహ్మణుని పాట...
వేలు వేలుకు మధ్య వ్యత్యాసమున్నట్టె మనుషుల్లో కులభేదముంటుందిరా 
తాలీలా లీలా లీలా మాయా లీలా మాలీలలో 
ఎక్కువ కులస్తులమని ఎగిరిపడే వాళ్ళకు ఈ కథలో ఒక సవాల్‌ విసురుతాడు జాంబవుడు
ఎక్కువంటు మురిసి పోతావు పూజారి నీలో ఎక్కువ ఏముందో చూపెట్టు 
ఎక్కువంటు నిక్కినీల్గకు తొక్కెదా పాతాళమునకు
అక్కరలు మా తోటి దీర్చుక అవతలుండుమంటరేలా
పనిలో మీకంటె మేం గొప్ప పూజారినీకు తిని తిరిగే హక్కులేదంట 
అని బ్రాహ్మణున్ని గద్దించి భయపెడ్తాడు. కథ చివరలో జాంబవుడు అంబేద్కర్‌ను ఏకాదశవతారంగా వర్ణిస్తాడు. 
అప్పడు బ్రాహ్మణుడు జాంబవున్ని తప్పు బట్టాలని చూస్తాడు. ఎట్లంటే దశావతారాలుగా భగవంతుడు అవతరించి దుష్టశిక్షగా శిష్టరక్షణ కై నిలిచాడు. ఏకాదశవతారమెక్కడిదిరా అని అంటాడు. అప్పుడు జాంబవుడు స్పంధించి ఏరు బ్రాహ్మణ పది అవతారాలు యెత్తినా మా బతుకుల్లో పైసొంతు ఫలితం నేటికి కనబడలేదు. మాకు దేవుడంటే అంబేద్కర్‌ కారల్‌ మార్క్స్‌లేనని బెబుతాడు.
ఏకాదశవతారమెత్తి వచ్చిండు ఈ లోకంలో భీమారావంబేద్కరూ 
మనిషిని మనిషిగ జూసేటి రోజులు మారుకుంటు వచ్చేనన్నాడురా
లండను లైబ్రరీలున్న పుస్తకాలు దండిగ జదివింది ఇద్దరు రా 
అంబేద్కరూ మార్క్సు ఆశయాల బాట మరువక మేమంత నడిసేమురా
అని భవిష్యత్తు వాక్యం చెప్పడంతో కథ ముగుస్తుంది. సమాజ పరిణామక్రమాన్ని కులాలపుట్టుక, ఆస్తిపంపకం, వ్యత్యా సాలు ఏర్పడ్డ తీరు ఈ కథలో ప్రధాన అంశాలుగా ప్రేక్షకులకు కనబడతాయి. అభ్యుదయ భావాలు కల్గిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. జాంబవుని పాత్ర ప్రవేశించే సమయంలో డప్పుల హోరు, జాంబవుని విన్యాసాలు, ఆతని వేషాధారణ చూపరులను బాగా ఆకట్టుకుంది. ప్రాచీన కళారూపం ప్రజాదరణ పొందిందనడానికి ఒక నిదర్శనంగా నిలిచింది గోసంగి.

No comments:

Post a Comment